
అన్న కళ్లల్లో తమ్ముడు ఆనందం
ఎన్నికలకు ముందు నుంచి నాగబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికి నెరవేరింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారా? ఇవ్వరా? అనే ఉత్కంఠకు ముగింపు పడింది. గత కొద్ది రోజులుగా నాగబాబు ఎమ్మెల్సీ పదవిపై కూటమి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఎమ్మెల్సీ ఇవ్వక పోవచ్చు, ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్‌గా ఇస్తారనే చర్చలు జరిగాయి. వాటన్నింటికీ ముగింపు పలుకుతూ తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ బుధవారం ప్రకటించారు. జనసేన పార్టీకి నాగబాబు ఎనలేని సేవలు అందించారని, ఆ మేరకు నాగబాబును అభ్యర్థిగా ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం అందించారు. నాగబాబు నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ సూచించారు.
తొలుత అనకాపల్లి ఎంపీగా బరిలోకి దిగాలని కోరుకున్నారు. ఆమేరకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. చివరి నిముషలంలో సీట్ల సర్థుబాటల్లో సీఎం రమేష్‌కు కేటాయించారు. దీంతో నాగబాబు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. తర్వాత రాజ్యసభకు వెళ్లాలని ఆశ పడ్డారు. మూడు స్థానాల్లో ఒక స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. నాగబాబు తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరపతిని ఉపయోగించి ఇప్పిస్తారని కలలు కన్నారు. దీని కోసం ఢిల్లీ పెద్దలతో కూడా చర్చలు జరిపారు పవన్ కల్యాణ్. కానీ అది కూడా చివరి నిముషంలో చేజారి పోయింది. వాటిని బీదా మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, సానా సతీష్‌బాబులకు కేటాయించడంతో రాజ్యసభ సీటు దక్కకుండా పోయింది. దీంతో మరో సారి నాగబాబు నిరుత్సాహానికి గురయ్యారు.
తర్వాత నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయం తెరపైకొచ్చింది. తొలుత ఎమ్మెల్సీని చేసి తర్వాత మంత్రిని చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రి వర్గంలో తీసుకుంటున్నట్లు జనసేన పార్టీకి బదులుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. నాటి నుంచి నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, తద్వారా మంత్రి పదవి ఇస్తారనే చర్చ కూటమి వర్గాల్లో నడుస్తోంది. తాజాగా ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో నాగబాబు ప్రస్తావన తెరపైకొచ్చింది. అసెంబ్లీలో ఇటీవల భేటీ అయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు దాదాపు రెండు గంటల పాటు దీనిపైన చర్చలు జరిపారు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ, ఒక ఎమ్మెల్సీ స్థానం జనసేనకు ఇవ్వాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చర్చించుకుని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైంది. తర్వాత మంత్రి పదవే తరువాయనే టాక్ జనసేన శ్రేణుల్లో వినిపిస్తోంది.
Next Story