
పాస్టర్ ప్రవీణ్ పగడాలను కొట్టి చంపారా
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం సంచలనం సృష్టించింది. అత్యంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి బుధవారం సాయంత్రం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమర్టం నిర్వహించారు. అనంతరం భారీ పోలీసుల బందోబస్తుల నడుమ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. గురువారం ఉదయం ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని సికిందరాబాద్ తిరుమలగిరిలోని స్వగృహం నుంచి సందర్శనం కోసం సికిందరాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి తరలించనున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సందర్శనం కోసం ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సెంటినరీ బాప్టిస్టు చర్చి నుంచి తిరుమలగిరి బాప్టిస్ట్ చర్చి సమాధి తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ వార్త విన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవ, దళిత సంఘాలు, పాస్టర్లు, క్రైస్తవులు పెద్ద ఎత్తున రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదం కాదని, హత్యేనని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిని పారదర్శకంగా నిగ్గు తేల్చాల మాజీ ఎంపీ హర్షకుమార్, ప్రపంచ శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్, ఇతర పాస్టర్లు, క్రైస్తవులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కావాలనే ప్రవీణ్ పగడాలను కొట్టి చంపారని, రక్తపు మడుగులోనే ప్రవీణ్ పడున్నారని, పోలీసులు చెబుతున్న దానిలో పొంతన లేదన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి హత్య వెనుకున్న పెద్దలను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, తీవ్ర ఉద్రిక్త పరస్థితుల మధ్య ప్రవీణ్ పగడాల మృతదేహానికి బుధవారం సాయంత్రం పోస్టుమర్టం నిర్వహించారు. అనంతరం ప్రవీణ్ మృతదేహాన్ని హైదరబాద్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు తొలుత అడ్డుకున్నారు. నిగ్గు తేల్చకుండా మృతదేహాన్ని తరలించేందుకు వీల్లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఈ నేనపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంతకీ వారి ఆందోళనలు విరమించక పోవడంతో పోలీసులు వారితో చర్చలకు జరిపేందుకు దిగారు. వారితో మాట్లాడిన తర్వాత పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు తరలించారు.
అనంతరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ బుధవారం రాత్రి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, సంఘటన వివరాలను, దర్యాప్తు వివరాలను వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా ఎఫ్‌ఐఆర్ చేసి దర్యాప్తు మొదలు పెట్టామన్నారు. సీసీ ఫుటేజీలను సేకరించామన్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ప్రవీణ్ పగడాల బుల్లెట్ మీద సోమవారం అర్థరాత్రి 11 గంటల 42 నిముషాల సమయంలో ఒక కారుతో పాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్‌ను దాటుకొని వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో ఉన్నట్లు తాము గుర్తించినట్లు తెలిపారు. రెడ్ కలర్ కారు, ప్రవీణ్ బుల్లెట్ ఒకే సారి వెళ్లాయని, ఆ కారు కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారుల టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలతో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు, దళిత, క్రైస్తవ సంఘాల ఎస్పీ నరసింహ కిషోర్ ఒక విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని కోరారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్‌లో బయలుదేరిన సమయం నుంచి రాజమండ్రి వద్ద సంఘటన జరిగిన ప్రవేదశం వరకు ఆయన జర్నీని అంతా అన్ని కోణాల్లో విచారణ చేస్తామన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి ప్రాథమిక సమచారం కూడా లభించ లేదని, దీంతో ప్రాథమిక నిర్థారణకు రాలేక పోతున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియా మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పాస్టక్ ప్రవీణ్ పగడాల మరణం మీద కొందరు రెచ్చగొట్టే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని, అలాంటి వారందరూ చట్ట పరిధిలో ఉన్నట్లు గుర్తుంచుకోవాలి హెచ్చరించారు. దుర్ఘటన జరిగిన ప్రదేశంలో డాగ్ స్కాడ్ క్లూస్ టీమ్‌తో కొన్ని కీలక ఆధారాలు సేకరించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణం పట్ల అటు తెలంగాణలోను, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోను పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లు స్పందించారు. పారదర్శకంగా విచారణ చేపడుతామని స్పష్టం చేశారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంత వరకు దీనిపై స్పందించలేదని, పవన్ కల్యాణ్ సనాతన ధర్మం నేపథ్యంలోనే ఈ దారుణం చోటు చేసుకుందని, దీనికి పవన్ కల్యాణ్ కూడా కారణమని పాస్టర్లు, క్రైస్తవ, దళిత సంఘాలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యం పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణం కేసు ఏ మలుపు తీసుకుంటుందో, చెబుతున్నట్లుగా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపిస్తుందా? వంటి అనేక అనుమానాలు దళిత, క్రైస్తవ సంఘాలలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవీణ్ పగడాల మృతి మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.
Next Story