
ఏబీ వెంకటేశ్వరావు సాగించిన పోరాటం పార్టీ కోసం కాదు కదా..
ఏబీవీ గత ప్రభుత్వంలో ఐదేళ్లు సస్పెన్స్ లో ఉన్నారు. దానిని నుంచి బయట పడేందుకు సాగించిన పోరాటం ఎవరి కోసం అనేది టీడీపీలో చర్చనియాంశమైంది.
మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరావు కు కూటమి ప్రభుత్వం ఇచ్చిన పదవిపై చర్చ మొదలైంది. అటు ప్రభుత్వంలోనూ, ఇటు కూటమి పార్టీల్లోనూ వెంకటేశ్వరావు చర్చనియాంశంగా మారారు. ప్రభుత్వం నెల రోజుల క్రితం వెంకటేశ్వరావుకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చింది. అయితే ఆయన ఆ పదవిని స్వీకరించలేదు. ఎందుకు పదవిని స్వీకరించలేదనే అంశం ఇప్పుడు కథా వస్తువుగా మారింది.
ఏబీవీ పోరాటం ఎవరిపైన చేశారు..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటెలిజెన్స్ డీజీగా అప్పటి వరకు పనిచేసిన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత విజయవాడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత డీజీ హోదాలో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నిబంధనలు పాటించకుండా అడుగులు వేశారని, ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ నేతల ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారని, అందుకు అవసరమైన సాఫ్టవేర్ ను నిబంధనలు ఉల్లంఘించి కొనుగోలు చేశారని ఆరోపిస్తూ గత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోగానే ఆయనపై వేటు వేసింది. తనను అన్యాయంగా సస్పెండ్ చేసి విధులకు దూరం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. విధుల్లోకి తీసుకోవాలని కోర్టు చెప్పినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. మరలా రెండో సారి కూడా సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చింది. సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏబీవీ తన రిటైర్డ్ మెంట్ రోజు ఉదయం డ్యూటీలో చేరి సాయంత్రానికి రిటైర్డ్ అయ్యారు. ఐదేళ్ల పాటు కోర్టు చుట్టూ న్యాయం కోసం తిరిగారు.
కూటమిలో చర్చ ఏమిటి?
ఏబీవీ అధికారిగా తన బాధ్యతల నిర్వహణ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయనపై సస్పెన్షన్ కు కారణమయ్యాయి. అందుకు తెలుగుదేశం పార్టీ కానీ, నాయకులు కానీ ఏమి చేయగలరు. తాము అధికారంలో లేకపోయినా ఆయన న్యాయ పోరాటం చేసే సమయంలో ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరించాం. అంతకంటే ఏమి చేయగలం. కూటమి అధికారంలోకి రాగానే పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇచ్చాం. ఒక మంచి అవకాశం ఆయనకు కల్పించాం. అయినా సంతృప్తి లేదు. దానికి ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీపైన అసంతృప్తిని వెళ్లగక్కితే ఎలా? అంటూ కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. ఆయన సస్పెన్స్ లో ఉన్న కాలంలో తెలుగుదేశం పార్టీ కోసం ఏమైనా పోరాటం చేశారా? కేవలం ఆయన ఉద్యోగం కాపాడుకోవడం కోసం మాత్రమే న్యాయ పోరాటం చేశారు. అది కూడా గత ప్రభుత్వం పైన చేశారు. అంతే కాని తెలుగుదేశం పార్టీ తరపున పోరాడ లేదు కదా. అలాంటప్పుడు ఆయన అడిగిన వన్నీ కావాలంటే ఎలా సాధ్యం అనే చర్చ తెలుగుదేశం పార్టీ పెద్దల్లో జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇతర మంత్రులు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు.
ఏబీవీ ఎందుకు బాధ్యతలు చేపట్టలేదు
ఏబీ వెంకటేశ్వరావును ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ 2025 ఫిబ్రవరి నెల 1న కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేటికి నెల రోజులైనా బాధ్యతలు స్వీకరించలేదు. తన సన్నిహితుల వద్ద ఆయన చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి. తాను డీజీ హోదాలో పనిచేశాను. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ చేయడంతో పాటు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ ఇబ్బందులు పడటానికి ప్రధాన కారణం తాను చంద్రబాబుకు అనుకూలంగా పనిచేయడమే కదా. అందుకు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా. నేడు డీజీ హోదాలో పని చేశాను. ఇప్పుడు వైఎస్ చైర్మన్, ఎండీ హోదాలో ఉండే వారు నా కింద పనిచేసిన వారు ఉన్నారు. సీనియర్ ను అయి ఉండి, డీజీ హోదాలో పనిచేసి ఇప్పుడు నా జూనియర్ లు చెప్పినట్లు నేను వినాలంటే నాకు బాధగా ఉండదా? అందుకే నేను ఎండీ పోస్టు కూడా ఇవ్వాలని కోరాను. అందుకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. నేను అందుకే బాధ్యతలు తీసుకోలేదని స్పష్టం చేశారు.
రిటైర్డ్ అయినా పరిపాలనా పోస్టులు ఇవ్వొచ్చని ప్రభుత్వం నిరూపించింది
ఆర్టీసీ చైర్మన్ గా పనిచేస్తున్న సిహెచ్ ద్వారకాతిరుమలరావుకు ఆర్టీసీ ఎండీగా ఇచ్చింది. దీంతో పాటు రెండు రోజుల క్రితం ప్రజా రవాణా శాఖ కమిషనర్ గా కూడా బాధ్యతలు ఇచ్చారు. ఈయన కూడా రిటైర్డ్ డీజీ కావడం విశేషం. ఆయన కంటే నేను ఎందులో తక్కువ అనే భావన ఏబీవీలో ఉంది. ఐఏస్ రాజశేఖర్ కు కూడా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రిటైర్డ్ అయిన వెంటనే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్స్ పల్ కార్యదర్శిగా నియమించారు. అంటే ప్రభుత్వం అనుకుంటే ఏ పదవిలోనైనా ఉంచొచ్చని తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం అన్నీ తానై పనిచేసిన ఏబీ వెంకటేశ్వరావుకు మాత్రం ఎందుకు కోరుకున్న పోస్టు ఇవ్వడం లేదనేది చర్చగా మారింది.