
గ్రాఫిక్ డిజైన్..
FRAUD| వితంతువుతో ప్రేమ.. వైసీపీ నేత 'డ్రామా'!
ఆమె జీవితంలోకి ప్రవేశించాడో రాజకీయ నాయకుడు. నువ్వు లేనిదే నేను లేనన్నాడు, ప్రేమన్నాడు, పెళ్లన్నాడు, ఆపై మోజు తీర్చుకున్నాడు. ఇప్పుడు చంపుతానని బెదిరిస్తున్నాడు.
ఆమె ఓ వింతంతువు.. తన బతుకు తాను బతుకుతుండగా ఆమె జీవితంలోకి ప్రవేశించాడో రాజకీయ నాయకుడు. నువ్వు లేనిదే నేను లేనన్నాడు, ప్రేమన్నాడు, పెళ్లన్నాడు, ఆమెపై మోజు తీర్చుకున్నాడు. ఆమె వద్ద నున్న డబ్బును దోచుకున్నాడు. తిరిగి ఇవ్వమన్నందుకు ఆమెనే వేధించాడు. ఎవరికైనా చెబితే తనను, తన పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు.. ఈ విషయాల్ని చెబుతూ ఆ తల్లి ఆ రాజకీయ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో నిజానిజాలేమిటో తేల్చే పనిలో పడ్డారు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు.
ఆ మహిళ ఏమని ఫిర్యాదు చేసిందంటే...
ఆమెది గుంటూరు. భర్త చనిపోయాడు. పిల్లలతో కుటుంబాన్ని ఈదుకొచ్చేందుకు గుంటూరు రూరల్ మండలం చిన్నపలకలూరు చేరింది. ఇద్దరు పిల్లలు. కుటుంబ పోషణ కోసం ఆమె తన వద్ద ఉన్న డబ్బుతో చిన్న వ్యాపారం పెట్టుకున్నారు. గుట్టుగా జీవనాన్ని సాగిస్తున్నారు. వేడి నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టుగా నాలుగు డబ్బులు వడ్డీకి కూడా ఇచ్చేవారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, జెడ్పీటీసీ సభ్యుడు తుమ్మల సుబ్బారావు తనకు వడ్డికి డబ్బులు కావాలంటూ ఆమెను ఆశ్రయించారు. ఈ క్రమంలో పరిచయం పెరిగింది. సుబ్బారావుకు అప్పటికే పెళ్లి అయింది. అయినా ఈమెతో ప్రేమాయణం సాగించారు. ఈ వ్యవహారం పెళ్లి అనే వరకు వెళ్లింది. ఆ తర్వాత ఏమైందో ఇద్దరి మధ్య బెడిసింది. తన వద్ద తీసుకున్న డబ్బులు ఇమ్మని ఆమె అడిగింది. అతను కుదరదన్నాడు. గట్టిగా నిలదీస్తే అసలు డబ్బే తీసుకోలేదని ఎదురు తిరిగాడు.
దీంతో ఆమె నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆమె నుంచి జడ్పీటీసీ సభ్యుడు తుమ్మల సుబ్బారావు వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2018లో అప్పు కోసం వెళ్లిన సుబ్బారావు ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే ఆమెతో పాటు పిల్లల్నీ చంపుతానని బెదిరించాడు. దీంతో ఆ మహిళ విషయం ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. 2024 వరకు సుబ్బారావు ఆమెతో సంబంధం కొనసాగించాడు. పెళ్లి విషయం ఎత్తితే కాలయాపన చేస్తూ రావడంతో తన వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వాలని ఆమె నిలదీసింది. అప్పటి నుంచి గొడవ ముదిరింది. "తాను అధికార పార్టీ (అప్పటి వైసీపీ) జెడ్పీటీసీ సభ్యుణ్ణని, నన్ను ఏమీ చేయలేవు.. నీకు డబ్బులు పైసా ఇవ్వను.. నీకు దిక్కున్నచోట చెప్పుకోమని" బెదిరించాడు. సుబ్బారావు తన భార్య రాజ్యలక్ష్మితో కలిసి మరోమారు వచ్చి బాధితురాలిని బెదిరించి దాడికి పాల్పడ్డాడు. రూ. 50 లక్షలు డబ్బులు తీసుకుని ఇవ్వకుండా మోసం చేసిన తుమ్మల సుబ్బారావుపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు తుమ్మల సుబ్బారావు తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని నల్లపాడు పోలీసు స్టేషన్ సీఐ వంశీధర్ చెప్పారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. మహిళను బెదిరించి వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా అందినకాడికి డబ్బులు గుంజుకున్న తీరును టీడీపీ నేతలు విమర్శించారు. ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story