కేటీఆర్ ను చేరేందుకు ఒక అడుగే దూరం
x

కేటీఆర్ ను చేరేందుకు ఒక అడుగే దూరం

ట్యాపింగ్ ఆరోపణలన్నీ కేసీఆర్(KCR), కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను చేరుకోవటానికి పోలీసులు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. తెలంగాణాలో టెలిఫోన్ ట్యాపింగ్ ఘటన బయటపడినపుడు ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. ట్యాపింగ్ ఆరోపణలన్నీ కేసీఆర్(KCR), కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో వేలాదిమంది ఫోన్లను ట్యాపింగ్(Telephone Tapping) చేసినట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ జరిపి రిపోర్టు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటుచేసింది. సిట్ అధికారులు ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల్లో కొందరిని అరెస్టులు కూడా చేశారు.

విచారణలో తాము వేలాదిమంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు అరెస్టయిన పోలీసు అధికారులు అంగీకరించారు. రాజకీయపార్టీల నేతలు, వ్యాపారాస్తులు, పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలు, జర్నలిస్టులు, సినీ సెలబ్రిటీలే కాదు చివరకు కొందరు జడ్జీల కుటుంబసభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు విచారణలో అధికారులు బయటపెట్టారు. అయితే అరెస్టు తప్పదని అర్ధమైపోయిన వెంటనే సదరు పోలీసు అధికారులు తమ మొబైల్ ఫోన్లలోని సమాచారం మొత్తాన్ని డిలీట్ చేసేశారు. కొందరేమో తమ ఫోన్లను రీసెట్ చేశారు. దాంతో వాళ్ళ మొబైల్ ఫోన్లలోని సమాచారం అంతా డిలీట్ అయిపోయింది. అయితే పోలీసుల దగ్గర కూడా అత్యంత అధునాతన టెక్నాలజీ వచ్చేసింది. డిలీట్, రీసెట్ చేసిన సమాచారం మొత్తాన్ని పోలీసులు వెనక్కు రప్పించారు. దాని ఆధారంగా మాజీ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్యకు సిట్ అధికారులు నోటీసులు జారీచేశారు.

అరెస్టయిన పోలీసు అధికారులు మేకల తిరుపతన్న, ప్రణీత్ రావు, రాధాకిషన్, భుజంగరావు తదితరుల ఫోన్లను సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్(Forensic Laboratory) కు పంపి మొత్తం సమాచారం అంతా రాబట్టారు. అలా వెనక్కు తెప్పించిన మొబైల్ ఫోన్లలోని సమాచారం మొత్తాన్ని ఒక్కోకటిగా విశ్లేషిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తిరుపతన్న మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నపుడు చాలాసార్లు నకిరేకల్ మాజీ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్య ప్రస్తావన కనబడింది. దాంతో మరింత లోతుగా వెళ్ళినపుడు 2022 అక్టోబర్ మనుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక నుండి 2023 జనరల్ ఎలక్షన్ వరకు టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తిరుపతయ్య, లింగయ్య మధ్య చాలసార్లు ఫోన్ సంభాషణలు నడిచినట్లు సిట్ గుర్తించింది. అంటే నల్గొండ జిల్లాకు సంబందించి టెలిఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించిన వారిలో లింగయ్య కూడా ఉన్నారని ఆధారాలతో సహా బయటపడింది. దాంతో సిట్ అధికారులు లింగయ్యను 11వ తేదీన విచారణకు రమ్మని నోటీసు జారీచేశారు.

నోటీసు అందుకున్న లింగయ్య తనకు అనారోగ్యంగా ఉన్న కారణంగా 11వ తేదీకి బదులు మరో మూడు రోజుల తర్వాత అంటే 14వ తేదీన హాజరవుతానని చెప్పారు. దానికి సిట్ అధికారులు సరే అన్నారు. అంటే గురువారం నాడు లింగయ్య టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సిట్ ముందు హాజరవబోతున్నారు. విచారణకు హాజరవుతున్న లింగయ్య విషయంలో అధికారులు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే విచారణకు పిలిచి వివరాలు కన్నుక్కుని వదిలేస్తారా ? లేకపోతే ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించారన్న ఆదారాలను చూపించి అరెస్టు చేస్తారా అన్న చర్చ ఇపుడు సర్వత్రా పెరిగిపోతోంది.

సీన్ కట్ చేస్తే ఇవే ఆరోపణలు కేటీఆర్(KTR) కూడా ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతు రాష్ట్రప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma)కు లేఖ రాసింది. గవర్నర్ కార్యాలయం ఇదే విషయమై సలహా ఇవ్వమని అడ్వకేట్ జనరల్ ను అడిగింది. కేటీఆర్ పై కేసు నమోదుచేసి విచారించేందుకు అనుమతి కోరుతు ప్రభుత్వం గవర్నర్ ను ఎందుకు కోరింది ? లింగయ్యకు మాత్రం సిట్ అధికారులు డైరెక్టుగా విచారణకు రమ్మని నోటీసులు ఎలాగ ఇచ్చారు ? ఎలాగ ఇచ్చారంటే కేటీఆర్ ఇపుడు ఎంఎల్ఏగా ఉన్నారు, లింగయ్య మాజీ ఎంఎల్ఏ. ప్రభుత్వాలు మారినపుడు మాజీల అవినీతి ఆరోపణలను విచారించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే అని 2018లో ఒక చట్టం వచ్చింది. దాని ఆధారంగానే టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ ను విచారించేందుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరుతు లేఖ రాసింది.

లింగయ్య విషయం తీసుకుంటే ఈయన మాజీ ఎంఎల్ఏ. మాజీలను విచారించాలంటే గవర్నర్ అనుమతి అవసరంలేదు. అందుకనే సిట్ అధికారులు డైరెక్టుగా లింగయ్యకు నోటీసు జారీచేసి విచారణకు పిలిచింది. లింగయ్యను విచారించబోతున్న సిట్ అధికారులు తొందరలోనే కేటీఆర్ కు కూడా నోటీసులు జారీచేయటానికి రెడీ అవుతున్నారు. గవర్నర్ అనుమతి రావటమే ఆలస్యం వెంటనే సిట్ అధికారులు కేటీఆర్ పై కేసు నమోదుచేసి విచారణకు రమ్మని పిలిచేందుకు నోటీసులు రెడీగా పెట్టుకున్నట్లు సమాచారం. లింగయ్య దాకా వెళ్ళిన సిట్ అధికారులు కేటీఆర్ ను విచారించలేరా ? లింగయ్య విచారణకు కేటీఆర్ విచారణకు మధ్య ఒక అడుగే దూరం. ఆ ఒక్క అడుగే గవర్నర్ అనుమతి అని అందరికీ అర్ధమవుతోంది. మరి ఆ అడుగుదూరం ఎప్పుడు తరుగుతుందో చూడాలి.

Read More
Next Story