రాజకీయ వేధింపులపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం
x

'రాజకీయ వేధింపులపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం'

తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు రోజు రోజుకు తీవ్రతరం అయ్యాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆరోపించారు.


తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు రోజు రోజుకు తీవ్రతరం అయ్యాయని అధికార టీడీపీ నాయకులు గ్రామస్థాయి నుంచి ఈ వేధింపులకు పాల్పడుతూ మహిళలన్న విచక్షణ కూడా మరచిపోయి వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆరోపించారు. రాజకీయ వేదింపులకు పరిష్కారాన్ని జిల్లా కలెక్టర్ చూపాలని దీనిపై ఓ ప్రకటన చేయాలని కందారపు మురళి డిమాండ్ చేశారు. స్థానిక చోట, మోటా నాయకులు అధికార పార్టీ పేరు చెప్పి అలజడికి కారణం అవుతున్నారని విమర్శించారు.

వైసీపీ అధికారంలో ఉండగా తమ మాట చెల్లుబాటు కాలేదని, ప్రస్తుతం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాము చెప్పిందే సాగాలని, రాజీనామాలు చేయాల్సిందేనంటూ అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజనం, సంఘమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లను అధికార పార్టీ అనుయాయులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని కందారపు మురళి అన్నారు. శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అధికార పార్టీ నాయకుడు పి. ఈశ్వర్ రెడ్డి స్థానిక అంగన్వాడీ టీచర్ పై దాడికి పాల్పడ్డారని, లైంగిక వేధింపులకు గురిచేసారని, అక్రమ కేసులు పెట్టారని, తక్షణం రాజీనామా చేసి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈశ్వర్ రెడ్డి హెచ్చరించారని వివరించారు.

వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. వెంకటగిరి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలో కస్తూరి కృష్ణవేణి అనే ఆశా వర్కర్ ఒంటరి మహిళ అని స్థానిక గ్రామ పెత్తందారులు ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో పలువురు ఉద్యోగులను తొలగించడానికి అన్ని రకాల ప్రయత్నాలను అధికార పార్టీ నేతలు చేస్తుండటం అప్రజాస్వామికమైందని కందారపు మురళి విమర్శించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం, కోశాధికారి కేఎన్ ఎన్ ప్రసాదరావులు ప్రసంగిస్తూ సమస్య తీవ్రతను వివరించారు.

తక్షణం మహిళలకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. శ్రీకాళహస్తి మండలంలో 17 మంది సంఘమిత్రలను తొలగించారని, తొట్టంబేడు మండలంలో 11 మందిని రాజీనామాలు చేయమని వత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు టిడిపి నాయకత్వంలోని ప్రభుత్వం ను గెలిపించింది ఇందుకేనా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో పలువురు బాధితులు, అంగన్వాడీలు, ఆశాలు, సంఘమిత్రలు, మధ్యాహ్నం భోజనం కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య, జయచంద్ర, కార్యదర్శి ఆర్. లక్ష్మి, టి. సుబ్రమణ్యం, ఆర్ వెంకటేశ్, గురవయ్య, వడ్డిపల్లి చెంగయ్య, కె. వేణుగోపాల్, మాధవ్, మునిరాజ, బుజ్జి, రాజేశ్వరి, ధనమ్మ, మురగేశు తదితరులు ప్రసంగించారు.

'వేధింపులను సహించం: కలెక్టర్ వెంకటేశ్వర్' గ్రామాలలో చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఇందులో సంశయం లేదని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. గ్రామీణ, మండల స్థాయిలో అధికారులకు గానీ, పార్టీల నాయకులకు కానీ ఉద్యోగులను తొలగించే అధికారం లేదని వివరించారు. సమస్యలు ఏమున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, రాజకీయ వేధింపులను సహించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని బాధితులను ఉర్దేశించి జిల్లా కలెక్టర్ అన్నారు. ధర్నా అనంతరం సిఐటియు నేతలతో పాటు బాధితులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ కు వివరించి వినతి పత్రం సమర్పించారు.

Read More
Next Story