సచివాలయంలో స్మార్ట్ ఉద్యోగం
x

సచివాలయంలో స్మార్ట్ ఉద్యోగం

ఏపీ సచివాలయంలో ఇకపై ఉద్యోగులు, అధికారులు స్మార్ట్ విధులు నిర్వహిస్తారు. ఆరు గంటల తరువాత సచివాలయంలో ఉండాల్సిన అవసరం లేదు.


ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు స్మార్ట్ గా పనిచేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు, సిబ్బందికి ఈ సందేశం ఇచ్చారు. ఇప్పటికే సచివాలయంలో పేపర్ లెస్ విధులు ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. ఫైల్స్ అంటెడర్లు చేత పట్టుకుని ఒక సీటు నుంచి మరో సీటుకు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్ కు ఫైల్స్ ఆన్ లైన్ ద్వారా మాత్రమే వెళుతున్నాయి. సచివాలయం పూర్తి స్థాయిలో డిజిటలైజ్ అయింది. అధికారులు కూడా ఫైల్స్ పై డిజిటల్ సంతకం చేసి పంపిస్తే సరిపోతుంది. నేరుగా సీఎం పేషీకి కూడా డిజిటల్ ఫైల్స్ వెళుతున్నాయి. ముఖ్యమైన ఫైల్స్ సీఎం ఆమోదించాల్సి వస్తే దానిని మాత్రం కంప్యూటర్ లో టైప్ చేసి ఫ్రింట్ తీసిన కాపీని సీఎం సంతకానికి పంపిస్తారు. ఆయన ఆ ఫైల్ పై సంతకం చేయగానే ఇక మిగిలిన విషయమంతా సెక్షన్ అధికారులు నిర్వహిస్తారు. నోట్ ఫైల్స్ ను మాత్రమే ఇలా చేస్తారు. మిగిలిన వ్యవహారమంతా డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుంది.

సచివాలయంలో అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్

సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ డిజిటల్ నాలెడ్జ్ ఉంటుంది. కొందరు నేరుగా కార్యదర్శికి అర్జీలు ఇస్తారు. అర్జీలపై సంతకాలు చేసిన కార్యదర్శులు ఆ ఫైల్ ను ఎలా ప్రాసెస్ చేయాలో కూడా రాస్తారు. దీంతో సెక్షన్ ల నుంచి ఫైల్స్ డిజిటల్ రూపంలోనే ముందుకు సాగుతాయి. అర్జీని డిజిటల్ ఫైల్ కు స్కాన్ చేసి అటాచ్ చేస్తారు. అంతటితో ఎవరికి పంపించాలో వారికి ఆ ఫైల్ క్షణాల్లో చేరుతుంది. సెక్షన్ హెడ్స్ గా ఎక్కువ మంది గ్రూప్ 1 అధికారులు ఉంటున్నారు. ప్రమోషన్ వచ్చిన వారికంటే కొత్తగా నియమితులైన వారిలో గ్రూప్స్ అధికారులు ఉంటున్నందున వారికి కంప్యూటర్ పై పూర్తి అవగాహన ఉంటుంది. ఎవరికైనా కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే అటువంటి వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు కూడా సచివాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొందరు డిప్యూటీ కార్యదర్శులు, అసిస్టెంట్ కార్యదర్శులకు సాంకేతిక సమాచారం పూర్తి స్థాయిలో తెలియడం లేదు. అటువంటి వారు సెక్షన్ హెడ్స్ పై ఆధార పడుతున్నారు.

వయసు రిత్యా పని గంటలు తగ్గించిన చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అర్ధరాత్రి కూడా కార్యాలయంలో ఉండి పనిచేసే వారు. దీంతో సీఎంఓ అధికారులు తప్పకుండా ఉండాల్సి వచ్చేంది. సీఎంఓలో అధికారులు ఉన్నారంటే కార్యదర్శులు కూడా కార్యాలయాల్లో ఉండాల్సి వచ్చేది. ఒక్కోసారి సిబ్బంది కూడా కొన్ని డిపార్ట్ మెంట్స్ వారు అర్ధరాత్రి వరకు పనిచేసే వారు. సమీక్ష సమావేశాలు అర్ధరాత్రి వరకు జరిగేవి. గంటల తరబడి కూర్చోలేక అధికారులు, సిబ్బంది నానా ఇబ్బందులు పడే వారు. గతంలో ఎక్కువగా కాగితాల ఫైల్స్ ఉండేవి. ఇప్పుడు ఒక ల్యాప్ టాప్ తీసుకొచ్చుకుంటే ఎన్ని ఫైల్స్ అయినా వెంట వెంటనే అప్రువల్ అవుతున్నాయి. ఒక చోట నుంచి మరో చోటుకు అధికారులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు సాయంత్రం 6 గంటల తరువాత ఎవ్వరూ ఆఫీసులో ఉండాల్సిన అవసరం లేదని తేల్చేశారు. అది కూడా భారత రాజ్యాంగ ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఉద్యోగులకు చెప్పడంతో అధికారుల ముఖాల్లో ప్రధానంగా వెలుగు కనిపించింది.

సంతోషంలో సచివాలయ ఉద్యోగులు

సచివాలయ ఉద్యోగులు ఆనందంతో ఉన్నారు. సాయంత్రం ఆరు గంటల తరువాత సచివాలయంలో ఉండాల్సిన అవసరం లేదని సీఎం ప్రకటించడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పని ఉన్నా లేకపోయినా సాయంత్రం వరకు తన సీట్లో ఉద్యోగి ఉండాల్సి వచ్చేది. డిజిటల్ ఫైల్స్ కావడంతో కంప్యూటర్ లో కంపోజ్ చేసి డిజిటల్ సంతకం చేసి ఫైల్ పంపిస్తే తన పని అయిపోతోంది. సచివాలయంలో అత్యంత స్పీడుగా ఉండే వైఫై సిస్టం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచివాలయం ఏర్పాటు చేసిన కొత్తలో ఫోన్ సిగ్నల్స్ సరిగా ఉండేవి కావు. ఇప్పుడు ఏ ఫోన్ అయినా సిగ్నల్స్ బాగున్నాయి. దీంతో సమాచారం చేరవేయడంలో వేగం పెరిగింది.

ఈ విషయంలో సచివాలయ ఉద్యోగ సంఘం వారు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు చెప్పాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయ ఉద్యోగులపై ఇప్పటి వరకు కాస్త భారం ఉందని భావించే వారు. ఇకపై ఆ భారం ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. సచివాలయంలో ఇదో మంచి పరిణామమని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు చెప్పారు.

Read More
Next Story