
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..డిప్యూటీ కలెక్టర్ మృతి
అన్నమయ్య కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్నరెండు కార్లు ఢీకొట్టుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లోను, డిప్యూటీ కలెక్టర్ కుటుంబంలోను విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురు ప్రయాణిస్తున్న రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. ప్రమాదానికి గురైన ఓ కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా కెనాల్(హెచ్‌ఎన్‌ఎస్) పీలేరు యూనిట్–2 ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రమ మరణించగా, మరో నలుగురు క్షతగాత్రులయ్యారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ నలుగురిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
ప్రమాదం జరిగినట్టు సమాచారం అందుకున్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెంటనే స్పందించారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ, హంద్రీనీవా కెనాల్ విధులు నిర్వహించడంతో పాటు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ కోఆర్డినేటర్‌గా కూడా సేవలు అందిస్తున్నారు. రమ స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. ఆమె విధులు నిర్వహిస్తున్న పేలేరు నుంచి రాయచోటిలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రమ మరణంతో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో విషాదం అలుముకుంది. తోటి అధికారి ప్రమాదంలో మరణించడంతో కలెక్టర్ శ్రీధర్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రమాదంపై స్పందించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ మరణం దురదృష్టమకరమన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్‌తో మాట్లాడి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రమ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురికి మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రమ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Next Story