విశాఖపట్నం నుంచి అక్టోబర్ 13న ఇండ్–ఏపీ–వీ5–ఎంఎం–735 నంబరు మెకనైజ్డ్ బోటులో ఎనిమిది మంది మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు బయల్దేరారు. చేపలవేటలో భాగంగా పశ్చిమ బెంగాల్ సముద్ర జలాలకు సరిహద్దులో ఉన్న దిఘా సమీపంలో వీరు తమ బోటును లంగరు వేశారు. ఆ సమయంలో భారీగా వీచిన ఈదురుగాలుల ప్రభావంతో వీరి బోటు పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించింది. దీంతో నిరంతరం కాపలా ఉండే ఆ దేశ కోస్టుగార్డు సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ దేశ చట్టాల ప్రకారం వీరిని అక్రమ చొరబాటు దార్లుగా భావించి అనంతరం కోర్టు ఆదేశాలతో వారిని జైలులో ఉంచారు. అప్పట్నుంచి వీరు ఆ జైలులోనే మగ్గుతున్నారు. వీరితో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో ఐదారు బోట్లలో వెళ్లిన 104 మంది మత్స్యకారులు కూడా ఇదే తరహాలో బంగ్లాదేశ్ కోస్టుగార్డులకు పట్టుబడ్డారు. వీరిని కూడా ఆ దేశ జైళ్లలో ఉంచారు.
విదేశాంగ శాఖ అధికారికి వినతి పత్రం అందిస్తున్న జానకీరామ్
ఎవరీ మత్స్యకారులు?
విశాఖలోని వడ్డాది సత్యనారాయణకు చెందిన ఈ మరబోటులో చేపలవేటకు వెళ్లిన వారిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజుపాలేనికి చెందిన మరుపల్లి చినప్పన్న, మరుపిల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపిల్లి ప్రవీణ్, సూరపత్తి రాము, మరుపిల్లి చిన్న అప్పన్న, పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్కా రమణ, వాసుపల్లి సీతయ్యలు ఉన్నారు. దాదాపు రెండున్నర నెలల నుంచి ఈ మత్స్యకారులు బంగ్లాదేశ్ జైలులోనే మగ్గుతున్నారు. దీంతో వీరి కుటుం» సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సత్వరమే తమ వారిని విడిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం ఇలా పట్టుబడిన వారిని తక్షణమే విడిచిపెట్టడానికి వీలుండదు. అందువల్ల వారు ఏళ్ల తరబడి జైళ్లలోనే గడపాల్సి ఉంటుంది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వీరి విడుదలకు కృషి చేస్తుంటుంది.
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు న్యాయవాది రెహ్మాన్‌తో జానకీరామ్
బంగ్లాదేశ్‌కు మత్స్యకార నేత..
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జైలులో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను కలిసేందుకు విశాఖకు చెందిన ఈస్ట్ కోస్ట్ మెకనైజ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకీరామ్ ఐదు రోజుల క్రితం ఆ దేశం వెళ్లారు. కొన్నాళ్ల నుంచి బంగ్లాదేశ్‌లో హిందూ వ్యతిరేక అల్లర్లు జరుగుతున్నాయి. దీంతో జైలులో ఉన్న మత్స్యకారులను కలవడానికి అక్కడి జైలు అధికారులు ఆయనను అనుమతించలేదు.
నిత్యావసరాలకు బంగ్లా కరెన్సీ డిపాజిట్టు..
బంగ్లా జైళ్లలో ఉన్న ఖైదీలకు సరైన ఆహార ం గాని, నిత్యావసర సరకులు గాని ఉండవు. దీంతో జైలులో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులకు మంచి ఆహారం, నిత్యావసర వస్తువులు అందించేందుకు వీలుగా జానకీరామ్ బంగ్లాదేశ్ కరెన్సీని డిపాజిట్ చేశారు. దాదాపు నెలన్నర వరకు ఈ సొమ్ము వారి అవసరాలను తీరుస్తుంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వం అనిశ్చితిలో ఉంది. అందువల్ల జైలులో ఉన్న మత్స్యకారుల పరిస్థితిని తెలియజేసే ఉద్దేశంతో అక్కడ వీడియో తీసేందుకు కూడా జైలు అధికారులు నిరాకరించారు.
మత్స్యకారులను విడిపించే ప్రయత్నాలు..
బంగ్లాదేశ్ జైలులో ఉన్న మత్స్యకారుల విడుదల ప్రయత్నంలో భాగంగా జానకీరామ్.. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయవాది మహమ్మద్ రెహ్మాన్‌ను కలిశారు. అలాగే బంగ్లాదేశ్‌లోని భారత విదేశాంగ శాఖ అధికారులతోనూ ఆయన సమావేశమయ్యారు. మత్స్యకారుల విడుదల కోసం సంబంధిత కేసు వివరాలను, డాక్యుమెంట్లను బంగ్లా హోం మంత్రిత్వశాఖకు, భారత విదేశాంగ శాఖ అధికారులకు ఇచ్చారు. బంగ్లా జైలులో ఉన్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు క్షేమంగానే ఉన్నారు. అయితే కుటుంబాలకు దూరంగా జైలులో ఉన్నామన్న బాధతో ఉన్నారు. తాము ఆరోగ్యంగానే ఉన్నామని తమ కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరుతున్నారు. భారత విదేశాంగ శాఖ అధికారులు జైలులోని మత్స్యకారులతో మాట్లాడారు. చలికాలం కావడంతో వారి అభ్యర్థన మేరకు అధికారులు వారికి స్వెటర్లను అందజేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
‘రెండున్నర నెలల నుంచి ఉత్తరాంధ్ర మత్స్యకారులు బంగ్లాదేశ్ జైలులో మగ్గుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వీరి విడుదలకు చొరవ తీసుకోవడం లేదు. కనీసం న్యాయవాదిని కూడా నియమించలేదు. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కూడా దృష్టి సారించక పోవడం దారుణం. గతంలో 2018, 2019ల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కోస్టుగార్డులకు చిక్కిన ఉత్తరాంధ్ర జాలర్లను విడిపించడానికి అప్పటి ప్రభుత్వం చొరవతో కృషి చేశాను’ అని జానకీరామ్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.