ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్‌కు అరుదైన అవకాశం లభించింది. డెన్మార్క్ దేశం అక్కడ నిర్వహించే అంతర్జాతీయ శిక్షణకు హాజరు ఆయన కానున్నారు, అక్టోబర్ 1 నుంచి అక్టోబరు వరకు వీరపాండ్యన్ డెన్మార్క్ శిక్షణలో పాల్గొననున్నారు, వైద్యారోగ్య శాఖ డిజిటలైజేషన్ సేవల రంగంలో స్ఫూర్తిగా ఉన్న డెన్మార్క్ ప్రభుత్వమిచ్చే శిక్షణా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4 రాష్ట్రాల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) డైరెక్టర్లను ఎంపిక చేసింది. వీరిలో ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, ఏడీబీఎం మిషన్ డైరెక్టర్ జీ వీరపాండియన్ కూడా ఉన్నారు. అసోం, జమ్యూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధికారులు వీరపాండియన్ తో కలిసి డెన్మార్క్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీరపాండ్యన్ కు అభినందనలు తెలిపారు.
డెన్మార్క్ ప్రభుత్వం పూర్తి ఖర్చులతో నెల రోజుల పాటు డనీడా ఫెలోషిప్ సెంటర్ ప్రొగ్రాం కింద అక్టోబర్ 1 నుంచి 31 వరకు వీరికి శిక్షణ ఇవ్వనుంది. ప్రజారోగ్య సంరక్షణలో డిజిటలైజేషన్, సమాచార సేకరణ, వినియోగంను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021 లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం అమలులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.20 కోట్ల ప్రోత్సాకాలు, డిజిటలైజేషన్ ప్రోగ్రాం కింద రూ. 16 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. ఈ స్థాయిలో దేశంలో ఏ ఇతర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నిధుల్ని పొందలేదు.
ఏపీలో ఏబీడీఎం సాధించిన ప్రగతి
రాష్ట్రంలో 4.66 కోట్ల మందికి అభా(ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌట్) నంబర్లు నమోదు చేశారు. ఈ సంఖ్య రాష్ట్ర జనాభాలో 92.04 శాతం. దేశంలో ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ స్థానాన్ని సాధించింది. 6.92 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని నమోదు చేయడం ద్వారా రాష్ట్రం దేశంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 63,340 మంది వైద్యులు, వైద్య సిబ్బందికి హెచ్‌పిఆర్ నమోదు చేయడం ద్వారా దేశంలో మూడో స్థానంలో రాష్ట్రం నిలిచింది. 21,936 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలకు హెచ్‌ఎఫ్‌ఆర్ నమోదు చేసి దేశంలో ఐదో స్థానాన్ని రాష్ట్రం పొందింది. 2.07 కోట్ల మేర స్కాన్ అండ్ షేర్ ద్వారా రోగులు ఎక్కువ సమయం క్యూ లైన్లో నిల్చోకుండా జారీ చేయడం ద్వారా మూడో స్థానాన్ని పొందింది. ఈ పురోగతిని పరిణనలోకి తీసుకున్న కేంద్రం నాలుగు రాష్ట్రాలను డెన్మార్క్ శిక్షణకు ఎంపిక చేసింది.
వ్యక్తిగత అభా నంబరు, వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ( హెచ్ పిఆర్ ) నంబరు, ఆసుపత్రులు, క్లీనిక్‌లకు హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ( హెచ్ ఎఫ్ ఆర్ )లో వివరాల నమోదు, ఆసుపత్రుల్లో రోగులకందించే చికిత్సల వివరాల డిజటలీకరణ, ఆసుపత్రుల్లో రద్దీ నివారణకు ఎలక్ట్రానిక్ టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టడం, వైద్య సేవలు మొత్తం కంప్యుటీకరణ వంటి కార్యక్రమాల్ని ఏబీడీఎం అమలు చేస్తోంది.