మిస్ వరల్డ్ నిర్వహణలో మొదలైన కొత్త వివాదం (వీడియో)
x
Miss World 2025 Ramappa Temple row

మిస్ వరల్డ్ నిర్వహణలో మొదలైన కొత్త వివాదం (వీడియో)

ఇంతకీ వీళ్ళగోల ఏమిటంటే అందగత్తెల కాళ్ళను ఈవెంట్ మేనేజ్మెంట్ తరపున కొందరు అమ్మాయిలు కడిగారు, తువాళ్ళతో తుడిచారట


అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అని వెనకటికి ఒక కవి అన్నారు. అదేపద్దతిలో కాదేదీ రాజకీయానికి అనర్హం అని ఇపుడు బీఆర్ఎస్ నిరూపిస్తోంది. అధికారంలో ఉన్నంతకాలం ప్రతిపక్షాలను లెక్కచేయని బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వంపై టన్నుల కొద్ది బురదను చల్లేస్తోంది. మొన్నటివరకు కంచె గచ్చిబౌలి(Kanche Gachibowli) భూముల విషయమై నానా గోలచేసిన బీఆర్ఎస్(BRS) నేతలు తాజగా మిస్ వరల్డ్ పోటీలను తమ రాజకీయానికి వాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే మిస్ వరల్డ్-2025(Miss World-2025) పోటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth) ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి 10వ తేదీన మొదలైన కార్యక్రమం జూన్ 2వ తేదీతో ముగుస్తుంది.

దాదాపు 115 దేశాల నుండి వచ్చిన అందగత్తెలు తెలంగాణలోని ఛార్మినార్, భూదాన్ పోచంపల్లి, రామప్పదేవాలయం, ఛార్మినార్ దగ్గరే ఉన్న బడేచౌడీ లాంటి అనేక ప్రాంతాల్లో సందడిచేస్తున్నారు. రామప్పదేవాలయం సందర్శనలో భాగంగా కొందరు అందగత్తెలు దేవాలయంలోకి ప్రవేశించేముందు కుర్చీల్లో కూర్చుని కాళ్ళు కడుక్కున్నారు. దీన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పెద్ద వివాదంగా మొదలుపెట్టరు. కేటీఆర్ మొదలుపెట్టిన వివాదాన్ని మాజీమంత్రులు, సీనియర్ నేతలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) పట్టుకుని నానా గోలచేస్తున్నారు. ఇంతకీ వీళ్ళగోల ఏమిటంటే అందగత్తెల కాళ్ళను ఈవెంట్ మేనేజ్మెంట్ తరపున కొందరు అమ్మాయిలు కడిగారు, తువాళ్ళతో తుడిచారట.


అందగత్తెల కాళ్ళను కడిగించి, తుడిపించటంతో తెలంగాణ ఆడవాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కించపరిచిందని నానా గోలచేసేస్తున్నారు. పార్టీలోని అగ్రనేతలు ఆరోపణలు మొదలుపెట్టిన తర్వత కిందస్ధాయి నేతలు ఊరుకుంటారా ? వీళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నానా రచ్చచేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏమిమాట్లాడినా మారుమాట్లాడకుండా ప్రచారంకల్పించే మీడియా సంస్ధలు, సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి ఈవిషయం తెలంగాణలో ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. కేటీఆర్, సబిత(Sabitha Indra Reddy), డీకే అరుణలు ఆరోపిస్తున్నట్లు, గోలచేస్తున్నట్లుగా ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయిలు కాని లేదా స్ధానిక అమ్మాయిలు కాని అందగత్తెల కాళ్ళు కడుగుతున్నట్లు లేదా కడిగిన కాళ్ళని తుడుస్తున్న వీడియోలు ఎక్కడా లేవు. కనీసం ఫొటోలు కూడా లేవు. అయినా సరే తాము చేయదలచుకున్న ఆరోపణలు చేసేస్తు, ప్రభుత్వంపై కేటీఆర్, సబిత బురదచల్లేస్తున్నారు.

ప్రభుత్వం తరపున సమాచార శాఖ రిలీజ్ చేసిన ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియాలో మరికొన్ని వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి. వాటిల్లో ఏముందంటే అందగత్తెలు కాళ్ళు కడుక్కునేందుకు కొందరు అమ్మాయిలు చెంబులతో నీళ్ళు అందించినట్లు కనబడుతోంది. అలాగే కాళ్ళు కడుక్కున్న తర్వాత పాదాలు తుడుచుకునేందుకు కొందరు అమ్మాయిలు అందగత్తెలకు తువాళ్ళు అందించటం కనబడింది. అంటే కాళ్ళు కడుక్కోవటం, తుడుచుకోవటం అంతా అందగత్తెలే చేసుకున్నారు అంటే వీళ్ళ కాళ్ళని ఎవరూ కడగలేదు, తుడవలేదు. అయినా కొందరు అమ్మాయిలతో అందగత్తెల కాళ్ళు కడిగించి, తుడిపించటం ద్వారా తెలంగాణ పరువుతీసేసిందని, ఆడవాళ్ళను ప్రభుత్వం అవమానించిందని నానా గోలచేసేస్తున్నారు.


బీఆర్ఎస్ నేతలకు మొదటినుండి ఒక అలవాటుంది. అదేమిటంటే చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా బూతద్దంలో చూపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానా రచ్చచేస్తుంటారు. ప్రభుత్వం మీద బురదచల్లేయటంలో కేటీఆర్, హరీష్ లాంటి వాళ్ళు బాగా ఆరితేరిపోయారు. ఇపుడు కూడా అదేపద్దతిలో గోలచేస్తున్నారు. అందగత్తెల కాళ్ళు కడిగించారు, తువాళ్ళతో తుడిపించారని ఆరోపిస్తున్న కేటీఆర్, సబితలు తమఆరోపణలకు మద్దతుగా ఏమన్నా వీడియోలు చూపించారా అంటే లేదు. కేవలం మీడియాలో, సోషల్ మీడియాలో ఆరోపణలతో రెచ్చిపోతున్నారంతే.

సీతక్క వాదనేంటి

వీళ్ళ ఆరోపణలకు మంత్రి సీతక్క(Minister Seetakka) తనదైన పద్దతిలో సమాధానం ఇచ్చారు. అందగత్తెలు కాళ్ళు కడుక్కోవటానికి, తుడుచుకోవటానికి కొందరు అమ్మాయిలు చెంబులతో నీళ్ళందించి, తువాళ్ళు అందించారని చెప్పారు. ఒక అమ్మాయితో ఒక అందగత్తె కాళ్ళు కడిగించారని కేటీఆర్, సబితలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు మంత్రి విరుచుకుపడ్డారు. కేటీఆర్, సబిత ఆరోపణలే నిజమైతే ఒక అందగత్తె కాళ్ళే ప్రభుత్వం లేదా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్ధ ఎందుకు కడిగిస్తుంది ? మొత్తం అందరు అందగత్తెల కాళ్ళు కడిగించి, తుడిపించాలి కదాని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మిస్ వరల్డ్-2025 కార్యక్రమం విజయవంతం అవటాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్, సబితలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నట్లు మంత్రి మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలు జరగటం మొదటినుండి కేటీఆర్ అండ్ కో కు ఇష్టంలేదన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఆత్మగౌరవం గురించి ఇపుడు మాట్లాడుతున్న కేటీఆర్, సబితలు తాము అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ కాళ్ళకు ఒక కలెక్టర్ మొక్కినపుడు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని నిలదీశారు. కేసీఆర్ కూతురు కవిత(Kavitha) స్టేజీ మీద కూర్చున్నపుడు ఆమె కాళ్ళ దగ్గర ఒక కలెక్టర్ కూర్చున్నపుడు తెలంగాణ ఆత్మగౌరవం ఏమైందని మంత్రి సీతక్క తీవ్రంగా ప్రశ్నించారు. మొత్తానికి ఇపుడు రాజుకుంటున్న వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

Read More
Next Story