
అలిపిరిలో తృటిలో తప్పిన తొక్కిసలాట
భక్తులే స్వయంగా సంయమనం పాటించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తుల పట్ల టీటీడీ (TTD) నిర్లక్ష్య ధోరణి మరోసారి బయటపడింది. గురువారం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో దర్శన టికెట్ల జారీ సమయంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో తొక్కిసలాట వంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లాఠీచార్జ్ చేసిన సిబ్బంది
భూదేవి కాంప్లెక్స్ వద్ద వేలాదిగా తరలివచ్చిన భక్తులను నియంత్రించడంలో టీటీడీ భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. క్యూలైన్లలో తోపులాట జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో భక్తులను క్రమబద్ధీకరించడానికి బదులు, భద్రతా సిబ్బంది వారిపై లాఠీచార్జ్‌కు దిగడం గమనార్హం. పోలీసులతో పాటు భద్రతా బలగాల దురుసు ప్రవర్తనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు భక్తులే స్వయంగా సంయమనం పాటించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పాత గాయాలను గుర్తుచేస్తున్న ఘటనలు
ఈ ఏడాది ప్రారంభంలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగిన ఘోర కలికలం భక్తులను ఇప్పటికీ వెంటాడుతోంది. ఆ సమయంలో బైరాగిపట్టెడ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్యూలైన్ల నిర్వహణలో పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడమే ఆ విషాదానికి కారణమని భక్తులు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు.
భక్తుల ఆవేదన
తాజా ఘటనపై భక్తులు స్పందిస్తూ.. "టీటీడీ యాజమాన్యం గత అనుభవాల నుండి ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదు. క్యూలైన్లలో పశువుల మాదిరిగా మమ్మల్ని వదిలేస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకపోగా, అడిగితే లాఠీలతో కొడుతున్నారు" అని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సామాన్య భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నారు.
Next Story

