బిడ్డను చంపి తల్లిని ఓదార్చిన సర్కారు!
x
హిడ్మా తల్లి పూంజీ, హిడ్మా

'బిడ్డను చంపి తల్లిని ఓదార్చిన సర్కారు!'

'ఇంటికి రా, రా కొడుకా' అంటే శవమై వస్తున్నావా బిడ్డా! అంటూ రోదిస్తున్న హిడ్మా తల్లి పూంజే. హిడ్మా సొంతూరు పువర్తి ఇప్పుడెలా ఉందంటే..


"కొడుకా, ఇంటికి రా రా!" అని పిలుపిచ్చిన తల్లి ఇప్పుడు 'ఆ కొడుకు శవం కోసం' ఎదురు చూస్తోంది. ఇవాళ సాయంత్రానికో, రాత్రికో ఆ కోయగూడెంలోని పూరింటికి తెల్లగుడ్డ చుట్టిన ఈ మృతదేహం చేరేలోగా ఆ మాతృమూర్తి కంట్లో నీరు ఇంకిపోవచ్చు. పొగిలిపొగిలి ఏడుస్తున్న ఆ 72ఏళ్ల ఎముకల గూడు- కన్నబిడ్డను చూసి కుమిలిపోవచ్చు. చుట్టుపక్కల వాళ్లు భయపడి ఆమె దరి చేరకపోవచ్చు.. మూతికి గుడ్డ అడ్డం పెట్టుకుని పక్కకు పోనూవచ్చు.. పోలీసులు హడావిడి చేయవచ్చు.. తుపాకులతో కవాతులు, కానిస్టేబుళ్ల ఈలలు ఉండవచ్చు..

2025 నవంబర్ 20.. హిడ్మా స్వగ్రామం పువర్తిలో కనిపించబోయే దృశ్యం ఇది. దేశాన్ని గడగడలాడించిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మద్వీ హిడ్మా మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇవాళ ఛత్తీస్‌ఘడ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి తరలిస్తున్నారు. హిడ్మా మృతి పట్ల ఊరి జనం క్షోభపడుతున్నా, 'బిడ్డను చంపి తల్లిని ఓదార్చుతున్న' తీరు పట్ల యావగింపున్నా-- పోలీసులు, భద్రతా సిబ్బంది కనుల్లో ఆనందంతో కలిసి టపాకాయలు కాలుస్తున్నారు. పీడ విరగడైందని డాన్సులు చేస్తున్నారు.

ఏదైతేనేం, పువర్తి ఊరు రెక్కలు రాలిన పక్షిలా ఉంది.
2025 నవంబర్ 18.. సాయంత్రం
పువర్తి కోయగూడెంలో మద్వీ హిడ్మా ఇంటికి నలుగురైదుగురు కానిస్టేబుళ్లు వెళ్లారు. ఇంటి ముందు ఓ ఎముకల గూడు లాంటి ముసలమ్మ పూంజీని పలకరించి 'మీ అబ్బాయి హిడ్మాను ఎదురుకాల్పుల్లో చనిపోయాడు' అని చెప్పినప్పుడు ఆమె నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని కుమిలికుమిలి ఏడ్చిన దృశ్యం ఒకటి నవంబర్ 19న మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

చావు కబురు తెచ్చిన కానిస్టేబుళ్లతో ఆమె ఏమన్నదంటే.. 'అయ్యా, నేను ముసల్దాన్ని.. ఎక్కడికి పోలేను.. రాలేను.. నా కొడుకు శవాన్నైనా ఇక్కడికి తీసుకువచ్చి చివరి చూపులు చూపించండయ్యా' అని కన్నీళ్లపర్యంతమైంది. ఆమె వినతికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పెద్దమనసుతో స్పందించింది. ఆమె కుటుంబానికి సాయం చేస్తుందని, మావోయిస్టు నాయకులకు ఎటుంటి ప్రోటోకాల్‌ పాటించాలో అలా చేస్తామని సుక్మా ఎస్పీ ప్రకటించారు. హిడ్మా మృతదేహాన్ని అంతిమ సంస్కారం కోసం పువర్తి తీసుకువస్తున్నారు. అయితే హిడ్మాకి కమ్యూనిస్టుల పద్ధతిలో కాకుండా గిరిజన సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నడుస్తాయి.
'ఇంటికి రా రా కొడుకా' అని చెప్పిన మావోయిస్టు కమాండర్ మద్వి హిడ్మా తల్లి పూంజీ- కుమారుడు శవాన్ని స్వీకరిస్తుంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మతో కలిసి భోజనం చేసి, తన అదృశ్య కుమారుడికి ఒక ప్రకటన ద్వారా "ఆయుధాన్ని వదిలిపెట్టి ఇంటికి రమ్మని" కోరిన తల్లికి కడుపుకోత మిగిల్చకుండా కనీసం శవాన్నైనా చూపించడం ఒకందుకు మంచిదేనని నల్గొండకు చెందిన మాజీ నక్సలైటు ఒకరు అభిప్రాయపడ్డారు.
బక్కచిక్కి, బిక్కుబిక్కుమంటూ వణుకుతున్న ఆ 71 ఏళ్ల హిడ్మా తల్లి మద్వి పూంజే తన కొడుకును తిరిగిరమ్మని ఆవేళ గట్టిగానే చెప్పింది. "ఇంట్లో నీ బాధ్యతలన్నింటినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళావు కొడుకా? ఇక్కడెక్కడైనా ఉంటే నేను వెతక్కగలను గాని నువ్వెక్కడ ఉన్నావో, నీ కోసం ఎక్కడ వెతకాలో తెలియడం లేదు కొడుకా? ఇంటికి రా రా కొడుకా" అని ఆమె కోరింది.

ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇప్పుడా ముగ్గురు పోలీసుల తుపాకులకే బలయ్యారు. ఇంతకుముందే హిడ్మా చెల్లెలు, ఓ సోదరుడు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఇప్పుడు హిడ్మా వంతైందన్నది ఆ మాజీ నక్సలైటు చెప్పిన కథనం.
హిడ్మా లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని ఛత్తీస్ ఘడ్ హోంమంత్రి శర్మ హిడ్మాతల్లి పూంజేకి హామీ ఇచ్చారు. అయినా తన కొడుకు చావు తప్పలేదు అని ఆమె కళ్ళలో నీళ్లు వత్తుకుంది.
రంపచోడవరం టు పువర్తి...
ఇప్పుడు హిడ్మా మృతదేహం ఆంధ్రప్రదేశ్ రంపచోడవరం ఆసుపత్రి మార్చురీలో పడి ఉంది. హిడ్మా మృతదేహాన్ని పువర్తికి తరలించేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి.
చత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ మాట్లాడుతూ, హిడ్మా మృతదేహాన్ని తరలించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆ కుటుంబానికి సహాయం చేస్తుందని అన్నారు.

బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పట్లింగం మాట్లాడుతూ, ప్రామాణిక ప్రోటోకాల్‌ల ప్రకారం చేయాల్సిందంతా చేస్తామన్నారు. చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత ఎప్పుడైనా శవాన్ని తీసుకోవచ్చునని చెప్పారు.
హిడ్మా ఎన్కౌంటర్ వార్త తెలియగానే సుక్మా జిల్లాలో పటాకులు పేలాయి. హిడ్మా మృతదేహాన్ని పువర్తికి తీసుకువచ్చిన తర్వాత పోలీసులు భద్రతను పెంచే అవకాశం ఉంది.
పువర్తిలో భద్రతా దళాల క్యాంప్ ను ఎత్తివేస్తారా?
గిరిజన భాషలో పువర్తి అంటే నీటి లోయ అనే అర్థమూ ఉంది. సుక్మా జిల్లా బస్తార్ ప్రాంతంలోని ఓ చిన్న అటవీ గ్రామం పువర్తి. చాలా ఏళ్లుగా మావోయిస్టుల గట్టి స్థావరంగా పేరుంది. టాప్ నక్సల్ నేత మద్వీ హిడ్మా స్వగ్రామం ఇదే కావడంతో 40 ఏళ్లుగా ప్రభుత్వ దళాలు ఆ అడవుల్లోకి అడుగుపెట్టలేకపోయాయి. అయితే 2025 ఫిబ్రవరి 16న పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ రోజు 3,000 మంది భద్రతా బలగాలు పువర్తి ప్రాంతంలోకి ప్రవేశించాయి. CRPF కొత్త క్యాంప్‌ను గ్రామానికి దగ్గరగా ఏర్పాటు చేసింది.
గ్రామం వాతావరణం ఎలా ఉంది?
పువర్తి పూర్తిగా అటవీ ప్రాంతం. మట్టి ఇళ్లు, చిన్న కమతాలు, ఎక్కడ బయల్దేరి ఎక్కడ తేల్తామో తెలియని దారులు…
ఉదయం పొగమంచు.. సాయంత్రమైతే చిమ్మ చీకటి..

అక్కడక్కడ పిల్లలు ఆడుతూ కనిపిస్తారు. పెద్దవాళ్లు అడవి దారుల్లో మౌనంగా నడిచిపోతుంటారు.
ఒకప్పుడు ఈ ప్రాంతంలో పోలీసులు కనిపిస్తే అది పెద్ద వార్త. ఇప్పుడు కనిపించకపోతే వార్త.
CRPF వాహనాలు, టార్పాలిన్ టెంట్లు, వాటి ముందు కవాతులు, ఎక్సర్ సైజులు, రేషన్ డబ్బాలు, వైర్‌లెస్ సెట్స్, తుపాకులు కనిపిస్తాయి. గ్రామస్థులు దూరంగా నుంచే ఆ దృశ్యాన్ని చూస్తూ గడిపేస్తుంటారు..
ఇకపై ఆ క్యాంపు అవసరం ఉండకపోవచ్చు. హిడ్మా కమ్యూనిస్టు మావోయిస్టు కావడంతో ఆ ఊరికి ఆశ్రమ పాఠశాల వచ్చింది. ఉచిత భోజనం, బట్టలు, పాఠ్యపుస్తకాలు వచ్చాయి. 'ఏళ్ల తరబడి పిల్లలు పక్క గ్రామాలకు వెళ్లి చదవలేకపోయారు. ఇప్పుడైనా స్కూలు రావడం మంచిదే' అన్నారు ఆ ఊరి పెద్ద ఒకరు. హిడ్మా కాలం ముగిసింది… గ్రామం కొత్త మార్గంలో నడవనుంది అంటున్నారు ఆయన.
రూన్-సౌన్ పద్ధతిలో హిడ్మా అంతిమ సంస్కారం...
హిడ్మా మరణ వార్త పువర్తిలో కొందర్ని బాగా కలసివేసేలా చేసింది. హిడ్మా తల్లి, బంధువులు చేతులతో తలలు పట్టుకుని విలపిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. వారు ఏడ్చేటపుడు “రూన్-సౌన్” అనే శబ్దం వస్తుంది. ఇది చిన్నగా మొదలై కేకలా మారి దద్దరిల్లేలా సాగి, చివరకు ఏడుపులో కలిసిపోతుంది. ఎవరైనా చనిపోయినపుడు గిరిజనులు చేసే విలాపం ఇది. మామూలుగా మహిళలే ముందు ఏడుపు మొదలుపెడతారు. చనిపోయిన వ్యక్తి ఇంటి ముందు చేరి, ఒక్కొక్కరిగా గొంతుకలుపుతూ పెద్దపెట్టున ఏడుస్తూ తారాస్థాయికి తీసుకువెళతారు. ఆర్తనాదాలు చేస్తారు. వారి ప్రతి కేకకి ఒక్కో అర్థం ఉంటుంది.

చనిపోయిన వారితో మాట్లాడినట్టుగా, వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నట్టుగా, ముగియని ముచ్చట్లు చెబుతున్నట్టుగా ఉంటుంది. గ్రామంలోని పెద్దలు, చనిపోయిన ఆత్మతో మాట్లాడుతున్నాం అని భావిస్తారు. చనిపోయిన వ్యక్తి ఆత్మ ప్రశాంతంగా వెళ్లిపోవాలని, బతికున్న వారికి ఎటువంటి నష్టం కలగకుండా చూడాలనే సూచనలు చేస్తారని నమ్మకం.
ఆ నేపథ్యంలోనే పువర్తి ఇప్పుడు తమ గ్రామ కుమారుడు హిడ్మా అంతిమ సంస్కారం కోసం సిద్ధమవుతోంది.
Read More
Next Story