
నేడు మావోయిస్టు ఆశన్న లొంగుబాటు
మావోయిస్టు పార్టీ భవిష్యత్ అనిశ్చితిగా మారింది.
దేశంలో మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఛత్తీస్‌గఢ్ లో ఈ రోజు మరొక పేరుమోసిన మావోయిస్టు ఆశన్న అలియాస్ తక్కళ్ల పల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ లొంగిపోతున్నారు. ఆయన సుమారు 170 మంది అనుచరులతో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ముందు లొంగిపోతున్నారు. ఈ కార్యక్రమం జగదల్ పూర్ లో జరుగుతున్నది. రెండు రోజుల కిందట జరిగిన భారీ లొంగుబాట్లు మావోయిస్టు సంస్థకు పెద్ద దెబ్బ తగిలినట్లే. మల్లోజుల వేణుగోపాల్ (భూపతి ఎలియాస్ సోను) వంటి పొలిట్‌బ్యూరో సభ్యుడు మహారాష్ట్రలో 60 మంది సహచరులతో లొంగిపోవడం, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 160 మంది మావోయిస్టులు సరెండర్ చేయడం ఉద్యమాన్ని మరింత బలహీనపరిచాయి.
ఆశన్న లొంగు బాటు మావోయిస్టు ఉద్యమాన్ని బాగా కృంగదీస్తుంది. ఎందుకంటే, ఆయన మావోయిస్టు ఉద్యమాన్ని తన దాడులతో కొత్త మలుపు తిప్పిన వాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వంలో హో మంత్రిగా ఉన్న ఎ మాధవరెడ్డి హత్య (మార్చి 7,2000) ఆయన ప్రధాన నిందితుడు. ఘటకేసర్ సమీపాన ల్యాండ్ మైన్స్ పేల్చి జరిపిన ఈ దాడి మంత్రి డ్రైవర్, గన్ మన్ కూడా మరణించారు.
లొంగిపోవడానికి ఇంద్రావతి నది దాటి బైరాంగఢ్‌కు తరలివస్తున్న మావోయిస్టుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనలను స్వాగతిస్తూ, అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్ ప్రాంతాలను నక్సల్ విముక్తంగా ప్రకటించారు. ఈ లొంగుబాట్లు మావోయిస్టు పార్టీకి, సమాజానికి ఎంతవరకు కీలకమైనవి? ప్రభుత్వ ఆఫర్లు, భవిష్యత్ ప్రభావాలు ఏమిటి? అనే అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
లొంగుబాట్ల పరంపర, మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ
మావోయిస్టు ఉద్యమం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక అసమానతలపై పోరాటం పేరుతో ప్రారంభమైంది. ఇప్పుడు దాని భవిష్యత్ అనిశ్చితంగా మారింది. 2025లో ఛత్తీస్‌గఢ్‌లో 1,040 మంది కేడర్ సరెండర్ అయ్యారు. ఇది రికార్డు స్థాయిగా చెప్పొచ్చు. జనవరి 2024 నుంచి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,100 మంది లొంగిపోయారు. 1,785 మంది అరెస్టు అయ్యారు. 477 మంది హతమయ్యారు. మాడ్ డివిజన్‌కు చెందిన 100 మంది కేంద్ర కమిటీ సభ్యుడు రూపేశ్ (ఆశన్న), మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత్ వంటి కీలక నేతలు లొంగిపోవడం ఉద్యమానికి పెద్ద నష్టం.
ఆశన్న (తక్కళ్లపల్లి వాసుదేవరావు) వంటి నేతలు పలు హైప్రొఫైల్ దాడులకు వ్యూహకర్తలు. ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నాలు, ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర హత్య వంటి ఘటనల్లో పాలుపంచుకున్నారు. ఆయన విడుదల చేసిన వీడియోలో "కేడర్‌ను రక్షించుకోవడం ముఖ్యం. అడవులు ఇక రక్షణ ఇవ్వవు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తాం" అని పేర్కొన్నారు. ఇలాంటి లొంగుబాట్లు మావోయిస్టు పార్టీకి కీలకమైనవి. ఎందుకంటే నాయకత్వ శూన్యత సృష్టించి, మిగిలిన కేడర్ మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. బండి ప్రకాశ్ (జంజర్ల శ్రీధర్) వంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కూడా లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇది సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావాన్ని తగ్గిస్తుంది.
బస్తర్ జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టులు
మావోయిస్టు పార్టీకి ఈ ఘటనలు భారీ నష్టం. నక్సల్ ఉద్యమం ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ, ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. భద్రతా బలగాల ఆపరేషన్లు (ప్రహార్, కాగజ్ వంటివి), అభివృద్ధి కార్యక్రమాలు, సరెండర్ పాలసీలు దీనికి కారణాలు. ఉద్యమానికి భవిష్యత్ లేదని చెప్పడం అతిశయోక్తి కాకపోయినా, మిగిలిన కేడర్‌ను ప్రభుత్వం తుదముట్టించే అవకాశాలు ఎక్కువ.
A landmark achievement in the battle to eliminate Naxalism. Today, in an operation in Narayanpur, Chhattisgarh, our security forces have neutralized 27 dreaded Maoists, including Nambala Keshav Rao, alias Basavaraju, the general secretary of CPI-Maoist, topmost leader, and the…
— Amit Shah (@AmitShah) May 21, 2025
సమాజంపై ప్రభావం, శాంతి, అభివృద్ధి అవకాశాలు
ఈ లొంగుబాట్లు సమాజానికి సానుకూలమైనవి. మావోయిస్టు కార్యకలాపాలు బస్తర్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకున్నాయి. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం ఆలస్యమయ్యాయి. ఇప్పుడు అబూజ్‌మడ్, దక్షిణ బస్తర్ ప్రాంతాలు నక్సల్ విముక్తమవుతున్నాయని అమిత్ షా ప్రకటించడం సంతోషకరం. ఇది స్థానికులకు భయ విముక్త జీవితం, ఆర్థిక అవకాశాలు అందిస్తుంది. లొంగిపోయినవారికి ప్రభుత్వం రూ.5 లక్షల నగదు, ఉద్యోగాలు, పునరావాసం వంటి ఆఫర్లు ఇస్తోంది. ఇది మరిన్ని సరెండర్‌లను ప్రోత్సహిస్తుంది.
పోలీసుల సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టులు
అయితే కొందరు విమర్శకులు ఈ సరెండర్‌లు నకిలీవా అని ప్రశ్నిస్తున్నారు. సమాజంలో మావోయిస్టు ఉద్యమం లేవనెత్తిన సమస్యలు భూమి సంస్కరణలు, ఆదివాసీ హక్కులు. ఇవి ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ప్రభుత్వం శాంతి కోసం అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలి. లేకుంటే కొత్త ఉద్యమాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది.
'నక్సల్ విముక్త భారత్' ప్రభుత్వ లక్ష్యం
అమిత్ షా 'ఎక్స్'లో ఈ ఘటనలపై సంతోషం వ్యక్తం చేశారు. "అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్ నక్సల్ విముక్తమయ్యాయి. దక్షిణ బస్తర్‌లోనూ త్వరలో పూర్తి నిర్మూలన జరుగుతుంది." ఇది ప్రభుత్వ 'నక్సల్ విముక్త భారత్' లక్ష్యాన్ని సమర్థిస్తుంది. భద్రతా బలగాలు, సరెండర్ పాలసీలు సమన్వయంతో పని చేస్తున్నాయి. మహారాష్ట్రలో సోను సరెండర్ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 50 మంది లొంగిపోవడం దీనికి ఉదాహరణ.
మొత్తంగా ఈ లొంగుబాట్లు మావోయిస్టు ఉద్యమాన్ని మసకబారుస్తున్నాయి. ప్రభుత్వ ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఉద్యమం పూర్తిగా అంతరించాలంటే మూల సమస్యలు పరిష్కరించాలి. ఇది శాంతి కోసం పెద్ద అడుగు. కానీ దీర్ఘకాలిక స్థిరత్వం కోసం అభివృద్ధి కీలకం.