జూపార్కులో ఏనుగులకు జంబో విందు, ఎందుకంటే...
x

జూపార్కులో ఏనుగులకు జంబో విందు, ఎందుకంటే...

ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెహ్రూజూపార్కులో ఏనుగుల కోసం అధికారులు జంబో విందు ఏర్పాటు చేశారు.ఏనుగులకు బెల్లం,చెరకుతో కలిపిన పండ్లు వడ్డించారు.


ఆగస్టు 12వతేదీ ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతుప్రదర్శన శాలలో ఏనుగులకు జంబో విందు ఇచ్చారు.

- అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్ జూపార్కులోని వనజ, ఆశ, సీత, విజయ్ లకు అధికారులు వివిధ రకాల పండ్లతో విందు ఇచ్చారు. ఏనుగుల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని జూపార్కు అధికారులు నిర్ణయించారు.
- జూ పార్కు ఫీడ్ స్టోరీ అధికారుల బృందం జూపార్కులోని ఏనుగులకు పచ్చి సలాడ్, బెల్లం, చెరుకుతో కలిపిన పండ్లు, కొబ్బరికాయలు వడ్డించారు.భూషణ్ మంజుల, మావటీలు రాజాకుమార్, వెంకటరావు, ఫయాజ్, షఫీ, అబ్దుల్లా, ఉదయ్ ఏనుగులకు విందు ఏర్పాటు చేశారు.

అత్యంత బరువైన జంతువులు...
ప్రపంచ వ్యాప్తంగా ఏనుగులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అత్యంత బరువైన జంతువులైన ఏనుగుల కోసం హైదరాబాద్ జూపార్కులో 10 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఆవరణ ఏర్పాటు చేశారు. ఏనుగుల ప్రాముఖ్యాన్ని సందర్శకులకు అధికారులు వివరించి చెప్పారు.



ఏనుగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు

హైదరాబాద్ జూపార్కులో ఏనుగుల కోసం ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏనుగులకు విందు వడ్డించే ముందు వాటిని స్విమ్మింగ్ పూల్ కు తీసుకువెళ్లి మడ్ బాత్, షవర్ బాత్ చేయించారు. వివిధ రకాల పండ్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులు ఏనుగులు ఆస్వాదించాయి. ఈ సందర్భంగా సందర్శకులకు ఏనుగుల సంరక్షణ గురించి అవగాహన కల్పించారు.ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణకు అవకాశం లేకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.ఈ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో జూపార్కు క్యూరేటర్ డాక్టర్ సునీల్ఎస్ హిరేమత్, డిప్యూటీ క్యూరేటర్ నాగమణి, డాక్టర్ ఎంఎ హకీం, లక్ష్మణ్ భనవత్, విష్ణువర్దన్, దేవేందర్, డాక్టర్ బాబురావు, జీవశాస్త్రవేత్త కె మోహన్, సూపర్‌వైజర్ గణేష్, హెడ్ యానిమల్ కీపర్ జి నాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



ఏనుగుల పరిరక్షణకు ఏపీ డిప్యూటీ సీఎం చర్యలు

ఏనుగుల పరిరక్షణకు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శ్రద్దను తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల దాడుల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఏనుగులు పొలాలు, జనావాసాల్లోకి రాకుండా పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ కర్ణాటకకు వెళ్లి సీఎం సిద్దరామయ్య తోపాటు, కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కూడా కలిశారు.ఏపీలో ఏనుగులు పంట నష్టం చేయకుండా నివారించేందుకు తమ రాష్ట్రానికి కుమ్కీ ఏనుగులు పంపించాలని కర్ణాటక సీఎంను పవన్ కళ్యాణ్ కోరారు.

పవన్ కళ్యాణ్ ట్వీట్
ప్రపంచ ఏనుగుల దినోత్సవం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.ఏనుగుల్ని కాపాడుతున్న వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏనుగులను పరిరక్షించేవారే రియల్ హీరోలంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు.


Read More
Next Story