వందేళ్ల జీవితం..3 లక్షల జీతం... 30 సెకన్లలో...
x
Traffic police march fast

వందేళ్ల జీవితం..3 లక్షల జీతం... 30 సెకన్లలో...

ఆకట్టుకుంటున్న ఆంధ్ర పోలీసు పోస్టర్ ప్రచారం


చక్రాల రాము (పేరు మార్చాం)... మహా అయితే 30 ఏళ్లు... విజయవాడ నగరం.. కష్టపడి పైకి వచ్చాడు.. మంచి కంపెనీలో ఉద్యోగం.. నెలకు 3 లక్షల జీతం.. బెంగళూరులో నివాసం.. సొంతూరు వచ్చిన ఆనందంలో ద్విచక్ర వాహనంపై రయ్.. రయ్.. మని పోతూ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశాడు. అంతే.. ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. 30 సెకన్లు ఓపిక పడితే అంతా సజావుగా సాగేది. అలాంటి 30 సెకన్లలో వందేళ్ల జీవితం, 3 లక్షల జీతం గాల్లో కలిసి పోయింది. కన్నవాళ్ల కడుపుకోత.. కంటికీ మింటికీ తడారకుండా పోయింది. అతని భార్య చలనం లేకుండా నిశ్చేష్టురాలైంది. చంకలోని చంటి పిల్ల దిక్కులు చూస్తూ రోదిస్తోంది. ఆ 30 సెకన్ల తప్పు అతని కుటుంబాన్ని అల్లకల్లోలం చేసింది.


ఇక్కడ సీన్ కట్ చేస్తే..
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నిత్యం సగటున సుమారు 20మంది చనిపోతున్నారు. ఏడాదికి సగటున 21,249 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2023-2024 లెక్కల ప్రకారం రోజుకు సగటున 58 మంది గాయపడుతున్నారు.
ప్రయాణంలో ఓర్పు, సహనం ఎంత అవసరమో ఈ సంఘటన తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్, రోడ్ రెయిజింగ్, రోడ్లపై యువత విన్యాసాలు వంటి వాటిపై ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం చేస్తున్న ప్రచారం బాగా ఆకట్టుకుంటోంది. ప్రయాణంలో ఓర్పును తెలియజేస్తోంది.
"ఈ భూమిపై మరో జన్మ పొందడానకి తల్లి గర్భంలో 0 నుంచి 9 నెలలు వేచి చూడాలి.
నడవడానికి 2 సంవత్సరాలు
స్కూలుకి వెళ్లడానికి 3 సంవత్సరాలు ఆగాలి
ఓటు హక్కుకై 18 ఏళ్లు ఆగాలి
ఉద్యోగం కోసం 25 ఏళ్లు ఆగాలి
పెళ్లి కోసం 25 నుంచి 30 ఏళ్లు ఆగుతున్నారు..
ఇలా ఎన్నో సందర్భాలలో వేచి చూసే మనం రోడ్లపై 30 సెకన్లు ఆగలేకపోతున్నాం"
ఎందుకు? అని ఊరూవాడా పోస్టర్లు వేసి, వచ్చిపోయే వాళ్లకు కరపత్రాలు పంచుతూ ప్రచారం చేస్తున్నారు.

ఆ 30 సెకన్లే చక్రాల రాము వేచి ఉన్నట్టయితే, బండిని ముందుకు దూకించకపోయి ఉంటే ఇవాళ ఆ కుటుంబం కకావికలయ్యేది కాదు కదా అని ఆయన స్నేహితుడు నన్నూరి కృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. "నేను ఈ రోడ్డు మీద జాగ్రత్తగా నడిచేలా మరెవ్వరికైనా నేర్పించాలి" అని నిర్ణయించుకున్నారు.
తన గ్రామంలోని కొందరు యువకులను కలుపుకుని, హెల్మెట్ పెట్టుకోమని, సరైన వేగంలో నడపమని, ట్రాఫిక్ నియమాలు పాటించమని అవగాహన కల్పిస్తున్నారు. ఒక రోజు ఓ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒక చిన్న అమ్మాయి "నేను జాగ్రత్తగా నడిచి నా అమ్మా, నాన్న కోసం బతకాలి" అని చెప్పింది. ఆ మాటలు గ్రామంలోని ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి.
రాము ప్రమాదం సమాజానికి ఒక పాఠం. మనం ఒక్క క్షణం జాగ్రత్తగా ఉంటే, మన కుటుంబాలను, మన సమాజాన్ని కాపాడుకోగలం. ఏపీ పోలీస్ శాఖ "ముందుకు వెళ్లేవాడు వెళ్లనీ... వెనకాల హాయిగా వెళ్లిపో" అని సూచిస్తే, అది కేవలం ఒక నియమం కాదు, ఇది మన జీవితాలకు, మన మనుగడకు ఒక ప్రతిజ్ఞ. రాము కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేమిటంటే ... మన జీవితం మనదే కాదు, మన సమాజం, మన కుటుంబం మీద ఆధారపడింది. అందుకే ప్రతి క్షణం జాగ్రత్త, ప్రతి ఆలోచన సమాజ భద్రత కోసం అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే చాలు. అందుకే పోలీసు శాఖ వారు చెప్పేది చెవికి ఎక్కించుకోవాలి.
ఎక్కడెక్కడో దెనిదేనికో ఏళ్ల తరబడి వెయిట్ చేసే మనం రోడ్లపై మాత్రం 30 సెకన్లు ఆగలేకపోతున్నాం. ఓవర్ టేక్ చేసే సమయంలో, వాహనం నడుపుతున్నప్పుడు, 30 సెకన్లు కూడా ఆగలేక పోతున్నాం.
తర్వాత తప్పిపోయి ఏమన్నా ఆక్సిడెంట్ అయితే ఆస్పత్రిలో రోజులు, గంటలు, వారాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితి ఉంటుంది.
కొన్ని సార్లు సెకన్ల గడబిడ వల్ల ఎంత భయానక మైన పరిణామాలు ఎదుర్కొంటున్నారో ఆలోచించండి.
ముందుకు వెళ్ళేవాడు వెళ్లనీ... వెనకాల హాయిగా వెళ్లిపో...
దయచేసి సరైన వేగం, సరైన దిశ, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ... హెల్మెట్ వాడుతూ వాహనాన్ని నియంత్రణలో ఉంచుకుని నడపండి. సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి.
మీ కోసం మీ కుటుంబ సభ్యులు, పిల్లలు మీ ఇంటి వద్ద ఎదురు చూస్తూ ఉంటారు. అని మరువకండి.
ప్రస్తుతం ఈ ప్రచారం బాగా ఆకట్టుకుంటోంది. ఒక్క క్షణం ఆలోచించండి.. హాయిగా జీవితాన్ని గడపండి.
Read More
Next Story