గుండెలను పిండేస్తున్న ఓ మెడికో సూసైడ్ లెటర్
మరో రెండు నెలల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి అవుతుంది. మార్చి తర్వాత డాక్టర్‌గా బయటకి వస్తాడు. ఈ లోగా..
బతకాలి అంటే భయం వేస్తోందమ్మా.. ఎంత కష్టపడి చదువుదాం అన్నా.. చదవలేక పోతున్నా. రకరకాల ఆలోచనలు. ఎందుకు బాధపడతానో తెలీదు. ఎందుకు సంతోషంగా ఉంటానో తెలీదు. ఆందోళన, కోపం, బాధ, భయం ఎందుకు ఎక్కువై పోతుందో తెలీట్లేదు. లాస్ట్ 8–9 మంత్స్ నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. అంటూ ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న సాయిమణిదీప్ తన తల్లిదండ్రులకు రాసిన సూసైడ్ లెటర్ గుండెల్ని పిండేస్తుంది.
సాయిమణిదీప్ మెడిసిన్ చదువుతున్నా మానసిక ఒత్తిడిని జయించ లేక పోయాడు. అల్లకల్లోలంగా మారిన ఆ ఎంబీబీఎస్ విద్యార్థి మనస్సు, మెంటల్ ప్రెషర్ నుంచి బయట పడలేక పోయింది. పరీక్షలు తప్పాననే ఆందోళన ప్రాణం తీసుకునేలా ప్రేరేపించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. డాక్టరవుతాడని ఎంతగానో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు. అత్యంత బాధాకరమైన ఈ సంఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్లలో చోటు చేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఆత్కూరి సాయిమణిదీప్ అనే యువకుడు విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే సాయికి రెండో ఏడాదికి సంబంధించిన సబ్జెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్చి నాటికి ఎంబీబీఎస్ కోర్సు కంప్లీట్ అవుతుంది. మరో వైపు ఆఖరి సంవ్సరంలో ఉండటంతో తోటి విద్యార్థులు ఫేర్‌వెల్ సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్సు పూర్తి కావస్తున్నా రెండో ఏడాది సబ్జెక్టులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర మానసిక వేదనకు అయ్యాడు. తోటి విద్యార్థులు పాస్ కావడం.. తాను మాత్రం పరీక్షలు తప్పడంతో తీవ్ర ఆందోళనలకు గురయ్యాడు. తాను పరీక్షలు తప్పాననే విషయాన్ని జీర్ణించుకోలేక పోయాడు. మళ్లీ పరీక్షలు రాసి పాస్ కావచ్చనే ఆలోచనలను మరిచి పోయాడు. ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారో అనే మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అందులో నుంచి బయటకు రాలేక ఆదివారం తెల్లవారు జాములన పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 10 గంటలైనా తన గది తలుపు మూసే ఉండటంతో తోటి విద్యార్థులు ఆ తలుపులు వెంటనే విమ్స్ కళాశాల పెద్దలకు సమాచారం అందించారు. దీంతో పాటుగా పోలీసులకు కూడా సమాచారం అందించారు. తలుపులు పగలగొట్టి చూసే సరికి సాయిమణిదీప్ విగత జీవిగా పడి ఉన్నాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో వైపు సాయిమణిదీప్ మరణ వార్త అతని తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చింది. సాయి మరణ వార్త విన్న తల్లిదండ్రులు ఆత్కూరి రామారావు, శిరీష కుప్ప కూలిపోయారు. శోక సముద్రంలో మునిగి పోయారు. డాక్టరై వస్తాడనుకుంటే శవమై రావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.
ఆత్మహత్యకు ముందు సాయిమణిదీప్ తన తల్లిదండ్రులకు రాసిన లెటర్ కన్నీరు పెట్టిస్తుంది.
డాడీ..అమ్మ.. తమ్ముడు నన్ను క్షమించండి. గత పది సంవత్సరాలుగా మిమ్మల్ని చాలా చాలా కష్టపెట్టాను, బాధపెట్టాను, నా వల్లే ఇంట్లో సంతోషం, ప్రశాంతత లేదు. నా వల్లే మీకు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. ఎంత కష్టపడి చదువుదాం అన్నా.. చదవలేక పోతున్నా. రకరకాల ఆలోచనలు, ఎందుకు బాధపడతానో తెలీదు. ఎందుకు సంతోషంగా ఉంటానో తెలీదు. నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్లు ఏదో విధంగా బాధపడుతూనే ఉంటారు. ఆందోళన, కోపం, బాధ, భయం ఎందుకు ఎక్కువై పోతుందో తెలీట్లేదు. లాస్ట్ 8–9 మంత్స్ నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఎవరికీ చెప్ప లేను. మీరు ఇప్పటికే నావల్ల తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఇంట్లో పరిస్థితుల వల్ల.. నాకు నేనే పిచ్చోడిలా అనిపిస్తున్నాను. అమ్మ నా కోసం మీరు ఇంత చేసారు. నేను మాత్రం మిమ్మల్ని బాధలు పెడుతూనే ఉన్నా. మీ నిద్ర, ఆరోగ్యం అన్నీ నా వల్లే పోతున్నాయి. బ్రతకాలి అంటే భయం వేస్తోందమ్మా. నా గురించి కాదు. ఇంకా ఎంత కాలం మిమ్మల్ని బాధపెట్టాలి అని. నా లాంటి పిచ్చోడు ఉండకూడదు. బతుకుదాం అని ఆశ ఉన్నా కూడా ఇంత ఇంత అదృష్టం కూడా ఉండదు. అందుకే మీరు ఆనందంగా ఉండటం నాకు కావాలి. నన్ను క్షమించండి డాడీ అమ్మా. అంటూ సాయిమణిదీప్ రాసిన లెటర్ గుండెలను పిండేస్తోంది.
Next Story