వెంకన్న సన్నిధిలో గుప్పుమన్న గంజాయి..!
x

వెంకన్న సన్నిధిలో గుప్పుమన్న గంజాయి..!


ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గంజాయి గుప్పుమంది. ఇప్పటి దాకా గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న గంజాయి తిరుపతిలో డోర్ డెలివరీ అవుతోంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇక్కడో యువకుడు ఏకంగా డోర్ డెలివరీ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ యువకుడొక్కడే ఈ పని చేస్తున్నారా లేక నిందితుని వెనుక ఏదైనా ముఠా ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భక్తిని సొమ్మును చేసుకునే పెద్దల్నే కట్టడి చేయలేక చస్తుంటే ఇప్పుడు ఏకంగా గంజాయి డోర్ డెలివరీపై పోలీసుల్లో కలవరపడుతున్నారు.

అసలేం జరిగిందంటే...

అతనో స్విగ్గీ డెలివరీ బాయ్. ఉపాధి కోసం పల్లె నుంచి పట్టణానికి వచ్చాడు. తిరుపతిలోని కొర్లగుంట మారుతీ నగర్‌లో మకాం పెట్టాడు. ఫుడ్ డెలివరీ బాయ్ గా స్విగ్గీలో చేరాడు. ఎలాగూ ఇంటింటికే వెళ్లి ఫుడ్ డెలివరి చేస్తున్నందున పనిలో పనిగా గంజాయి కూడా డెలివరీ చేసి నాలుగు డబ్బులు సంపాయించాలనుకున్నాడు. ఆ క్రమంలో దొరికిపోయాడు. ఏజెన్సీలో కిలో రూ.10వేలకు గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న పాకెట్లుగా తయారు చేసి తిరుపతిలో ఇంటి వద్దే డెలివరీ చేస్తున్నాడు. ఉపాధి కోసం స్విగ్గీలో పని చేస్తూనే ఎవరికి అనుమానం రాకుండా గంజాయిని కస్టమర్లకు ఇంటి వద్దకే చేరవేస్తుండటం ఇతని ప్రవృత్తి. ఈ క్రమంలో గురువారం ఓ ఇంటికి గంజాయి చేరవేస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 22కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.





ఎలా దొరికిపోయాడంటే..

నగరి మండలం ఓజీకుప్పం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు తిరుపతి మారుతీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇది పైకి కనిపించే పనే అయినా ఇతని ప్రవృత్తి మాత్రం గంజాయి సరఫరా. కొన్నాళ్లుగా తిరుపతిలో గంజాయి వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తరచూ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి వస్తున్న శ్రీనివాస్ పై నిఘా పెట్టారు. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే రెగ్యులర్ కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో కిలో రూ.10వేలకు గంజాయిని కొనుగోలు చేసి తిరుపతి తీసుకొస్తున్నాడు. వాటిని చిన్న పాకెట్లుగా మార్చి కస్టమర్లకు రూ.300 చొప్పున విక్రయిస్తున్నాడు. ఇలా కొన్ని నెలలుగా గంజాయి రవాణా చేసినట్టు గుర్తించారు.

నిందితుడిపై గతంలో అలిపిరి పిఎస్‌లో కూడా కేసు ఉంది.తాజాగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో గంజాయి డోర్ డెలివరీ చేస్తూ దొరికిపోయాడు. ఈసారి స్విగ్గీ డెలివరి బాయ్‌ రూపంలో విక్రయాలు చేస్తున్నట్టు గుర్తించారు. తిరుపతిలోని కొర్లగుంట మారుతీ నగర్‌లో స్విగ్గీ డెలివరీ నివాసం ఉంటూ ఆర్డర్ల ను బట్టి గంజాయి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. చెడు అలవాట్లు గురై అక్రమ సంపాదన కోసం గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గంజాయి కొనుగోలు చేస్తున్న వారిని కూడా గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

Read More
Next Story