బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఓ గాడిద- సల్మాన్ ఖాన్ కి చిక్కులు
మనుషుల్ని పంపాల్సిన రియాల్టీ షో బిగ్ బాస్ లోకి గాడిదను పంపి ప్రముఖ యాక్టర్ సల్మాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఇంతటి బరితెగింపు ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు
మనం ఏ సినిమా పెట్టినా ముందు ఓ ప్రకటన దర్శనమిస్తుంది. ఈ చిత్రంలో జంతువులకు ఎటువంటి హానీ కలిగించలేదని, కనిపించేవి కేవలం దృశ్య రూపకాలేనని, జంతు సంరక్షణకు కట్టుబడి ఉన్నామనేది దానర్థం. ఇంతటి చిన్న లాజిక్ అంతటి బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రత్యేకించి ప్రముఖ సినీస్టార్ సల్మాన్ ఖాన్ ఎలా మరిచారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. జరిగింది చిన్న పొరపాటే అయినా ఓ పెద్ద జంతు సంరక్షణ సంస్థ- పేటా-కు నిర్వాహకులు సంజాయిషీ చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
అసలింతకీ ఏమి జరిగింది
ఇప్పుడు దేశవ్యాప్తంగా బిగ్ బాస్ -18 హిందీ సీజన్ మొదలైంది. అక్టోబర్ -6న గ్రాండ్ ప్రీమియర్ రియాలిటీ షోలో 18 మంది కొత్త కంటెస్టెంట్‌లను పరిచయం చేసింది. టీవీ నటులు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫులెన్షియర్లు ఈ షోలో పాల్గొంటున్నారు. కంటెస్టెంట్లను సల్మాన్ ఖాన్ పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నారు. ఇంతలో అనుకోని ఓ సంఘటన అక్కడున్న ప్రేక్షకుల్నీ, టీవీ వీక్షకుల్ని సంబ్రమాశ్చార్యాలలో ముంచెత్తింది. '19వ కంటెస్టెంట్'గా ఓ గాడిద ఒండ్రపెట్టుకుంటూ లోనికి వెళ్లడమే ఇందుకు కారణం. అసలు మనుషుల్ని పంపుతున్నప్పుడు ఈ గాడిదను -లోపలికి వెళ్లడమే ఇప్పుడు నిర్వాహకలకు తలనొప్పిగా మారింది. తాజాగా జంతు సంరక్షణ సంస్థ పేటా (PETA) కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సల్మాన్ ఖాన్ కి బుధవారం ఓ లేఖ రాసింది.
పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) ఇండియా విభాగానికి చెందిన న్యాయవాది శౌర్య అగర్వాల్ బిగ్ బాస్- 18 హోస్ట్ సల్మాన్ ఖాన్‌కు ఈ లేఖ రాశారు. షోలో గాడిదను ఉపయోగించడమేమిటని ప్రశ్నించారు. "బిగ్ బాస్ హౌస్‌లో గాడిదను ఉంచడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని, ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయమై ఫిర్యాదు చేశారని, వాటికి తమరిచ్చే వివరణ ఏమిటంటూ శౌర్య అగర్వాల్ ఆ లేఖలో అడిగారు. షోలో జంతువును చేర్చడం 'బాధకరం' అని పేర్కొన్నారు. ఈ తీరు జంతువుల్ని రక్షించేలా లేదని PETA అభ్యంతరం తెలిపింది. ఏదైనా గాడిద దారితప్పి మీ కంట పడినపుడు తోటి గాడిదలు ఎక్కడ ఉన్నాయో చూసి దాన్ని అక్కడ వదలాలి గాని చూస్తూ ఎలా ఉన్నారని ప్రశ్నించింది. గాడిద కనిపించినపుడు తమకైనా (PETA) అప్పగించాల్సిందన్న అర్థం వచ్చేలా ఆ లేఖ ఉంది.
ఈ లేఖతో బిగ్ బాస్- 18 అతిపెద్ద మలుపు తిరిగింది. సోమవారం, ప్రదర్శన యొక్క మేకర్స్ గాడిదను సెంటర్ స్టేజ్‌గా తీసుకున్న ప్రోమో వీడియోను పంచుకున్నారు, ఇది పోటీదారులలో ఆసక్తిని రేకెత్తించింది.
ఆ గాడిద పేరు గధ్ రాజ్...
గధ్‌రాజ్ అని పేరున్న గాడిదను బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశిస్తున్నట్లున్న ప్రోమో కూడా ప్రసారమైంది. హౌస్ లోపల గధ్ రాజ్ కి ఓ మూలన ప్రత్యేక స్థలం కేటాయించినట్టు కూడా ఆ ప్రోమోలో ఉంది. ఆ గాడిద గురించి కంటెస్టెంట్లు చర్చిస్తున్నట్లు కూడా ఉంది. ఓ పోటీదారు శ్రుతిక అయితే "మై ఉస్కో టాయిలెట్ ట్రైనింగ్ దే రహీ హు (నేను ఆ గాడిదకి టాయిలెట్ శిక్షణ ఇస్తాను" అన్నట్టుగా చూపారు. ఆ క్లిప్ క్యాప్షన్‌తో పోస్ట్ అయింది. “ఆ గయే హై ఘర్వాలోన్ కే సాథ్ రెహ్నే హుమారే ప్యారే గాధ్‌రాజ్, దేఖేంగే కైసే ఉథాయేంగే యే అప్నీ ఆవాజ్! (మన ప్రియమైన గధ్రాజ్ హౌస్‌మేట్స్‌తో కలిసి ఉండటానికి ఇక్కడకి వస్తున్నాడు. ఇప్పుడు ఇంటి లోపల తన స్వరాన్ని ఎలా పెంచుతాడో చూద్దాం)” అని మరొకరు కామెంటు చేశారు. దీన్ని కూడా పేటా అభ్యంతరం పెట్టింది. 'షో సెట్‌లో జంతువులను ఉపయోగించడం నవ్వించే విషయం కాదు' అని లేఖలో పేర్కొంది. 'జంతువులను వినోదం కోసం ఉపయోగించుకోవద్దు' అని సల్మాన్‌ను కోరారు. కంటెస్టెంట్లలో ఒకరైన న్యాయవాది గుణరత్న సదావర్తే గాడిదను ఇంట్లోకి తీసుకొచ్చారని లేఖలో పేర్కొన్నారు.
సల్మాన్ ఆ షోలో పాట్గొంటున్న ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ హౌజ్‌లోకి పంపించారు. ఈ క్రమంలో ఓ గాడిదను కూడా ఇన్మేట్ గా పరిచయం చేసి లోనికి పంపించారు. ఈ వీడియోను కలర్స్ ఛానెల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు- ఇదేం పోయేకాలం, ఇంత బరితెగించారేమిటంటూ- కామెంట్లు పెడుతున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి గాడిదను కూడా కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారా.. దానికి పేమెంట్ ఇస్తారా ? అంటూ తమదైన శైలిలో పోస్టులు పెట్టి బిగ్‌బాస్‌ను ట్రోల్ చేస్తున్నారు.
Next Story