
తీవ్ర అల్పపీడనంగా బలపడిన అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు.
బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి అనుకుని వాయవ్య దిశలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. బంగాళాఖాతంలో పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీని వల్ల వచ్చే 24 గంటల్లో ఒడిశా రాష్ట్రం మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూంచింది.
సముద్ర తీరం వెంబడి 60కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను సూచించింది. తీవ్ర అల్పపీడనంగా బలపడిన క్రమంలో దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో వైపు మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. పూర్తిగా నీట మునగడంతో విజయవాడ మున్సిపల్ సిబ్బంది ఆ వరద నీటిని ట్యాంకర్ల ద్వారా తొలగించే పనులు చేపట్టారు. మరో వైపు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం ప్రస్తుతానికి నిలకడగానే కొనసాగుతోంది. 1.37 క్యూసెక్కుల వరద నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీలో కలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యారేజీ 69 గేట్లు ఎత్తివేసి వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.