ఆశలన్నీ అనపర్తి పైనే...! కూటమిలో సంకటమైన పరిస్థితి
రాష్ట్రంలో పొత్తుల సమీకరణలు కూటమిలో అభ్యర్థుల మధ్య చిచ్చు రేపాయి. అభ్యర్థుల మార్పు టిడిపి- బిజెపికి సంకటంగా మారింది.
(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)
తిరుపతి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీ వదులుకుంటే, ఆ లోటు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో భర్తీ చేయడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. మార్పు జరిగే సమయం కోసం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బిజెపి సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డి ఆత్రుతగా నిరీక్షిస్తున్నారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని చెల్లపల్లి నరసింహారెడ్డి 25 ఏళ్లుగా ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఈసారి అభ్యర్థిత్వం కోసం ఆరాటపడుతున్నారు. ఆయన నేపథ్యం ఒకసారి గమనిస్తే..
అలుపెరగని రాజకీయ బాటసారి అనే పేరు బిజెపి నేత ఎం వెంకయ్యనాయుడుకు వర్తిస్తుంది. ఆయన స్ఫూర్తితో చల్లపల్లి నరసింహారెడ్డి కాషాయ జెండా ఎత్తుకున్నారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని 25 ఏళ్లుగా ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాటం సాగిస్తున్నారు. తాజా ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల మార్పిడి జరుగుతోంది. ఇది కాస్తా చల్లపల్లి నరసింహారెడ్డితో తంబళ్లపల్లె అభ్యర్థిత్వం దోబూచులాడుతోంది.
పోటీలో టిడిపి అభ్యర్థి.. నిరసనలు
పొత్తుల నేపథ్యంలో తంబళ్ళపల్లి కూటమి అభ్యర్థిగా దాసర్లపల్లి జయచంద్ర రెడ్డిని టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే జీ శంకర్ ఆగ్రహంగా ఉన్నారు. నియోజకవర్గంలో అనేక చోట్ల టిడిపి ప్రచార సామగ్రిని ధ్వంసం చేశారు. టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన చంద్రారెడ్డి పల్లెలకు వెళ్తే.. మాజీ ఎమ్మెల్యే జి. శంకర్ వర్గం అడ్డుకుంటున్నది. ఎన్ని ప్రయత్నాలు చేసినా జి శంకర్ వర్గం దిగి రావడం లేదు. ఆయన వర్గంలోని అనేక మంది నాయకులు కార్యకర్తలు తాడేపల్లికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు నిరసన కూడా దిగారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ శాంతింప చేయడానికి విఫల యత్నం చేశారు.
సేమ్ సీన్
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది. బలహీనంగా ఉన్న బిజెపికి సీటు ఇవ్వడం ఏంటని టిడిపి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన వర్గం నిరసనలకు దిగింది. దీంతో మధ్యేమార్గంగా బిజెపి, టిడిపి రాష్ట్ర నాయకులు మధ్య చర్చలు జరిగాయని, అవి ఇంకా తుది రూపం దాల్చలేదని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ప్రధానంగా బిజెపికి కేటాయించిన అనపర్తిని టిడిపి తీసుకొని, తంబళ్లపల్లెలో టిడిపి అభ్యర్థిని మార్పు చేసి బిజెపికి ఇవ్వాలని సూత్రప్రాయంగా ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని బిజెపి రాష్ట్ర కమిటీ కేంద్ర పెద్దలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇందులో రాష్ట్ర కమిటీనే నిర్ణయం తీసుకోవాలని సూచించారని సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై నాలుగు రోజులుగా తర్జనభర్జనలు సాగుతున్నట్లు బిజెపి నేతల ద్వారా అందిన సమాచారం స్పష్టం చేస్తోంది.
చల్లపల్లి నిరీక్షణ..
ఇద్దరు గొడవపడితే మూడో వ్యక్తికి లాభం చేకూరుస్తుందని సూత్రం చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లెలో ప్రతిఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. బిజెపి రాష్ట్ర కమిటీ నిర్ణయం కోసం సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి నిరీక్షిస్తున్నారు." మాది తంబళ్లపల్లి ప్రాంతమే. 2024 ఎన్నికల్లో పోటీ కోసం పార్టీ యంత్రాంగాన్ని సమాంతం చేసుకున్న" అని చల్లపల్లి నరసింహారెడ్డి ఫెడరల్ ప్రతినిధితో చెప్పారు.
గత 17 నెలలుగా నియోజకవర్గంలో అన్ని పల్లెలు తిరుగుతూ, పాత పరిచయాలతో పాటు పార్టీ యంత్రాంగాన్ని కూడా సంసిద్ధం చేసుకున్నా" చల్లపల్లి నరసింహారెడ్డి వివరించారు. " రాజకీయ దిగ్గజాలను ఎదుర్కొని, ప్రాణహాని నుంచి కూడా బయటపడ్డానని" ఆయన గుర్తు చేశారు. మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసిన నేను 7, 518 ఓట్లు సాధించి తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎదగడానికి బిజెపి తనకు ప్రోత్సాహం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
ఓటమి దెబ్బలు తగిలినా..
చల్లపల్లి నరసింహారెడ్డిది తంబళ్లపల్లి ప్రాంతంలో ఓ సామాన్య రైతు కుటుంబం. 1980లో మదనపల్లి కొచ్చిన అప్పటి బిజెపి ఎమ్మెల్యే, రాజకీయాల్లో బహుదూరపు బాటసారి ఎం వెంకయ్య నాయుడుతో ఏర్పడిన పరిచయం పార్టీ పట్ల "తనను అంకిత భావంతో పనిచేసే దక్షతను నేర్పించిందని" చల్లపల్లి నరసింహారెడ్డి అంటున్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి మొదట 1994లో ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కడప ( కలిచర్ల) ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టిడిపి సీనియర్ నాయకురాలు ఏవి లక్ష్మీదేవమ్మతో పోటీ చేసిన నరసింహారెడ్డి కేవలం 7,518 ఓట్లతో మిగిలారు. 1999లో రాజకీయంగా చండశాసనుడైన కలిచర్ల ప్రభాకర్ రెడ్డి పై పోటీ చేసి దీటైన పోటీ ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డికి 51,030 ఓట్లు వస్తే, చల్లపల్లి నరసింహారెడ్డి 41,136 సాధించగలిగారు.
స్వల్ప తేడాతో ఓటమి. ..
మాజీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో బాంబు దాడి ఘటన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ హవా బలంగా ఉంది. టిడిపితో పొత్తు నేపథ్యంలో బిజెపి అభ్యర్థిగా 2004 లో చల్లపల్లి నరసింహారెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డికి 36, 291 ఓట్లు లభించాయి. నరసింహారెడ్డి 35, 671 ఓట్లు సాధించి , కేవలం 620 ఓట్లతో ఓటమి చెందారు. మళ్లీ పొత్తు నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఆయన మదనపల్లి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఇలా 2019 ఎన్నికల వరకు ఆయన ఓటమి పాలవుతూ వస్తున్నారు.
ఈసారి తంబళ్లపల్లె నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకున్నానని చెల్లపల్లి నరసింహారెడ్డి చెబుతున్నారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాలి. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం స్థానికంగానే పరిమితం చేసే దిశగా జాగ్రత్తలు తీసుకున్నారు. తనకు దీటైన అభ్యర్థి లేకుండా ముందుచూపుతో వ్యవహరిస్తారనేది ఆయనను దగ్గరగా గమనించేవారు చెబుతారు. పార్టీలో రాష్ట్ర జాతీయ కమిటీ నాయకులతో సత్సంబంధాలు నేరిపే ఆయనకు, కర్ణాటక నుంచి మిత్రులు సన్నిహితులు ఆర్థిక తోడ్పాటు అందిస్తారనేది సన్నిహితుల ద్వారా తెలిసింది. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే.. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని తెలుగువారు ఎక్కువగా ఉండే దాదాపు పది నుంచి 15 నియోజకవర్గాల పరిధిలో చల్లపల్లి నరసింహారెడ్డి ప్రభావం ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయం ఇలా ఉంచితే...
టిడిపి సీట్..
శంకర్ కే ఇవ్వండి
తంబళ్లపల్లెలో టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జి శంకర్ కు అవకాశం కల్పించడానికి చొరవ తీసుకోవాలని బిజెపి జాతీయ కార్యదర్శి, రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి నియోజకవర్గ నాయకులు విన్నవించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ మద్దతుదారులు. నాయకులు కిరణ్ కుమార్ రెడ్డిని సోమవారం పీలేరులో కలిసి తంబళ్లపల్లె రాజకీయ పరిస్థితులు వివరించారు. ఇక్కడి విషయాలను టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు, బిజెపి పెద్దలకు కూడా వివరించాలని వారు విన్నవించారు. లేదంటే కూటమికి పెద్ద దెబ్బ తగులుతుందని వారు విశ్లేషించి వివరించారు. తాజాగా తెరపైకి వచ్చిన పరిణామాల నేపథ్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం అభ్యర్థుల మార్పు వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది అనేది వేచి చూద్దాం.