‘ఐపీఎస్‌లపై సామాన్యుడు సంధించిన‌ లేఖాస్త్రం
x

‘ఐపీఎస్‌లపై సామాన్యుడు సంధించిన‌ లేఖాస్త్రం'

రాష్ట్రంలోని పరిస్థితులపై ఐపీఎస్ అధికారులకు ఓ సామాన్యుడు సంధించిన లేఖాస్త్రం ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. అసలు ఆ లేఖలో ఏముంది..


సమాజంలో జరిగే అనేక అంశాలపై ప్రజలు అసంతృప్తితో ఉంటారు. కానీ ప్రశ్నించే ధైర్యం మాత్రం ఎవరూ చేయరు. ప్రశ్నిస్తే తమను ఎక్కడైనా ఇరికిస్తారన్న భయమో.. మనకు సంబంధంలేని విషయం కదా అనో.. మాదకద్రావ్యాలేగా అవి మనం వాడం కదా అనుకునో అందరూ సైలెంట్‌గా ఉండిపోతారే తప్ప అధికారులను, యంత్రాంగాన్ని ప్రశ్నిద్దాం అని ఎవరూ అనుకోరు. ఎవరైనా చేస్తే పెద్ద సాహసమే చేసినట్లు అందరూ చూస్తారు. అప్పటికీ ఆ ప్రశ్నించే హక్కు తమకూ ఉందని ఎవరూ గుర్తించరు. అందుకేనేమో ఈ అవినీతి అధికారులు, అధినేతల ఆటలు విచ్చలవిడిగా సాగుతున్నాయేమో.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సామాన్యుడు ఐపీఎస్‌లపై ఓ లేఖాస్త్రం సంధించారు. ఇది మీకు న్యాయమా అంటూ నిలదీశారు.


మీకు మేము సలహా ఇవ్వలేం

ఐపీఎస్ సార్లూ మేము మీకు సలహాలు ఇచ్చే అంతటోల్లం కాదంటూనే వారికి గట్టి ప్రశ్నించారు ఆ సామాన్యుడు. అతడి లేఖ యథాతథంగా..

‘‘ఐపీఎస్ సార్లూ.. మీరు సివిల్స్ చదివి లక్షల మంది పోటీదార్లతో పోటీపడి ఐఏఎస్ తర్వాత అత్యున్నత స్థానమైన ఐపీఎస్‌కు ఎన్నికయ్యారు. అంతేకాకుండా విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని విధులు నిర్వహించిన అనుభవజ్ఞులు కూడానూ. మావి మీకు సలహాలు ఇచ్చేంత చదువులు కావు. కానీ ఒక సామాన్యుడిగా ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనలు చూసి సిగ్గుతో తలదించుకున్నాను. వాటిలో కొన్ని..

1. మన రాష్ట్రానికి చెందిన పోలీసు కానిస్టేబుళ్లు తమ విధులకు సెలవు పెట్టి.. పొరుగు రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తూ దొరికిపోవడం.

2. మన పోలీసు అధికారులపై నమ్మకం లేక గొడ్డలి పోటు కేసులో సీబీఐ దర్యాప్తు కోరితే ఆ సీబీఐ అధికారిపైనే కేసు పెట్టడం.

3. అదే కేసులో ఎంపీని అరెస్ట్ చేయడానికి సీబీఐ బృందం వస్తే శాంతిభద్రతల సమస్య అని చెప్పి చేతులు ఎత్తేసి.. సీబీఐని నిలువరించడం.

4. ఎవరిపైన అయినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే కోర్టుకు వెళ్లాలి కదా. దానికే తిరిగి లేఖ రాయడం ఏంటి?

5. ఇవన్నీ ఒక లెక్కయితే.. ఎస్‌సీలపైనే ఎస్‌సీ అట్రాసిటీ పెట్టి కోర్టులో సిగ్గు పోగొట్టుకోవడం.

6. మీ బాస్‌ను ఎన్నోసార్లు హైకోర్టు పిలిపించి.. విధులు గుర్తు చేయాలా.. పనితీరు మార్చుకుంటారా అని నిలదీయడం చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా?

7. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతిపక్షాలు ఎప్పుడు పోరాలకు పిలుపునిచ్చినా సెక్షన్ 144 అమలు చేయడం. పోరాడే చోట అరెస్ట్ చేయడం, నచ్చజెప్పడం, హౌస్ అరెస్ట్‌లు చేయడం, ఆఖరికి ఎంపీలకు కూడా ఇదే గతి పట్టడం. ఇదెక్కడి విడ్డూరం?

8. ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం జగన్.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ‘ఈ పోలీసులను నేను నమ్మను’ అంటూ వారి కులాల ఆధారంగా లేఖలు రాసినప్పుడు ఏ ఐపీఎస్ అయినా స్పందించారా?

9. మహిళల అదృశ్యంపై రాజ్యసభలో చర్చ జరిగిన తర్వాత భయపడిన మహిళలకు ఎవరైనా భరోసా కల్పించారా?

10. బాధితులపైనే కేసులు పెట్టిన కాలం ఈ ఐదేళ్లు కాదా!

11. పోలీసు స్టేషన్‌లోనే దళితుల మీద ఎప్పుడైనా శిరోముండనం జరిగిందా?

12. పనితీరులో రాష్ట్రపతి పథకం అందుకున్న నిజాయితీపరుడైన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు మీద కక్ష ఎందుకు అని ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించారు?

13. గంజాయి బయట రాష్ట్రాల్లో ఎంత దొరికింది? మన రాష్ట్రంలో ఎంత లభ్యమైంది? లెక్కలు ఉన్నాయా?

14. ఒక ఎంపీని అరెస్ట్ చేయించి పాదాలు కందేలా కొట్టించారు. దానిని జడ్జీ, డిఫెన్స్ ఆసుపత్రి వైద్యులు కూడా గుర్తించారు. అధికారంలో ఉన్న పార్టీ కోసం ఎంపీని కొట్టడం గురించి తెలిసినప్పుడు ఎవరైనా స్పందించారా?

15. ఆంధ్రాలోని గ్రామ గ్రామాల్లో గంజాయి దొరకట్లేదని ఎవరైనా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా?

16. ఈ రాష్ట్రంలో పోలీసులు మనకు రక్షణగా ఉంటారు అని వైసీపీ వాళ్ళు తప్ప ఎవరైనా అనుకుంటున్నారా?


ఇలా రాస్తూ.. అడుగుతూ పోతే.. లిస్ట్ పూర్తవ్వడానికే చాలా కాలం పడుతుంది. పొరుగు రాష్ట్రాన అధికారులు విదేశాలకు పారిపోయారన్న వార్తలు వింటే అందరికీ భయమే వేస్తుంది. మన విధులను రాజ్యాంగ పరిధిలో నిష్పక్షపాతంగా నిర్వహిస్తే మరో రాజ్యాంగ వ్యవస్థయిన ఎన్నికల సంఘం నిర్ణయాలపై పరిధి దాటి లేఖలు రాయాల్సిన అవసరం ఉంటుందా? మీరు రోజూ సంతకాలు చేసే లేఖల్లో ఎక్కువ శాతం ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీ చేసే ఆరోపణలు, ఒక పత్రికలో వచ్చే కథనాలే అచ్చం అచ్చు గుద్దినట్లు అక్షరం పొల్లు పోకుండా ఉంటున్నాయి. వైసీపీ మినహా ఇతర పార్టీలు, ఈసీ, మీడియాపై వైసీపీ వాళ్లకు ఉన్న అభిప్రాయాలను మీ అభిప్రాయాలుగా మీ 19 మంది సివిల్స్ అధికారులకు ఉన్నాయని అర్థం చేసుకోవడానికి మేము సివిల్స్ చేయాలని పని లేదు. కాస్త కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. చక్కగా అర్థమవుతోంది. ఇంకా వ్యవస్థల మీద ఉన్న నమ్మకంతో సహనంగా ఎదురుచూస్తున్న, గౌరవిస్తున్న సమాజ సహనానికి కూడా ఒక పరిధి ఉంటుందని అర్థం చేసుకోండి.

ఇట్లు

ఒక సామాన్యుడు’’ అని రాసున్న లేఖ ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది.

ఇది టీడీపీ పనేనా..

అయితే సామాన్యుడి లేఖ అని తెగ హల్‌చల్ చేస్తున్న లేఖపై అనేక అనుమానాలు వస్తున్నాయి. సామాన్యుడి పేరిట ఈ లేఖను టీడీపీనే రాసిందని, అందుకే ఇది పూర్తిగా వైసీపీనే టార్గెట్ చేస్తుందంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సీఎం జగన్‌ను టార్గెట్ చేయడం, వైసీపీ చర్యలను మాత్రమే ప్రశ్నించడం ఇందుకు ఉదాహరణ అని. వైసీపీపై బుదరజల్లాలన్న ఉద్దేశంతోనే టీడీపీ ఈ లేఖ పన్నాగం పన్నిందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో సామాన్యుడి పేరుతో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఏ ఐపీఎస్ కూడా స్పందించలేదు.




Read More
Next Story