కోడిపుంజుల ఈత సరదా తండ్రీకొడుకుల ప్రాణాలు తీసింది
x

కోడిపుంజుల ఈత సరదా తండ్రీకొడుకుల ప్రాణాలు తీసింది

కళ్లముందే మునిగిపోతున్న కొడుకును రక్షించబోయి తండ్రి కూడా మృత్యువాత పడ్డాడు.


అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింగపేట గ్రామంలో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సాగిన ఓ పనే ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. నీటి కుంటలో పడి తండ్రీకొడుకులు ఇద్దరూ మృత్యువాత పడ్డారు.
అసలేం జరిగిందంటే
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింగపేట గ్రామానికి చెందిన సింహాద్రి పాపారావు (40), తన కుమారుడు జశ్వంత్‌ (14)తో కలిసి తాము పెంచుకుంటున్న కోడిపుంజులను ఈత కొట్టించేందుకు పొలం వద్ద ఉన్న నీటి కుంట దగ్గరకు తీసుకెళ్లారు. కుంటలో కోళ్లను ఈత కొట్టిస్తున్న సమయంలో, ప్రమాదవశాత్తు జశ్వంత్ కాలుజారి లోతైన నీటిలో పడిపోయాడు. కొడుకు మునిగిపోతుండటం చూసిన పాపారావు, తనకు ఈత రాకపోయినా ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకారు. అయితే దురదృష్టవశాత్తు ఇద్దరూ నీటిలో మునిగి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు
మర్రిగూడెం హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న భర్తను ఒకేసారి కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇంటర్ చదువుతున్న కూతురు, భార్య ఆవేదన వర్ణనాతీతం. వారి రోదనలు అక్కడి వారిని కన్నీటి పర్యంతం చేశాయి.
పోలీసుల దర్యాప్తు
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం కోతులగుట్ట సీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను బలితీసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read More
Next Story