వర్షించని మేఘం..శ్రమించని మేధావి ఉన్నా,లేకున్నాఒకటే
x

వర్షించని మేఘం..శ్రమించని మేధావి ఉన్నా,లేకున్నాఒకటే

⁠చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటే కలిసి మాట్లాడుకుందాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.


“వర్షించని మేఘం... శ్రమించని మేధావి” ఉన్నా, లేకపోయినా ఒక్కటే, అలాగే కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు తీసుకురావాలనే రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ప్రారంభించామని, ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకోని 10 వేల మంది పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించగలిగామని అన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పదోన్నతి ఎంత కీలకమో తెలుసు కాబట్టే ఎటువంటి పైరవీలకు తావు లేకుండా అర్హతే ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతలు కల్పించామన్నారు.

గురువారం చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును ప్రారంభించిన అనంతరం జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనపై ఇంత బలంగా ముందుకు వెళ్తుందంటే దానికి కారణం మీ అందరి మద్దతు. మీరు ప్రభుత్వానికి అండగా నిలబడడంతోనే ఇదంతా సాధ్యమైంది అని అన్నారు.

మన ఐక్యతే రాష్ట్రానికి బలం
కూటమిలో ఉన్న మూడు పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలు ఉన్నా... మనందరం “రాష్ట్రం బాగుండాలి- అరాచకాలు ఉండకూడదు అనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డాం. మనలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్థలు ఉండటం సహజం. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరతాయి. ఆ రోజు చిన్నగా మొదలుపెట్టిన కూటమి ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో బలమైన శక్తిగా మారింది. ఈ రోజు ఇంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగామంటే కారణం మనందరి ఐక్యతే. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్లు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.
కష్టపడితేనే ప్రతిఫలం
నేను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏనాడు కూడా గుర్తింపు కోరుకోలేదు. సమాజంలో నిస్సహాయులైన వ్యక్తులకు అండగా నిలబడడమే నాయకుడి లక్షణం. నిస్వార్థంగా మన పని మనం చేసుకుపోతే గుర్తింపు, పదవి వాటికవే వస్తాయి. అంతే తప్ప పదవే పరామావధిగా భావించి పని చేస్తే అందలం ఎక్కడం కష్టం. ఏ వ్యక్తికి అయినా పదవి అనేది బాధ్యత తప్ప అలంకారంగా మారకూడదు. మన జిల్లాకే తలమానికం అయిన శేషాచలం అడవులను అడ్డగోలుగా దోచేశారు. ఇప్పటి వరకు దొరికిన సంపద కేవలం 10 శాతం మాత్రమే. దొరికిన పది శాతం విలువే వేలకోట్లలో ఉంటే... ఇప్పటి వరకు దొరకని సంపద విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు.
---
పవన్ కు స్ఫూర్తినిచ్చిన ఈ వీరుడి వీడియో కూడా ఒక సారి చూడండి

--

అలాంటి వాళ్లను మనం నిలువరించాలి. అవినీతిని అరికట్టి బలహీనుల గొంతుగా మారాలి. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునే రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వం అని గత పాలకులు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి భయపెట్టాలని చూడటం మనం చూశాం. అయినా జనసేన ఎక్కడా తగ్గలేదు. పంచాయతీ ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి నిలబడ్డారు. జనసేన పార్టీ ముఖ్య లక్ష్యం సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని నింపడం. ఆ దిశగా పార్టీ అడుగులు వేస్తుంది. కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని మరి గుర్తింపు ఇస్తాం. గ్రామ స్థాయి నుంచి లోక్ సభ నియోజక వర్గం వరకు ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తాం అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, అరణి శ్రీనివాసులు, కె. మురళీమోహన్, అరవ శ్రీధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌ కొట్టే సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లె ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన స్వచ్ఛరథాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. తిరుచానూరు, కరకంబాడి పంచాయతీల నుంచి తీసుకొచ్చిన స్వచ్ఛ రథాల దగ్గరకు వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. పొడి చెత్త, పనికిరాని వస్తువులు తీసుకొస్తే ప్రజలకు అందిస్తున్న నిత్యావసరాలను పరిశీలించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులను అభినందించారు.
Read More
Next Story