
పార్టీకి డొనేషన్ ఇచ్చిన కంపెనీకి 8,234 ఎకరాల భూమి
కూటమి ప్రభుత్వం ఔదార్యం వెనుక రహాస్యం ఇదేనా?
కూటమి ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఆయన కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ తండ్రి అయినప్పటికీ లోకేష్ మాటలకే ప్రభుత్వంలో విలువ ఉందనే చర్చ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని కంపెనీలు ఫేక్ అంటూ తీవ్ర విమర్శలు చేసిన లోకేష్ తిరిగి ఇప్పుడు ఆ కంపెనీలకే పట్టం కట్టడం వెనుక మతలబు ఉందని రాజకీయ విమర్శలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇండోసోల్ సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో 8,234 ఎకరాల భూమి సేకరణపై తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం మొదటి విడతలో 4,912 ఎకరాల సేకరణకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక రైతులు తమ జీవనాధారమైన సారవంతమైన భూములను కోల్పోతామని భయపడుతూ, పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
ఇండోసోల్ ను నాడు ఫేక్ అని... నేడు ఎందుకు లైక్ చేస్తున్నారు?
ఈ వివాదంలో రాష్ట్ర ఐటి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, కూటమి ప్రభుత్వంపై విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఇండోసోల్‌ను "ఫేక్"కంపెనీ అంటూ లోకేష్ నాడు తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి ఫేక్ కంపెనీ ఇపుడు ’లైక్‘ కంపెనీ ఎలా అయింది? కరేడులో రైతులు ఏమంటారో అని విచారించకుండానే ఈ ఫేక్ కంపెనీకి భూములు అప్పగించడం వెనక అనుబంధం ఉంది. అదే పార్టీ డొనేషన్ అనుబంధం అనే విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభకు కరేడులో హాజరైన రైతులు
టీడీపీ ఫండ్ కు రూ. 40 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్
ఇండోసోల్ యాజమాన్యానికి చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ (Shirdi Sai Electricals Limited :SSEL) జగన్ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్ పనులకు సంబంధించి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు పొందింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుండటం ఏమిటి? ఆర్థిక ప్రయోజనాలుంటే ఏమైనా చేస్తారా, అభిప్రాయమైనా మార్చుకుంటారా అనేది ప్రశ్న. ఇక్కడ మరొక విషయం ఉంది. షిర్డీ సాయి ఎలెక్ట్రికల్స్ సంస్థ తెలుగుదేశం పార్టీకి భారీగా విరాళమిచ్చింది. ADR (Association for Democratic Rights) వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ సంస్థ తెలుగుదేశం పార్టీ కోసం 40కోట్ల విలువయిన ఎలెక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఇలాంటపుడు బాండ్ల కొనుగోలుకు, భూములకేటాయించడానికి ఏమైనా అనుబంధం ఉందేమో ననే అనుమానం రాకమానదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఏమన్నారు?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఇండోసోల్ కంపెనీని తీవ్రంగా విమర్శించారు. లక్ష రూపాయల మూలధనంతో స్థాపితమైన ఈ కంపెనీ 72,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుందని చెప్పడం "ఫేక్" అని, దాని చిరునామా పులివెందులలో ఉందని, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో దీనికి సంబంధం ఉందని ఆరోపించారు. అప్పట్లో జగన్ హయాంలో కుదిరిన ఒప్పందాలను కూడా ఫేక్ అని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇండోసోల్‌కు 8,234 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తీసుకుంది. ఇది లోకేష్ గత విమర్శలకు విరుద్ధంగా ఉంది. ఈ మార్పు రాజకీయ, ఆర్థిక ఒత్తిడులను సూచిస్తుంది. దీనిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనిమీద ఇంతవరకు లోకేష్ మాట్లాడటం లేదు.
విస్మయం కలిగిస్తున్న లోకోష్ ధోరణి
నారా లోకేష్ గతంలో చేసిన విమర్శలు, ప్రస్తుత దోరణి విస్మయం కలిగిస్తోంది. ఇంత భారీ భూసేకరణ పట్ల కూటమి ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహం టిడిపి క్యాడర్‌లో కూడా విస్మయాన్ని కలిగిస్తోంది. ఇక వైఎస్సార్‌సీపీ సంగతి చెప్పనవసరంలేదు. ఈ పార్టీ కూడా లోకేష్ లాగే నిశ్శబ్దం పాటిస్తున్నది. లోకేష్ ఐటి ప్రాజెక్టులకు భూముల కేటాయింపు కూడా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్నాయి.
టీడీపీలో నారా లోకేష్ ది రెండో స్థానం
నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటి, విద్యా మంత్రిగా కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే పార్టీ, ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్నారనేది బహిరంగ రహస్యం. 2019లో మంగళగిరిలో ఓటమి తర్వాత విమర్శలు ఎదుర్కొన్న లోకేష్, 2024 ఎన్నికల్లో టీడీపీ 94 శాతం సీట్లు సాధించడంతో రాజకీయంగా బలపడ్డారు. ఆయన యువగళం పాదయాత్ర, విద్యా సంస్కరణలు, ఐటి ప్రమోషన్ వంటి కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. అయితే ఇండోసోల్ వివాదం ఆయనపై, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను తెచ్చిపెట్టింది.
వివాదం వెనుక కారణాలు
ఆంధ్రప్రదేశ్‌ను ఐటి, పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు పెట్టుబడులను ఆకర్షించే విధానంలో భాగంగా ఇండోసోల్ వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకమని లోకేష్ భావిస్తున్నారు. ఉదాహరణకు విశాఖపట్నంలో కాగ్నిజెంట్, టిసిఎస్‌లకు 99 పైసలకు భూమి కేటాయించడంఇందులో భాగమే. ఇండోసోల్ ప్రాజెక్టు కు భూములుకేటాయింపు కూడా దీని కొనసాగింపే. అయితే రైతుల నిరసనల వల్ల లోగుట్టు బయటపడుతూ ఉంది.
ఇండోసోల్ ప్రాజెక్టు జగన్ హయాంలో ప్రారంభమైనప్పటికీ, దానిని కొనసాగించడం ద్వారా కూటమి ప్రభుత్వం రాజకీయంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుందని కొందరు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును రద్దు చేస్తే, వైఎస్సార్‌సీపీ దానిని రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు. అందుకే లోకేష్ తన గత విమర్శలను పక్కనపెట్టి, ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తున్నారని ఊహాగానాలు ఉన్నాయి.

కరేడు రైతుల నిరసనలు
కరేడు గ్రామంలో 19 రకాల పంటలు పండుతాయి. సమృద్ధిగా భూగర్భ జలాలతో సారవంతమైన భూములను ఇండోసోల్ కోసం సేకరించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జులై 4, 2025న జరిగిన గ్రామ సభలో వేలాది మంది రైతులు నిరసన తెలిపారు. భూ సేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసులు శాంతియుత నిరసనలను అడ్డుకోవడం, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీపై ఆరోపణలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
రైతులు తమ భూములు జీవనాధారమని, వాటిని కోల్పోతే ఆర్థిక సంక్షోభం ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హ్యూమన్ రైట్స్ ఫోరం ఉపాధ్యక్షులు జి రోహిత్ ఇతర రిఫైనరీల కంటే ఎక్కువ భూమి కేటాయిస్తున్నారని ఆరోపిచారు. ఈ నిరసనలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. వైఎస్సార్‌సీపీ నిశ్శబ్దంగా ఉండటమంటే తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతునీయడమే. కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఒక విధంగా ఇది అడ్డుకోవడమే. దీనికి తప్పని సరిగా ప్రభుత్వం వైసిపికి ఎక్కడో ఒక చోట కొంత ప్రతిఫలం ముట్టుచెప్పకపోదు. ఇది భవిష్యత్తులో బయటపడుతుంది.