
PM TOUR | 75 నిమిషాల టూరు.. 39 కోట్ల ఖర్చు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టూరును సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున వ్యయం చేస్తోంది. దాదాపు 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్టు అనధికార అంచనా.
ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు మరికొద్ది సేపట్లో (మే 2) రానున్నారు. రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. మరికొన్ని పనులను పునఃప్రారంభిస్తారు. కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రధాని బయలుదేరుతారు. 2.50 గంటలకు విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతికి చేరుకుంటారు. సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నుంచి 3.30 గంటలకు వేదిక వద్దకు వస్తారు. సాయంత్రం 4.45 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని పర్యటన గంట 15 నిమిషాల పాటు ఉంటుంది. అనంతరం ఆయన విజయవాడ విమానాశ్రయం చేరుకుని, సాయంత్రం 5.20 గంటలకు డిల్లీకి ప్రయాణమవుతారు. ఈ 75 నిమిషాల పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున సన్నాహాలు చేసింది. ఇందుకోసం సుమారు 39,40 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్టు అంచనా.
మోదీ పర్యటన షెడ్యూల్ ఇదీ
శుక్రవారం మధ్యాహ్నం తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానకి చేరుకునే ప్రధాని మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు.
గన్నవరం నుంచి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్ద ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు.
మధ్యాహ్నం 3.20 గంటలకు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో సభావేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
అమరావతి పనుల పునఃప్రారంభోత్సవాన్ని సూచించేలా ఏ ఆకారంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరిస్తారు. ప్రధాన వేదికపై 14మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస భూపతివర్మ, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు లోకేశ్, నారాయణ ఇతర వీఐపీలు కూర్చుంటారు. గవర్నర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ముందు ప్రకటించినా ఇప్పుడాయన పేరు ఆహ్వానపత్రంలో లేకపోవడంతో ఆయన వస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు..
సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో సభ జరుగనుంది. 5 లక్షల మందిని ఈ సభకు తరలించేలా 3,400 బస్సులు ఏర్పాటు చేశారు. మరికొన్ని వందల ప్రైవేటు వాహనాలు కూడా రానున్నాయి. 8 రోడ్లు ఇందుకు గుర్తించారు. 11 పార్కింగ్ ప్రాంతాలను ఖరారు చేశారు. ప్రధాని మోదీ సభ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అత్యవసర స్పందనకు భారీగా ఏర్పాట్లు చేసింది. సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్యులతో కూడిన 30 బృందాలని వివిధ పాయింట్లలో నియమించారు. అడ్వాన్స్‌డ్ లైఫ్ సిస్టమ్స్‌తో కూడిన ఆరు అంబులెన్సులు, బేసిక్ లైఫ్ సిస్టమ్స్‌తో కూడిన మరో 21 అంబులెన్సులు వివిధ చోట్ల అందుబాటులో ఉంటాయి. అంబులెన్సులతో కూడిన వైద్య బృందాలు విమానాశ్రయం, హెలీప్యాడ్, కాన్వాయ్ మార్గం, గ్యాలరీలు, పార్కింగ్ ప్రాంతాల్లో సేవలందిస్తాయి. సభాస్థలి వద్ద 10 పడకలతో కూడిన మూడు తాత్కాలిక ఆసుపత్రులనూ ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సభకు హాజరయ్యే వారికి మజ్జిగ, ఓఆర్‌ఎస్ అందించడానికి ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో కూడి మరిన్ని వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి భద్రతా ఖర్చులు
ప్రధానమంత్రి భద్రతను ప్రత్యేక రక్షణ బృందం (SPG) నిర్వహిస్తుంది. 2020-21 సంవత్సరానికి SPG భద్రతా కవరేజ్‌కు ₹592 కోట్లు ఖర్చు చేయబడింది, ఇది సగటున రోజుకు ₹1.62 కోట్లు లేదా గంటకు సుమారు ₹6.75 లక్షలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2, 2025న నిర్వహించే ప్రధాని టూరుకు ఈ లెక్కన సుమారు 40 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ పర్యటనలో ఆయన సుమారు ₹1 లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
జనాన్ని తరలించేందుకు, తాగునీరు, ఆహారం, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, హెలిపాడ్లు, రహదారి అభివృద్ధి వంటి ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని వ్యయం చేస్తోంది. ఈ ఏర్పాట్ల ఖర్చులు ప్రభుత్వ విభాగాల ద్వారా నిర్వహిస్తున్నారు.
ప్రధానమంత్రి మోదీ అమరావతి పర్యటనకు సంబంధించిన ఖర్చులపై అధికారిక సమాచారాన్ని ఇంకా ప్రకటించలేదు. ఇవన్నీ ఉజ్జాయింపుగా వేసిన అంచనాలే. పర్యటనల ఖర్చులు సాధారణంగా పర్యటనల స్వభావం, గమ్యస్థానం, కాలవ్యవధి, భద్రతా ఏర్పాట్లు, రవాణా, వసతి, కార్యక్రమాలు వంటి అంశాలను కలిగి ఉంటాయి.
విద్యుత్ వెలుగుల ఖర్చే సుమారు 2 కోట్లు...
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా విద్యుత్ వెలుగుల కోసం ఖర్చు వివరాలు అధికారికంగా వెల్లడించబడలేదు. అయితే, పునఃప్రారంభ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. విద్యుత్ కాంట్రాక్ట్ ప్రకారం ఒక కోటీ 25 లక్షలకు పైగా విద్యుత్ వెలుగుల కోసం ఖర్చు చేయనున్నారు. ప్రధానమంత్రి సభ తర్వాత ప్రజలు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా సచివాలయం నుంచి విజయవాడ వరకు రహదారులు విద్యుత్ వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, ప్రధాన రహదారుల మరమ్మత్తులు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వీటికి కూడా కోట్లలోనే ఖర్చు అయింది.
ప్రధాని పర్యటన నేపథ్యంలో, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. గత 24 గంటలుగా అమరావతి ప్రాంతమంతా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) ఆధీనంలోనే ఉంది. వందలాది మంది సిబ్బంది ఈ పనికి వినియోగిస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు ఎంత అయ్యేది అధికారికంగా ప్రకటించకపోయినా చాలా ఎక్కువగానే ఉంటుంది.
కంపచెట్ల తొలగింపునకే రూ.36కోట్లు..
25వేల ఎకరాల్లో రూ.36 కోట్లతో కంపచెట్ల తొలగింపు చేపట్టి పూర్తి చేశారు. గత ప్రభుత్వం నిలిపివేసిన పనుల పునఃప్రారంభం, వాటి పరిస్థితిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 23 రకాల సూచనలు చేయగా, ప్రభుత్వం ఆమోదించింది. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి వచ్చిన మొత్తంతో పాటు కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ కలుపుకొని ఏప్రిల్ 1న రూ.4,285 కోట్లు అందాయి. హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు రుణంగా తీసుకోనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 100 పనులను రూ.77,249కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే రూ.49,040కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా నిర్మించాలని చంద్రబాబు ఆలోచన. దీనికి అనుగుణంగా 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఇందులో 217 చ.కి.మీ. పరిధిలో రాజధాని నగరం నిర్మితమవుతుంది. 16.9 చ.కి.మీ. పరిధిలో కోర్ క్యాపిటల్‌ను డిజైన్ చేశారు. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సె ప్ట్‌తో ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రభుత్వం, న్యాయ, వైద్యం, పర్యాటకం, నాలెడ్జ్ ఫైనాన్స్, స్పోర్ట్స్, మీడియా, టూరిజం వంటి 9 కార్యకలాపాలపై దృష్టి సారించి 9 థీమ్‌ల్లో 9 నగరాలు ప్లాన్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత డిజైనింగ్ సంస్థ నార్మన్ పోస్టర్‌తో ముఖ్య కార్యాలయాల డిజైన్లు చేయించారు. 2014-19 మధ్యకాలంలో మొదటి దశ పనులకు అయ్యే ఖర్చు రూ.55,343 కోట్లుగా అంచనా వేశారు. 55 పనులకు రూ.42,500 కోట్లతో టెండర్లు పిలిచారు. 2019 నాటికి రూ.5,587 కోట్ల విలువైన పనులు పూర్తికాగా, 4,318కోట్ల బిల్లులు చెల్లించారు. రాజధాని ప్రాంతంలో 30 శాతం పచ్చదనానికి, జలవనరులకు కేటాయించారు. ఐఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌తో పాటు ఏడు జాతీయ రహదారులు అమరావతి అనుసంధానమయ్యేలా రూపకల్పన చేశారు. 3,300 కి.మీ.మేర సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుచేస్తారు. 131కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 1277 ఎకరాలు కేటాయించారు.
11 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
రాజధాని అమరావతిని మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం 11 కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని మోదీ ఈ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. రాజధానిలో రూ.75 వేల కోట్ల పనులు చేపట్టాలని నిర్ణయించగా.. ప్రస్తుతానికి రూ.49 వేల కోట్ల వ్యయంతో పనులు చేయడానికి టెండర్లు పిలిచారు. మోదీ శంకుస్థాపన చేసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి కాంట్రాక్టు సంస్థలన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. రాజధానికి అసలైన రూపం మరో మూడేళ్ల తర్వాత కనిపిస్తుంది. ఐకానిక్ భవనాలుగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లను మూడేళ్లలో, ఇతర ప్రాజెక్టులను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
జధానిలో సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టే కీలక ప్రాజెక్టులలో హ్యాపీనెస్ట్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ల భవనాలు,
మంత్రులు, జడ్జీల బంగ్లాలు, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం గవర్నమెంట్ కాంప్లెక్స్, ఐకానిక్ అసెంబ్లీ, ఐకానిక్ హైకోర్టు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్‌ల బంగ్లాలు, ఎల్‌పీఎస్ ఇన్ర్ఫా, ఐకానిక్ సచివాలయ టవర్లు, వరద నివారణ పనులు, ట్రంక్ ఇన్ర్ఫా వర్క్స్, రోడ్డు అనుబంధ పనులు ఉన్నాయి.
Next Story