రైతుల ఖాతాల్లో 7,000
x

రైతుల ఖాతాల్లో 7,000

బుధవారం రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు అన్నీ ఏర్పాటు చేపట్టారు.


ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద రెండో విడత అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల జేడీలకు మంత్రి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఈ నెల 19వ తేదీ బుధవారం నాడు అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత పూర్తిగా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అదే రోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం నిధులను విడుదల చేయనుంది. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నవంబర్ 19న ఘనంగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.

ఆర్హత ఉన్న రైతు చనిపోతే వారి వారసులకు ‘డెత్ మ్యూటేషన్’ త్వరగా పూర్తి చేసి పథకం ప్రయోజనం కల్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే NPCIలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న బ్యాంకు ఖాతాలను వెంటనే యాక్టివేట్ చేయాలని అధికారులకు సూచించారు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో సులువుగా నమోదు చేసుకునేలా ప్రక్రియను మరింత సరళీకరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

రెండో విడతలో మొత్తం 46,62,904 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రం వాటా రూ.5,000, కేంద్రం వాటా రూ.2,000 కలిపి ఒక్కొక్క రైతుకు రూ.7,000 ఒకేసారి ఖాతాలో జమ అవుతుంది. మొత్తం రెండో విడతలో కేంద్రం, రాష్ట్రం కలిపి రూ.3,077.77 కోట్లు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. రైతు అన్నలారా… నవంబర్ 19న రైతుల ఖాతాల్లో రూ.7,000 పడబోతోందని, ఆధార్, బ్యాంక్ లింక్, e-KYC పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు.

Read More
Next Story