ఆగస్టు 15 నుంచి ఆన్‌ లైన్లో 700 ప్రభుత్వ సేవలు
x

ఆగస్టు 15 నుంచి ఆన్‌ లైన్లో 700 ప్రభుత్వ సేవలు

రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై ప్రణాళికా శాఖపై సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు.


ఆగస్టు 15 నుంచి ఆన్‌లైన్లో 700 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ పై ప్రణాళికా శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం అన్నారు. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 3,47,871 సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి రూ. 5.42 లక్షలు తలసరి ఆదాయం వచ్చేలా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్‌ తో పనిచేయాలి.

ప్రపంచం పోకడలను గమనిస్తూ అవకాశాలను అందుకోవాలి. ప్రజలను, సమాజాన్ని, కుటుంబాలను, వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేయాలి. ఫ్యామిలీ ఒక యూనిట్‌ గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలి... కనీస అవసరాలు అందించాలి. పథకాలతో పాటు వారి ఆదాయాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు, ప్రజల ఆలోచనలు ఉండాలి. సహజ వనరులను రక్షించుకుంటూ ప్రకృతిని కాపాడుకోవాలి. ఒక పరిశ్రమలో తయారైన వేస్ట్‌ మరో పరిశ్రమకు ముడి సరుకు అయ్యేలా చేసి సర్క్యులర్‌ ఎకానమీకి నాంది పలకాలి. సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అత్యుత్తమ టెక్నాలజీని పాలనకు అనుసంధానించి మెరుగైన సేవలు అందించాలి. ఆరోగ్యం నుంచి వ్యవసాయం వరకు టెక్నాలజీని భాగస్వామి చెయ్యాలి. ప్రజల కోసం.. విజన్‌ రూపొందించుకుని పర్యావరణం దెబ్బతినకుండా చూసుకుంటూ టెక్నాలజీని అనుసుంధానం చేస్తూ పాలన సాగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అందుకే పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీ అంశాలకు పాలనలో ప్రాధాన్యం ఇస్తూ సమన్వయంతో పనిచేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ఆ దిశగా అధికారులు, ఆయా శాఖలు పనిచేయాలి అని సీఎం సూచించారు.

వివిధ రంగాల్లో రోజువారీగా మారే పరిణామాలకు.. మార్పులకు అనుగుణంగా కార్యక్రమాలు ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పుల మేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. మన ఉత్పత్తులకు విలువ జోడింపు అనేదే కీలకం. దాని ద్వారానే రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. మైనింగ్, వ్యవసాయ ఉత్పత్తుల్లో జీవీఏ ప్రధానమైన అంశం. జీఎస్డీపీ వృద్ధి అయితేనే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించగలం. వివిధ రంగాల్లో ఉత్తమ ఫలితాలు వచ్చేలా కార్యాచరణ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం ఉద్యాన పంటల ద్వారా రూ.1,26,098 కోట్లు జీవీఏ వచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆక్వా అనుబంధ పరిశ్రమ ద్వారా రూ.1.12 లక్షల కోట్ల మేర జీవీఓ జోడించినట్టు అధికారులు వెల్లడించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు ఎలా నిర్దేశిస్తున్నారో పరిశీలించండి. ప్రతీ రంగంలోనూ ఏపీ ముఖ్య భూమిక పోషించాలి. గ్రామస్థాయి నుంచి కుటుంబం వారీగా పర్యవేక్షణ జరగాలి. లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఇచ్చే నిధులకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించండి. ప్రతీ కుటుంబం తాలూకు ఆర్ధిక, ప్రజారోగ్య వివరాలు నమోదు కావాలి. ఫారెస్టు గ్రీన్‌ కవర్, ఎయిర్‌ క్వాలిటీ, తలసరి విద్యుత్‌ వినియోగం ఇలా అన్ని అంశాలను ఆయా శాఖలు నమోదు చేయాలి. కేవలం ఆదాయం, సంపద సృష్టికి మాత్రమే పరిమితం కావొద్దు.. అని ముఖ్యమంత్రి సూచించారు.
వివిధ రంగాల్లో ఫలితాలను సాధించేందుకు ఏ ప్రమాణాల్ని నిర్దేశించుకున్నారనేది కూడా కీలకం. ప్రస్తుతం అవేర్‌ ద్వారా 42 అంశాలను కొలుస్తున్నాం... వివిధ ప్రభుత్వ శాఖలు కూడా ఇదే స్థాయిలో ప్రమాణాలు నిర్దేశించుకుని ఇండికేటర్లు ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్, రవాణా, జలవనరులు, పరిశ్రమలు, స్వచ్ఛాంధ్ర ఇలా అన్ని విభాగాలూ ఇండికేటర్లను నిర్దేశించుకోవటం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాల్ని సాధించే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాణాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం అందించే 700 సేవలు ఆన్‌ లైన్‌ లో అందుబాటులో ఉంచాలి.
కేవలం 60 లక్షల జనాభా, పరిమితమైన వనరులతో సింగపూర్‌ దేశం అంతర్జాతీయంగా విజయాలు సాధిస్తోంది. భారత్‌ లో 140 కోట్లకు పైగా జనాభా, అపారమైన వనరులతో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. బయటి ప్రపంచం చూడకుండా మనకు మనమే తెలివైన వాళ్లని భావించుకోవడం సరికాదు. ఆర్టీజీఎస్‌ ద్వారా వచ్చే సమచారాన్ని క్రోడీకరిస్తే అది అతిపెద్ద సంపద అవుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఆ సమాచారాన్ని విశ్లేషించి వినియోగించుకుని ప్రభుత్వ శాఖల సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశముంది. అలాగే ప్రతీ త్రైమాసికానికీ సాధిస్తున్న పురోగతిపై ప్రభుత్వ శాఖలు సమీక్షించుకోవాలి.. అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్‌ కె.విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read More
Next Story