అమరావతిలో ఆ 7 పూర్తి కాకుండానే మరో 8 పోర్టు సిటీలా?
x

అమరావతిలో ఆ 7 పూర్తి కాకుండానే మరో 8 పోర్టు సిటీలా?

రాజధాని నిర్మాణానికి నిధుల కొరత వెంటాడుతుండగానే ఇప్పుడు 8 పోర్టు సిటీల భారం రాష్ట్రప్రభుత్వానికి పెను సవాలే అంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిపాదించిన 7 నగరాలు పూర్తి కాకుండానే మరో 8 పోర్టు సిటీల ప్రస్తావన తెరపైకి వచ్చింది. అమరావతిలో ఇప్పటికీ చెప్పుకోదగిన నిర్మాణాలు రాలేదు. తాత్కాలిక భవనాలలోనే పరిపాలన సాగుతోంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు తాత్కాలిక భవనాల్లో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మంత్రులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు కొలిక్కి వస్తున్నా కొత్త నిర్మాణాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.

ఓడరేవుల సమీపంలో 8 కొత్త పారిశ్రామిక నగరాలను నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం వంటి పోర్టుల పరిధిలో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక క్లస్టర్లతో ఈ నగరాలను నిర్మించనున్నారు. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం రూ. రూ.10,522 కోట్లతో ప్రతిపాదనలను రూపొందించారు. సాగరమాల 2.0 నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పారిశ్రామిక నగరాలతో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీలో 8 కొత్త పారిశ్రామిక నగరాలు
ఏపీలో 965 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. పోర్టులు, అనుబంధ పరిశ్రమలతో లక్షల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం దీని సొంతం. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి.. ఉపాధి అవకాశాలు సృష్టించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పటికే ఉన్న పోర్టులకు మరిన్ని వసతులు కల్పిస్తోంది. కొత్త పోర్టులు కూడా నిర్మిస్తోంది. వీటితో పాటు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోర్టుల నెంబడి 8 కొత్త పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, రాంబిల్లి, మూలపేట, దుగరాజపట్నం, కృష్ణపట్నం పోర్టుల పరిధిలో అభివృద్ది చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మించబోయే పోర్టుల అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మేరిటైం బోర్డు (ఏపీఎంబీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పోర్టుల నుంచి 100 కిలోమీటర్లల పరిధిని పోర్టు ప్రాక్సిమల్‌ ఏరియాగా గుర్తించింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు, మాస్టర్‌ ప్లాన్‌ను మారిటైం బోర్డు ఇప్పటికే సిద్ధం చేసింది. ఆ పరిధిలో పరిశ్రమలకు అవసరమయ్యే గోదాములు, నివాస ప్రాంతాలు, కార్యాలయ స్థలం వంటి తదితర ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి అనుగుణంగా.. జోన్లుగా విభజించింది. ఈ జోన్ల ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నారు. ఈ నగరాలను అభివృద్ధి చేయడం కోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో మారిటైం బోర్డు ప్రణాళికలు రూపొందించింది.
పోర్టుల సమీపంలో జరిగే కార్యకలాపాలకు అనుగుణంగా ఆయా క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. క్లస్టర్ల అభివృద్ధితో పాటు పోర్టు ప్రాక్సిమల్ ఏరియాలో ఉన్న గ్రామాలను కలుపుకుని నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నగరాలకు కావాల్సిన మౌలికసదుపాయాల నిర్మాణానికి.. సాగరమాల 2.0 నిధులు ఉపయోగించుకునేలా ప్రణాళికలు తయారు చేస్తోంది.
పారిశ్రామిక క్లస్టర్లు..
ఇప్పటికే ఉన్న విశాఖ పోర్టు సమీపంలో సముద్ర ఆధారిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేలా క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక మూలపేట పోర్టు సమీపంలో రసాయన పరిశ్రమలు, వాటికి అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే యూనిట్ల క్లస్టర్, రాంబిల్లిలో నిర్మిస్తున్న పోర్టు సమీపంలో రక్షణరంగ పరిశ్రమల క్లస్టర్‌, కాకినాడ పోర్టు సమీపంలో పెట్రోలియం ఆయిల్, లూబ్రికెంట్స్‌ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక మచిలీపట్నంలో హెవీ ఇంజినీరింగ్, ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించిన క్లస్టర్‌తో పాటు రామాయపట్నం, కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం వంటి పోర్టుల సమీపంలో.. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రంగాలకు చెందిన పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రూ.10,522 కోట్లతో పనులు..
ఆయా పోర్టుల సమీపంలో ఈ పారిశ్రామిక నగరాల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రూ.10,522.90 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. మచిలీపట్నం పోర్టులో విద్యుత్‌ సరఫరా పనులకు రూ.50 కోట్లు, నీటి సరఫరాకు రూ.50 కోట్లు.. పోర్టు పరిధిలో అభివృద్ధికి రూ.2,089.48 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతేకాకుండా కృష్ణపట్నం పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు రూ.1,376.62 కోట్లు, మూలపేట పోర్టు పరిధిలో రూ.6,742.80 కోట్లు, రామాయపట్నం పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు రూ.220 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. సాగరమాల 2.0 కింద ఈ ప్రాజెక్టులు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అమరావతి: ఏడు సబ్-సిటీల నమూనా
అమరావతి రాజధానిని ఒకే కేంద్ర నగరంగా కాకుండా, విభిన్న సేవా రంగాల ఆధారంగా ఏడు సబ్-సిటీలుగా (sub-cities) అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ప్రతి సబ్-సిటీకి ప్రత్యేక పాత్ర, ప్రత్యేక ఆర్థిక, సామాజిక లక్ష్యం ఉంటుంది.
1. Government City (ప్రభుత్వ నగరం) ఇందులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, సచివాలయం, ఎమ్మెల్యేలు, అధికారులు నివసించే గృహాలు ఉంటాయి. ఇవి 2028 నాటికి పూర్తయ్యే తొలి భవనాలుగా ప్రణాళికను రూపొందించారు.
2. Justice City (న్యాయ నగరం)- ఇందులో హైకోర్టు, అనుబంధ న్యాయ సంస్థలు, న్యాయ సేవల మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఇప్పుడు తాత్కాలిక హైకోర్టు ఉంది.
3. Finance City (ఆర్థిక నగరం)- ఇందులో బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లు, ఇన్వెస్ట్‌మెంట్, ఫిన్‌టెక్ కేంద్రాలు ఉంటాయి.
4. Knowledge City (జ్ఞాన నగరం)- ఇందులో విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలు, BITS Pilani (2026 నాటికి), మరికొన్ని ప్రముఖ విద్యాసంస్థలు ఉంటాయి.
5. Health City (ఆరోగ్య నగరం)- ఇందులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ రీసెర్చ్ సెంటర్లు, హెల్త్ టూరిజం మౌలిక వసతులు ఉంటాయి.
6. Sports City (క్రీడా నగరం)- ఇందులో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక వసతులు, స్టేడియంలు, క్రీడా శిక్షణ అకాడమీలు ఉంటాయి.
7. Electronics, Media & Tourism City- ఇందులో ఎలక్ట్రానిక్స్, మీడియా, పర్యాటక నగరం ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ, మీడియా, డిజిటల్ కంటెంట్ హబ్స్ ఉంటాయి.
ఈ సబ్-సిటీల వాస్తవ స్థితి ఎలా ఉందంటే...
ఈ మొత్తం అమరావతి ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ.65,000 కోట్లు. ఇందులో వరల్డ్ బ్యాంక్, ADB, కేంద్రం కలిపి రూ.15,000 కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. HUDCO మరో రూ.11,000 కోట్లు ఇస్తుంది. మిగతా మొత్తాన్ని ల్యాండ్ మానిటైజేషన్, PPP, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా సేకరిస్తారు. అంటే, ఈ ఏడు సబ్-సిటీలు వేర్వేరుగా కాకుండా ఈ రూ.65,000 కోట్ల ఫ్రేమ్‌లోనే దశల వారీగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.
Government City లో 2028 నాటికి కీలక భవనాలు పూర్తి చేయాలన్న టైమ్‌లైన్ పెట్టుకున్నారు. ఇది రాజధానిలో రాజకీయంగా, పరిపాలన పరంగా తప్పనిసరి భాగం కాబట్టి ముందుకు వెళ్తోంది.
Justice City ఖర్చు అంచనా రూ.3,000–5,000 కోట్లు. ఇంకా పునాదుల దశలోనే ఉంది. హైకోర్టు కట్టడం రాజ్యాంగ అవసరం. కానీ టైమింగ్ ప్రభుత్వ నగరంపై ఆధారపడి ఉంది.
Finance City – పూర్తిగా పెట్టుబడులపై ఆధారపడే సబ్-సిటీ. ప్రభుత్వ నిధులతో నేరుగా కట్టే ప్రాజెక్ట్ కాదు. PPP / Anchor Investors రాగానే ప్రారంభం అవుతుంది. అంచనా వ్యయం- రూ.8,000–12,000 కోట్లు. ఇది మార్కెట్ నమ్మకం మీద నిలబడే నగరం.
Knowledge City – ముందుకు వెళ్లిన “నాన్-గవర్నమెంట్” సబ్-సిటీ ఇది. BITS Pilani (2026 లక్ష్యం). విద్యాసంస్థలు ఎక్కువగా సొంత పెట్టుబడులతోనే నిర్మితమవతుంది. ఇది రాజధానిలో అత్యంత రియలిస్టిక్‌గా కనిపిస్తున్న సబ్-సిటీ.
Health City – మిడియం టర్మ్ ప్లాన్ సాగుతున్న సిటీ ఇది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతిపాదన స్థాయిలో ఉన్నాయి. ప్రైవేట్ హెల్త్‌కేర్ చైన్‌లపై ఆధారపడి ఉంది. ఖర్చు అంచనా- రూ.5,000–7,000 కోట్లు.
Sports City - ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. ఖర్చు అంచనా రూ.2,000–4,000 కోట్లు. ఇది రాజధాని పూర్తయ్యాకే వచ్చే “లగ్జరీ సబ్-సిటీ”.
Electronics, Media & Tourism City – ఇదో అనిశ్చితమైన సబ్-సిటీ. స్థలం ఖరారు లేదు. ఎలక్ట్రానిక్స్ రంగం ఎక్కువగా పోర్టు సిటీల వైపు షిఫ్ట్ అవుతోంది. అందువల్ల ఈ సిటీ ఇప్పుడప్పుడే టేకాఫ్ అవుతుందని భావించలేం. ఖర్చు అంచనా రూ.6,000–10,000 కోట్లు (ప్రైవేట్ పెట్టుబడులే ఆధారం )
నిధులు ఎక్కడి నుంచి తెస్తారు?
రాజధాని అమరావతికి ఇప్పటికే రెండు సార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఇంకా ఏదీ పూర్తి కాలేదు. సరిగ్గా ఈ దశలోనే మళ్లీ 8 పోర్టు సిటీలు తెర పైకి వచ్చాయి. రాజధానికి ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న అసలైన సవాల్ గా ఓ పక్క వెంటాడుతుండగా ఇప్పుడు 8 పోర్టు సిటీల భారం రాష్ట్రప్రభుత్వానికి పెను సవాలే అని చెప్పవచ్చునంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.
Read More
Next Story