పల్నాడులో ఆరుగురు సజీవదహనం
x

పల్నాడులో ఆరుగురు సజీవదహనం

ఏపీలో ఓట్లు వేసి హైదరాబాద్ కి తిరుగుపయనమైన ఆరుగురు అగ్నిప్రమాదంలో సజీవదహనమయ్యారు. పల్నాడులో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఇరు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది.


ఏపీలో ఓట్లు వేసి హైదరాబాద్ కి తిరుగుపయనమైన ఆరుగురు అగ్నిప్రమాదంలో సజీవదహనమయ్యారు. పల్నాడులో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఇరు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. బుధవారం తెల్లవారుజామున పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొని మంటలు చెలరేగడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ఆరుగురు అక్కడికక్కడే మంటల్లో కాలి మరణించగా, దాదాపు 20 మంది గాయపడ్డారు.

చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు బాపట్ల జిల్లా నిలయపాలెం నుంచి హైదరాబాద్‌కు వెళుతోంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ కు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేసి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరినట్లు గాయపడిన ప్రయాణికులు తెలిపారు.

మృతులు కాశి బ్రహ్మేశ్వరరావు (62), లక్ష్మి (58), శ్రీసాయి (9), బస్సు డ్రైవర్ అంజి, టిప్పర్ డ్రైవర్ హరి సింగ్‌ గా గుర్తించారు. మృతుల్లో ఒకరిని ఇంకా గుర్తించాల్సి ఉంది. అగ్నిమాపక యంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పింది కానీ అప్పటికి మృతులు పూర్తిగా దగ్ధమయ్యారు.

క్షతగాత్రులను చిలకలూరిపేట, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. బస్సు ఢీకొని మంటలు చెలరేగడంతో కొందరు ప్రయాణికులు వెంటనే బయటకు పరుగెత్తి ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు కిటికీ అద్దాలను పగులగొట్టి బయటకి దూకారు. అయితే వృద్ధ దంపతులు, చిన్నారి బయటకు రాలేకపోయారు.

ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 42 మంది ప్రయాణికులు ఉన్నారు. బాపట్ల జిల్లా నిలయపాలెం మండలానికి చెందిన వీరంతా సోమవారం ఓటు వేసి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు.

సీఎం జగన్ దిగ్భ్రాంతి...

పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read More
Next Story