
రెండు రోజుల్లో రాష్ట్రానికి 50వేల మెట్రిక్ టన్నుల యూరియా
వైసీపీ రైతులను గందరగోళానికి గురిచేస్తోందని మంత్రి అచ్చం నాయుడు తీవ్ర విమర్శలు
ఏపీలో యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , రెండు రోజుల్లో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తోందని వ్యవసాయ శాఖామంత్రి అచ్చంనాయుడు తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన అచ్చం నాయుడు , యూరియా సరఫరా చేయకుండా రైతులను కూటమి ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత మీడియా, సోషల్ మీడియాల్లో విస్తృతంగా కథనాలు వండివారుస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే రైతులు యూరియా దొరక్క ఇబ్బందులు పడ్డారని , వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపడేశారు.
కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా సరఫరా చేసి కొరతకు రాకుండా చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవ చూపి కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడటం వల్ల మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తోందన్నారు.వైసీపీ అన్నదాత పోరుబాట పేరుతో సృష్టించే గందరగోళంలో రైతులు ఆందోళన చెందవద్దని పిలుపునిచ్చారు.
Next Story