ఏపీలో 4 కొత్త కేంద్రీయ విద్యాలయాలు–ఎక్కడెక్కడంటే
x

ఏపీలో 4 కొత్త కేంద్రీయ విద్యాలయాలు–ఎక్కడెక్కడంటే

సోషల్‌ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ శుభ పరిణామాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ కమిటీ ఆన్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ (సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించిందని, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

చిత్తూరు జిల్లాలోని మంగళసముద్రం, బైరుగణిపల్లె (కుప్పం మండలం), శ్రీకాకుళం జిల్లా పలాస, అమరావతిలోని శాఖమూరు ప్రాంతాల్లో ఈ కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు అవుతాయి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు నాణ్యమైన విద్యా అవకాశాలు కల్పించడంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల అవసరాలను తీర్చడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆమేరకు బుధవారం తన ఎక్స్‌ ద్వారా స్పందించిన సీఎం చంద్రబాబు ‘ఈ నిర్ణయం రాష్ట్ర విద్యా వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు సర్దుబాటు అవుతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు కూడా వీటి ద్వారా తీరతాయి‘ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, మంత్రి ప్రధాన్‌లకు ట్యాగ్‌ చేశారు.
దేశవ్యాప్తంగా మొత్తం 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ఇచ్చింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యా అవకాశాలు మరింత మెరుగుపడతాయి. తెలంగాణలో కూడా 4 కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, ములుగు జిల్లా కేంద్రం, జగిత్యాల జిల్లా రూరల్‌ మండలం చెల్గల్, వనపర్తి జిల్లా నాగవరం శివారు ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి.
Read More
Next Story