జగన్‌పై ముప్పేట దాడి.. వైసీపీ ఖాళీ?
x

జగన్‌పై ముప్పేట దాడి.. వైసీపీ ఖాళీ?

సీఎం చంద్రబాబు ప్రభుత్వం జగన్‌ను, ఆయన పార్టీని బలహీన పర్చేందుకు వ్యూహ రచనకు పదును పెట్టింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కాదు మూడు పిట్టలు అన్నట్టుగా ఆపరేషన్‌ ప్రారంభించింది.


ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీపైన ముప్పేట దాడిని మొదలు పెట్టింది. అధికారంలోకి వచ్చిన తొలి నాటి నుంచే దాడికి వ్యూహాలు పన్నుతూ వచ్చింది. దీంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి.

కూటమి ప్రభుత్వ పెద్దలు తొలుత అధికారులపై దృష్టి సారించారు. అధికార పీఠంలో కూర్చోక ముందునుంచే జగన్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారనే కారణంతో అధికారులతో వేటు వేయడం మొదలు పెట్టారు. ప్రధానంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌ల నుంచి వచ్చి జగన్‌ ప్రభుత్వం చక్రం తిప్పిన వారిని ముప్పు తిప్పలు పెట్టే పనికి ఉపక్రమించింది. చంద్రబాబును కలిసేందుకు అప్పాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాలని టీడీపీ పెద్దలు ఆదేశించారు. దీంతో ఆయన సెలవుపై వెళ్లక తప్ప లేదు. శ్రీలక్ష్మి, ప్రవీణ్‌ ప్రకాష్, రజిత భార్గవ, ధర్మారెడ్డి, రేవు ముత్యాల రాజు, గోపాలకృష్ణ ద్వివేది, మురళీథర్‌రెడ్డి, నారాయణ్‌ భరత్‌ గుప్తా, మాధవీలత, అనిల్‌కుమార్‌రెడ్డి, నీలకంఠారెడ్డి, హరిత వంటి పలువురు అధికారులను టార్గెట్‌ చేసింది. వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయింట్‌లో పెట్టింది.
ఇక చాలా మంది ఐపీఎస్‌ అధికారులకు కూడా ఇదే పనిష్‌మెంట్‌ ఇచ్చారు. జగన్‌ హయాంలో డీజీపీగా పని చేసి రాజేంద్రనాథ్‌రెడ్డి, నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన పీ సీతారామాంజనేయులు, సీఐడీ చీఫ్‌గా పని చేసిన పీవీ సునీల్‌కుమార్, విజయవాడ సీపీగా పని చేసిన కాంతి రాణాటాటా, డీసీపీగా పని చేసిన విశాల్‌ గున్నీ, ఎన్‌ సంజయ్‌ కుమార్, జీ పాలరాజు, కొల్లి రఘురామిరెడ్డి, పీ పరమేశ్వరరెడ్డి, పీ జాషువా, కృష్ణకాంత్‌ పటేల్, కేకేఎన్‌ అన్బురాజన్, తిరుమలేశ్వర్‌రెడ్డి, సిద్ధార్థ్‌ కౌశల్, మేరీ ప్రశాంతి, జీఆర్‌ రాధిక, అమ్మిరెడ్డి, రవిశంకర్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డితో కలిపి దాదాపు 16మంది ఐపీఎస్‌ అదికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు.
అయితే వీరిలో కొంత మంది మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారని వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రతి రోజు ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వచ్చి హాజరు నమోదు చేసుకోవాలని, సాయంత్రం వరకు డీజీపీ కార్యాలయంలోనే ఉండాలనే నిబంధనలతో కూడిన ఆదేశాలను డీజీపీ ద్వారకా తిరుమలరావు జారీ చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుత భీమవరం ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజు కేసుతో పాటు ముంబై సినీ నటి కేసుల్లో పీ సీతారామాంజనేయులు, పీవీ సునీల్‌ కుమార్, కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ వంటి అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విచారణ చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. అటు కూటమి ప్రభుత్వం, ఇటు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల మధ్య జరుగుతున్న పోరులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అలా అధికారులపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం పార్లెల్‌గా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ మంత్రులపైన ఫోకస్‌ పెట్టింది. మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ నాయకులు దేవినేని అవినాష్‌ వంటి పలువురి నేతలపై కేసులు నమోదు చేసే కార్యక్రమాలకు తెర తీశారు. ఇప్పుడు వీరంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
మరో వైపు ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెర తీసారు. వైఎస్‌ఆర్‌సీపీలోని నేతలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్ల నుంచి ఎమ్మెల్సీలు, రాజ్య సభ ఎంపీల వరకు తమ పార్టీలోకి చేర్చుకునేందుకు వ్యూహాలు పన్నారు. మాచర్ల, కర్నూలు వంటి ప్రాంతాల్లో పలువురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, ఏలూరు వంటి పలు జిల్లాల్లో కూడా ఇదే రకంగా కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఏలూరు నగర్‌ మేయర్‌ నూర్జహాన్‌తో సహా 30 మంది కౌన్సిలర్లు మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటీవల రాజీనామా చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్య సభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావులు త్వరలో టీడీపీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు.
వైఎస్‌ఆర్‌సీపీని ఖాళీ చేయించేందుకు టీడీపీ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వైఎస్‌ఆర్‌సీపీని బలహీనం చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లపైన దృష్టి సారించారు. అక్కడ నుంచి అసెంబ్లీ నియోజక వర్గాలు, పార్లమెంట్‌ స్థాయి నాయకులను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. అలా స్థానిక సంస్థల నాయకుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వరకు ఎవ్వరినీ వదల కూడదని, టోటల్‌గా వైఎస్‌ఆర్‌సీపీని ఖాళీ చేయించి, నామ రూపాల్లేకుండా చేయాలనే దిశగా ఎత్తుగడలు వేస్తున్నారు. వీలైనంత వరకు ఎక్కువ మందిని తమ వైపు లాగేసుకునేందుకు పావులు కదుపుతున్నారని టాక్‌ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇలా అధికారులుపై ఇబ్బందులు, నాయకులపై కేసులు, ఆపరేషన్‌ ఆకర్ష్‌తో పార్టీలో చేరికలతో జగన్‌పై బహుముఖ వ్యూహంతో బలహీనం చేయడం వల్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతుందా అనే చర్చ జోరుగా జరుగుతోంది.
Read More
Next Story