ఊరు మునిగింది గానీ, ఉద్యోగాలు రాలేదు
శ్రీశైలం నిర్వాసితుల పోరాటానికి 38 సంవత్సరాలు...
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి నాలుగు దశాబ్దాలవుతూ ఉంది. ప్రాజక్టు నిర్మాణానికి అపుడు కర్నూలు జిల్లాలోని నందికొట్టూరు తాలుకాకు చెందిన అనేక మంది రైతులు భూములు ఇచ్చారు. ఇపుడు ఆంధ్రాలోని నంద్యాల జిల్లా, తెలంగాణ లోని నాగర్ కర్నూులు జిల్లాల పరిధిలో ఈ ప్రాజక్టు ఉంటుంది. ప్రాజక్టు నిర్మాణానికి 1963 జూలై 24న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పునాది రాయి వేశారు. 980లో పూర్తయింది. ఇక్కడి పవర్ ప్లాంట్ ను 1982లో ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఇది రెండు రాష్ట్రాలకు సాగు నీళ్లు, తాగు నీళ్లు ఇస్తాంది. విద్యుచ్ఛక్తి కూడా ఇస్తాఉంది. రెండు రాష్ట్రాలలో కొన్ని లక్షల ఎకరాల భూములను వ్యవసాయయోగ్యం చేసింది ఈ ప్రాజక్టు. కోట్ల మందికి ఆహారం అందిస్తూఉంది. శ్రీశైలం కరెంటు కోట్ల ఇళ్లను, పరిశ్రమలను కాంతివంతం చేస్తూ ఉంది. అయితే, ఈ ప్రాజక్టు నిర్మాణానికి భూములచ్చిన ముంపు గ్రామాల చిన్న కోర్కెను ప్రభుత్వ విస్మరించింది. అదేమిటంటే, భూములచ్చిన గ్రామాల ప్రజలకు అర్హతను బట్టి చిన్న చిన్న ఉద్యోగాలివ్వడం. ఇది ప్రభుత్వం చేసిన హామీయే.
38 సంవత్సరాలు అవుతున్నా ఈ శ్రీశైలం నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగం కలగానే మిగిలింది. ప్రభుత్వాలు మారుతున్నా వారి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. రాష్ట్రానికి, దేశానికి మేలు చేసేందుకు త్యాగం చేసిన నిర్వాసితులు మాత్రం న్యాయం కోసం నేటికీ పోరాడాల్సి వస్తోంది.
శ్రీశైలం వద్ద కృష్ణా నదిపై 1963లో జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. శ్రీశైలం ప్రాజక్టు కింద సుమారు 66 గ్రామాల్లో లక్ష ఎకరాలు మునిగిపోయాయి. 1,200 కుటుంబాలు భూములను కోల్పోయాయి. 44 రెవెన్యూ గ్రామాలు, 22 శివారు గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు. వీరికి అప్పట్లో ఎకరాకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకూ ఇచ్చారు. తమకు ఉపాధి కూడా కల్పించాలని నిర్వాసితులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో 1982 నుంచి ఉద్యమ బాటపడ్డారు. ఈ నేపథ్యంలో ఉద్యోగం ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం మాకు ఉద్యోగాలివ్వండి అని ఈ గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ పొరాటానికి 38 సంవత్సరాలయింది.
పోరాట చరిత్ర
1986లో ప్రాజక్టు ముంపు గ్రామాల ప్రజలకు ఉద్యోగాలిస్తామని అప్పటి ప్రభుత్వం నంబరు 98 జిఒ జారీ చేసింది. 1200 మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి జాబితాలో 965 మందిని అర్హులుగా ప్రకటించి, 2012లో కేవలం 120 మందికి తాత్కాలిక పద్ధతిలో లస్కర్ ఉద్యోగాలు ఇచ్చింది.మిగిలిన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. మళ్లీ పోరాటాన్ని కొనసాగించారు. ఫలితంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం రెండో జాబితాను తయారు చేయించింది. కానీ, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. తర్వాత రెండు సార్లు రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది. తర్వాత రాష్ట్రం చీలిపోయాక చంద్రబాబు ఒకసారి, వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి మరొక సారి ముఖ్యమంత్రి అయ్యారు. శ్రీశైలం ముంపు గ్రామాల ప్రజల చిన్న కోర్కెను విస్మరించారు. ఇపుడు చంద్రబాబు నాయుడు అఖండ విజయంతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. శ్రీశైలం నీళ్ల చిత్తూరు జిల్లాకే కాదు, ఆయన నియోజకవర్గం కుప్పం దాకా తీసుకుపోతామని అంటున్నారు. కాని ఆ ప్రాజక్టుకు పునాది పడేందుకు కారణమయిన గ్రామాల ప్రజల్లో అర్హులైన వారికి చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చే విషయం మీద మాట్లాడటం లేదు.
నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ ఇప్పటి వరకూ 1,460 అర్జీలు వివిధ స్థాయి అధికారులకు ఇచ్చామని, అయితే ఉద్యోగాలు ఇవ్వడం గురించి ఎవరూ మాట్లాడటం లేదని శ్రీశైలం నిర్వాసిత గ్రామాల నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి తెలిపారు.అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిర్వాసితులకు ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు. ఇలాగే కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం, ప్రసాద్‌బాబు యాదవ్ కూడా ప్రభుత్వాల నిరక్ల్య వైఖరి మీద ఆవేదన వ్యక్తం చేశారు. "శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో 12 ఎకరాలు కోల్పోయాను. రెండవ జాబితాలో నా పేరు ఉన్నా ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు. 2004 సెప్టెంబర్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాం. ఉద్యోగులు ఇస్తామని హామీ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఆ తర్వాత హామీని అమలు చేయలేదు,"అని ఆయన అన్నారు.
హామీలయితే ఉదారంగా ఇస్తున్నారు, అమలు చేయడమే సమస్య
ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ నిర్వాసితులు 2019 సెప్టెంబరు 9 నుంచి నందికొట్కూరులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షకు దిగారు. అయితే, సరే, అటు రూలింగ్ పార్టీగాని, ప్రతిపక్ష పార్టీ గాని పట్టించుకోలేదు. 60వ రోజుల తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అనుకోకుండా బాధితుల కంట పడ్డారు. ఆయన శ్రీశైలం నుంచి కర్నూలుకు వెళ్తూ నందికొట్కూరు వచ్చారు. అది మంత్రి అని తెలియగానే కారును నిర్వాసితులు అడ్డుకున్నారు. అయినకు ఈ ప్రాజక్టు, గ్రామాల త్యాగాలు, వాళ్లకి ఇచ్చిన హామీలు తెలియనే తెలియదు. ఆయన ఎలాంటి మాట ఇవ్వకుండా అక్కడి నుంచి జారుకున్నారు. నాడు 102 రోజుల తర్వాత అప్పటి నంద్యాల ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్ధర్ దీక్ష చేస్తున్న వారిని పరామర్శించేందుకు వచ్చారు. ప్రభత్వంతో మాట్లాడి తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి దీక్ష విరమింపజేశారు.అంతే, ఆ తర్వాత హామీని అమలుకానేలేదు. అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హామీని కొద్ది గా మార్పు చేసింది. ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వబోమని, ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. అదీ లేదు,. చివరకు 2024 ఎన్నికల్లో ఓడిపోయింది.
2024లో తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం కూడా వీరి సమస్యను పట్టించుకోవడం లేదు. దాని ఫలితమే ఇపుడు కొనసాగుతున్న దీక్ష.
2024 అక్టోబర్ 28న డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌కు కూడా ఒక వినతిపత్రం అందజేశారు. నవంబర్ 11న ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌లోనూ తమ గోడు చెప్పుకున్నారు. ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. న్యాయం జరగుతుందనే సూచనలు కనిపించడం లేదని దీక్షలో పాల్గొంటున్నారు ఆవేదన చెందుతున్నారు. తమ దీక్ష కొనసాగిస్తామని చెబుతూ ఉన్నారు.