జగన్‌ పాలన మొదటి నాలుగేళ్లలో 3,604 హత్యలు
x

జగన్‌ పాలన మొదటి నాలుగేళ్లలో 3,604 హత్యలు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో హత్యలు, కిడ్నాప్‌లు, మహిళలపై వేదింపులు, పిల్లలను అబ్యూజ్‌ చేసిన కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వేల సంఖ్యలో నమోదయ్యాయి.


ఎప్పుడూ చూడనంత అస్తవ్యస్థ, అనాగరికమైన పాలన గత ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆయన ట్విటర్‌ వేదికగా బుధవారం సాయంత్రం స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అశాంతి పెరిగిందని ఢిల్లీలో ధర్నా చేయడాన్ని ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్‌ చేశారు. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక 2019 నుంచి 2022 వరకు అంటే నాలుగు సంవత్సరాల్లో నేరాల వివరాలు ఆయన వెల్లడించారు.

మొదటి నాలుగు సంవత్సరాల్లో 3,604 హత్యలు, 3,377 కిడ్నాప్‌ సంఘటనలు, మహిళలపై 78,090 అఘాయిత్యాలు, పిల్లలను అబ్యూజ్‌ చేసిన కేసులు 11,149, ఎస్సీ, ఎస్టీలపై 9,757 దాడుల కేసులు నమోదైనట్లు ట్ట్విటర్‌లో సత్యకుమార్‌ వివరించారు. నాలుగు సంవత్సరాలకు సంబంధించి డీసీఆర్‌బి నివేదిక కాపీని ఆయన స్కాన్‌చేసి ట్ట్విటర్‌లో పోస్టు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయన్నారు. అస్తవ్యస్థ, అనాగరిక పాలన సాగించిన జగన్‌ ఢిల్లీలో ఆందోళన చేపట్టి చట్టంపై తప్పుడు ప్రచారం చేయడంలో దిట్ట అనిపించుకున్నారని విమర్శించారు. ఐదో సంవత్సరం గురించి చెప్పాలంటే ఈ కేసులకు ఆ కేసులు బోనస్‌ అన్నారు. మీరు ఎన్నికల్లో నిధులు ఇచ్చిన మీ పాత స్నేహితుడు అఖిలేష్‌ తప్ప మరెవరైనా వచ్చారా? అంటూ ప్రశ్నించారు.
కాగా ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో 30 వేల మంది బాలికలు ట్రాఫికింగ్‌కు గురయ్యారని ఆరోపించారు. డిసీఆర్‌బీ నివేదికలోనూ పిల్లలపై అబ్యూజింగ్‌ జరిగిందంటూ నాలుగేళ్లలో 11,149 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పార్టీ కార్యాలయంలో ఉండగా కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళ తన కుమార్తెను ఒక యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశారు. ఆ కేసు విషయంలో చొరవ తీసుకుని పోలీసులతో మాట్లాడి బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్పించారు. ఆ సందర్భంలోనూ కేంద్రం చెప్పిన ప్రకారం ఐదేళ్లలో 30వేల మంది పిల్లలు ట్రాఫికింగ్‌కు గురయ్యారన్నారు.
Read More
Next Story