మత్తు మందిచ్చి 35లక్షల బంగారం దోచుకుంది
x

మత్తు మందిచ్చి 35లక్షల బంగారం దోచుకుంది

ఇది వరకే జైలుకెళ్లొచ్చింది. సినిమాలు, సీరియల్స్‌ చూసింది. దొంగతనాల తీరు మార్చుకుంది. చివరకు కటకటాల పాలైంది.


సినిమాలు, సీరియల్స్‌ సమాజానికి ఎలాంటి మేలు చేకూర్చుతున్నాయో.. ఎటువంటి ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ఇస్తున్నాయో తెలియదు కానీ.. చెడు మార్గాల బాట పట్టేందుకు మాత్రం దారి తీస్తున్నాయి. సినిమాలు, సీరియల్స్‌ చూసి మంచిగా ఎలా బతకాలో నేర్చుకోవడం అటుంచితే, ఎలా దొంగతనాలు చేయాలో.. ఎలా గోల్డ్, డబ్బును దోచుకోవాలో నేర్చుకుంటున్నారు. సినిమాలు, సీరియల్స్‌ ప్రభావం వల్ల క్రిమినల్స్‌గా తయారవుతున్నారు. నేరాలు చేయడంలో సిద్ధ హస్తులుగా మారుతున్నారు. సినిమాలు, సీరియల్స్‌ చూసి, వాటితో ప్రభావితమైన ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళ క్రిమినల్‌గా మారిన ఘటనే దీనికి ఉదాహరణ.

ఒంగోలు దేవరపాడుకు చెందిన ఎలీశామ్మ ఎలియాస్‌ సుజాత పాత నేరస్తురాలు. దొంగతనాలు చేస్తూ పట్టుబడిన కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయితే అప్పట్లో ఆమెకు దొంగతనాలు చేయడం తెలియక పోలీసులకు చిక్కి పోయింది. జైలుకు వెళ్లింది. ఈ సారి పోలీసులకు చిక్కకుండా దొంగతనాలు చేయాలని ప్లాన్‌ చేసుకుంది. అందుకు సినిమాలు, సీరియల్స్‌ చూడసాగింది. వాటిల్లో మత్తు మందులు ఇచ్చి సులువుగా ఎలా దొంగతనాలు చేస్తున్నారో తెలుసుకుంది. వీటితో ప్రభావితమైన సుజాత తన దొంగతనాల తీరును మార్చుకుంది. మత్తు మందులిచ్చి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు అవసరమైన మత్తు మందులు ఎలా అని ఆలోచనలు చేసింది. ఈ క్రమంలో ఆమెకు ఓ బ్రిల్లియంట్‌ ఐడియా వచ్చింది. వైద్యుల వద్దకు వెళ్లి మత్తు మందులు రాయించుకోవాలని భావించింది.
దీనికి మరో ఎత్తుగడ వేసింది. మానసిక వైద్యులను సంప్రదించాలని ప్లాన్‌ వేసింది. అనుకున్న ప్రకారం ఆమె వారిని సంప్రదించింది. తన మానసిక పరిస్థితి బాగా ఉండటం లేదని.. రాత్రులు నిద్రపట్టడం లేదని.. నిద్ర పట్టేందుకు మందులు రాయాలని మానసిక వైద్యులను కోరింది. నిజమే అని నమ్మిన ఆ మానసిక వైద్యులు నిద్ర పట్టేందుకు మత్తు మందులు రాసిచ్చారు. వాటిని పెద్ద మొత్తంలో తెచ్చుకున్న సుజాత ఇక చెలరేగి పోయింది. మహిళలను టార్గెట్‌ చేసింది. బంగారం వేసుకున్న వారిని లక్ష్యంగా చేసుకునేది. పెళ్లిళ్లు, శుభకార్యాలల్లో తాను వేసుకున్న ప్లాన్‌ ప్రకారం వారిని మాటల్లో దింపి మత్తు మందులు కూల్‌ డ్రింక్స్‌లో కలిపి వారికి తాగించేది. క్రమంగా బాధితులు మత్తులోకి జారుకున్న తర్వాత తన చేతి వాటం ప్రదర్శించేది. వృద్దులు ఉన్న ఇళ్లకు వెళ్లి వారిని మచ్చిక చేసుకొని తన వద్ద ఉన్న మత్తు మందులిచ్చి చోరీలకు తెగబడేది. ఈ క్రమంలో మత్తు మందులు తాగిన ఇద్దరు వృద్దుల మరణానికి కూడా సుజాత కారణమైంది. అయితే వారు వృద్దులు కావడంతో సహజమరణాలే అని, సుజాత వల్ల చనిపోయారని వారి కుటుంబ సభ్యులు కనుక్కోలేక పోయారు. ఇలా వరుస చోరీలతో రెచ్చి పోయిన సుజతా దాదాపు లక్షల విలువ చేసే చోరీకి పాల్పడింది. బంగారం చోరీ కేసులు పెరిగి పోవడంతో పోలీసులు నిఘా పెంచారు. సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. పక్క ప్రణాళికతో సుజాతను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 37లక్షల విలువైన బంగారాన్ని ఆమె నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుజాత గురించి..
ఆమె చేసిన దొంగతనాల గురించి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ మాట్లాడుతూ.. చాలా చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడేది. ఎవ్వరికీ అనుమానాలు రాకుండా జాగ్రత్తలు తీసుకునేది. వృద్దుల ఇంటికెళ్లి ఈ మందులు తీసుకుంటే మంచిదని నమ్మించేది. తర్వాత ఎక్కువ మోతాలో మందులు కలిపి తాగించేది. వారు నిద్రలోకి జారుకున్న తర్వాత బంగారంతో ఉడాయించేది. సుజాత కారణంగా ఇద్దరు వృద్దులు కూడా చనిపోయారు. ఈమె వల్లే వారు చినిపోయారనే విషయం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఈ క్రమంలో ఒక ఒంగోలు పట్టణంలోనే తొమ్మి నేరాలకు పాల్పడినట్లు చెప్పారు. దోచుకున్న బంగారాన్ని ఎవరికీ అనుమానాలు తలెత్తకుండా విక్రయాలు చేసేది. కొన్నింటిని మార్చి ఆభరణాలు చేయించుకునేది. అలా మార్చిన వాటిని తర్వాత విక్రయించేది. కొన్నింటిని కుదువబెట్టేది. దాదాపు 500 గ్రాముల బంగారం చోరీ చేసింది. 460 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నాం. తక్కిన దానిని రాబట్టాల్సి ఉందని వెల్లడించారు.
Read More
Next Story