ఈ సీజన్ లో 35 లక్షల పెళ్లిళ్లు.. మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడంటే..
x

ఈ సీజన్ లో 35 లక్షల పెళ్లిళ్లు.. మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడంటే..

రెండు మనసులను ఏకం చేసి ఎంతోమంది మనుషులను బంధువులుగా మార్చి భవిష్యత్ కు బాటలు వేసే పవిత్ర తతంగానికి సర్వం సిద్ధమవుతున్నాయి.


తెలుగు రాష్ట్రాలు సహా దేశంలో మళ్లీ పెళ్లి భాజాలు మోగే టైం వచ్చింది. రెండు మనసులను ఏకం చేసి ఎంతోమంది మనుషులను బంధువులుగా మార్చి భవిష్యత్ కు బాటలు వేసే పవిత్ర తతంగానికి సర్వం సిద్ధమవుతున్నాయి. ఆకాశమే పందిరిగా, తారలే తలంబ్రాలుగా ప్రేమ, అప్యాయత, అనురాగాలే మణిదీపాలుగా మూడుముళ్ల బంధానికి వేలాది జంటలు తహతహలాడుతున్నారు. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు జరిగే పెళ్లిళ్ల సీజన్ ముహార్తాలు బయటకువచ్చాయి. ఈ సీజన్ లో సుమారు 4.25 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని ఓ అంచనా.


పెళ్లంటే నూరెళ్ల పంట. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనే సామెత ఉండనే ఉన్నా దాదాపు 35 లక్షల జంటలు ఏకం కానున్నాయి. వారి వారి ఆర్ధిక స్థోమతను బట్టి పెళ్లిళ్లు రకరకాలుగా చేసేందుకు తల్లిదండ్రులు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటి ట్రెండ్ డెస్టినేషన్ పెళ్లిళ్లే అయినా అందరూ అంబానీల మాదిరో ఇతర ధనవంతుల మాదిరో చేసే పరిస్థితి ఉండదు. అయినప్పటికీ ఎవరి స్థోమతను బట్టి వాళ్లు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మంచి ముహూర్తం మించి పోతోంది..
అక్టోబర్ నుంచి శరదృతువు ఆరంభమవుతుంది. అశ్వయుజం, కార్తీక మాసాలు పెళ్లిళ్లకు మంచి సీజన్లు. ఆహ్లాదకరమైన వాతావరణం, తళుక్కున మెరిసే ఎండలు, చిటుక్కున వచ్చే చిరుజల్లులు, పిండివంటలకు సుఖసంతోషాలకు మారుపేరుగా నిలిచే పండగలు ఈ సీజన్ ప్రత్యేకత. ఈ సీజన్ లో పెళ్లిళ్లు చేయడానికి మక్కువ చూపుతుంటారు మనవాళ్లు. ఆగస్టు తర్వాత అక్టోబర్ 5వరకు ముహూర్తాలు లేవు. అక్టోబర్ 5 నుంచి వరుసగా బోలెడన్ని మంచి మూహూర్తాలు ఉన్నట్టు పెళ్లిళ్ల పండితులు సూచిస్తున్నారు.
ఓ పండితుడు చెప్పిన దాని ప్రకారం అక్టోబర్ 5 నుంచి వరుసగా 27వ తేదీ వరకు లగ్నాలు ఉన్నాయి. అక్టోబర్ 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 16, 17 తర్వాత మళ్లీ మూడు రోజుల విరామం ఉంది. అక్టోబర్ 20 నుంచి మళ్ళీ పెళ్లిళ్లు చేసుకునే మంచి ముహూర్తాలు ఉన్నాయి. అక్టోబర్ 20,21, 23, 26, 27 తేదీలలో కాబోయే దంపతుల పేరు బలాలను బట్టి వివాహాలు జరిపించవచ్చు.
ఇక ఆ తర్వాత నవంబర్ నెలలో కూడా మంచి మూహూర్తాలే ఉన్నాయని వేద పండితుల ఉవాచ. నవంబర్ 3, 7,8,9,10,12, 133, 14, 16, 17, 20,21, 23, 26, 27 తేదీలలో లగ్నాలు ఉన్నాయి.
డిసెంబర్ నెలలోనైతే 5, 6, 7,8,9,10,12, 13,14,16,17,18,20,22,23,25,26 తేదీలలో లగ్నాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే కొందరు సంక్రాంతి నెల పట్టిన డిసెంబర్ 12 నుంచి సంక్రాంతి వెళ్లిపోయే వరకు పెళ్లిళ్లు చేయరు. అటువంటి వారికి జనవరి 16 నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. డిసెంబర్ 16 నుంచి వరుసగా 21వ తేదీ వరకు లగ్నాలు ఉన్నాయి. 22వ తేదీని మినహాయిస్తే మళ్లీ 23 నుంచి 27వరకు పెళ్లిళ్లు చేయవచ్చు. కొందరు పండితులు చెబుతున్న దాని ప్రకారం జనవరిలో పెళ్లిళ్ల చేయడానికి ఈ కింద పేర్కొన్న తేదీలు ఉజ్వలంగా ఉంటాయంటున్నారు. అవేమిటంటే.. జనవరి 16 (మంగళవారం), జనవరి 17 (బుధవారం), జనవరి 20 (శనివారం), జనవరి 21 (ఆదివారం), జనవరి 22 (సోమవారం), జనవరి 27 (శనివారం), జనవరి 28 (ఆదివారం), జనవరి 30 (మంగళవారం), జనవరి 31 (బుధవారం).
2025 ఫిబ్రవరి, మార్చిలో మంచి ముహూర్తాలు..
పెళ్లి భాజాలు మోగడానికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు చాలా అనువైనవి. చలికాలం ముగిసిన వేసవి ఆరంభం కావడంతో పెళ్లిళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందువల్లే ఈ కాలంలో ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఫిబ్రవరిలో 2, 3, 6, 7, 8, 9, 12, 13, 14, 15, 16, 18, 19, 21, 23, 25 తేదీలు అనువైనవి కాగా పంచాంగం ప్రకారం మార్చిలో 1, 2,6,7,12 తేదీలలో మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి.
ఇక ఏప్రిల్ లో 14వ తేదీ నుంచి పెళ్లిళ్లు చేసుకోవచ్చు. మార్చి 13 నుంచి ఏప్రిల్ 13 వరకు ముహూర్తాలు లేవు. ఏప్రిల్ 14 నుంచి మళ్లీ పెళ్లిళ్లు మొదలవుతాయి. ఏప్రిల్ 14, 16,17,18,19,20,21,25,29,30 తేదీలలో లగ్నాలు ఉన్నాయని పంచాంగ కర్తలు చెబుతున్నారు.
ఫంక్షన్ హాళ్లకు పెరిగిన గిరాకీ...
పల్లెలు మొదలు పట్టణాల వరకు ఎక్కడా ఇళ్ల వద్ద భూదేవంత పందిళ్లు వేసి తలంబ్రాలు దంచే రివాజు వెనకతట్టు పట్టింది. ఇప్పుడు కాస్త ఆర్ధిక స్థోమతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫంక్షన్ హాల్ వైపే మళ్లుతున్నారు. కొందరైతే తమకు అనువైన కల్యాణ మండపం దొరికేంత వరకు ఎదురుచూడడం కూడా ఆనవాయితీ అయింది. దీంతో ఫంక్షన్ హాళ్లకు గిరాకీ పెరిగింది. చిన్నా చితక ఫంక్షన్ హాళ్లు కూడా కనీసం లక్ష రూపాయలకు తగ్గకుండా వసూలు చేస్తున్నాయి. పెళ్లి నాలుగు నెలల ముందే ఫంక్షన్ హాళ్లు బుక్ అవుతున్నాయి. ఇక నగలు, డెకరేషన్, పూలు, వంటవాళ్లు, భాజాభజంత్రీల వాళ్లను కూడా ముందే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి.
డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్ల వేట...
సొంతూరికి దూరంగా ప్రత్యేకంగా పెళ్లిళ్లు చేసే వారి సంఖ్యా పెరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలు ప్రస్తుతం భారతదేశంలో 25కి పైగానే ఉన్నాయి. అయితే ఇవేవీ సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ఉండేవి కావనే చెప్పాలి. కోట్లలో ఖర్చు, వేలల్లో అతిథులు. ఈ పెళ్లిళ్ల సీజన్ 35 లక్షల పెళ్లిళ్లు, 4.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని ఈవెంట్ మేనేజర్లు సంబరపడుతున్నారు.
Read More
Next Story