
విదేశాల్లో ఉన్నత విద్యకు 25 పైసల వడ్డీ రుణాలు
విదేశాల్లో ఉన్నత విద్య కోరుకునే విద్యార్థులకు గొప్ప బహుమతి ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం విదేశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికీ బ్యాంకుల నుంచి 25 పైసల వడ్డీతో రుణాలు అందించే కొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. దేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, నిట్‌లు, నీట్ ఆధారిత మెడికల్ కోర్సులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎలాంటి పరిమితీ లేకుండా అన్ని వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగులు చెందిన విద్యార్థులకు ఈ అవకాశం అందుతుందని, ప్రభుత్వం రుణాలకు గ్యారంటీ ఇస్తుందని తెలిపారు. రుణం తిరిగి చెల్లింపు కాలం 14 సంవత్సరాలుగా ఉంటుంది. ఇది విద్యార్థుల భవిష్యత్తును మరింత సులభతరం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సచివాలయంలో సోమవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖల సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. "ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించాలనేది నా సంకల్పం. అధికారులు దీనికోసం కృషి చేయాలి" అని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన రూ. 1,700 కోట్లు చెల్లించకపోవడంతో విద్యార్థులే రూ. 900 కోట్లు తమ దగ్గర నుంచి చెల్లించుకున్నారని, మిగిలిన రూ. 800 కోట్లు త్వరలో విడుదల చేయాలని అధికారులు వెల్లడించారు.
సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
బీసీ విద్యార్థులకు JEE, NEET శిక్షణ
బీసీ విద్యార్థులు ఐఐటీ, నీట్ పరీక్షల్లో విజయం సాధించేలా రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కేంద్రాలు బీసీ యువకులకు ఉచిత కోచింగ్, మెంటరింగ్ అందించి, పోటీ పరీక్షల్లో వారి పాల్గొనటాన్ని పెంచుతాయి. ఇటీవల బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి 312 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐఐటీల్లో ఎంపికయ్యారు. ఇది విద్యా విభాగంలో బీసీల పురోగతిని తెలియజేస్తోంది.
రెసిడెన్షియల్ పాఠశాలలుగా హాస్టళ్లు...
రాష్ట్రంలోని అన్ని వసతిగృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చేందుకు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి సరఫరా, ఆరోగ్య సేవలు మెరుగుపరచడంతో పాటు ఒక సంవత్సరంలో మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. గురుకులాల్లో పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతిగృహాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి విద్యుత్ ఖర్చులను తగ్గించాలని ఆదేశించారు.