గిరిజన అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌లో 21 ఒప్పందాలు
x
అరకు కాఫీపై ఒప్పందం

గిరిజన అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌లో 21 ఒప్పందాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో గిరిజనుల అభివృద్ధి కోసం పలు సంస్థలు శనివారం ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.


ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమం, జీవనోపాధి, వ్యవసాయ విస్తరణ, అటవీ ఉత్పత్తుల విక్రయం, పర్యాటక రంగ ప్రోత్సాహం కోసం 21 కీలక ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి.


అరకు కాఫీ బ్రాండింగ్‌కు టాటా, స్టార్‌బక్స్‌తో ఒప్పందం

గిరిజన సహకార సంస్థ (GCC) అరకు కాఫీని దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ కేంద్రాల్లో ప్రోత్సహించేందుకు టాటా కన్స్యూమర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా అరకు కాఫీ బ్రాండ్‌ను విస్తృతంగా విక్రయ కేంద్రాలకు తీసుకెళ్లనున్నారు.

అరకు కాఫీని తమ మెనూలో చేర్చడానికి ‘స్టార్‌బక్స్’ ఒప్పుకుంది.

అమెరికాలో అరకు కాఫీని విక్రయించడానికి, భారతదేశంలో కాఫీ కియోస్క్‌లతో రిటైల్ షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి హతీ సర్వీసెస్ LLC (Limited Liability Company) GCCతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో DWACRA మహిళలు నిర్వహించే అరకు కాఫీ కియోస్క్‌లను ఏర్పాటు చేయడానికి GCCతో MEPMA ఒప్పందం చేసుకుంది.

భారతదేశంలో గిరిజన ఉత్పత్తుల కోసం రిటైల్ షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి ట్రైఫెడ్, AP-GCC మద్య ఒప్పందం కుదిరింది.

కాఫీ సాగును విస్తరించడానికి, గింజల నాణ్యతను మెరుగుపరచడానికి సెంట్రల్ కాఫీ బోర్డ్ ITDAలతో ఒప్పందం చేసుకుది.

వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు ప్రోత్సాహం

సెంట్రల్ రబ్బర్ బోర్డు ITDA రంపచోడవరంతో ఒప్పందం ద్వారా రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలు, ప్లాంటేషన్ విస్తరణకు సహకరిస్తుంది.

కాఫీ బోర్డు గిరిజన ప్రాంతాల్లో కాఫీ సాగును విస్తరించి, నాణ్యమైన ఉత్పత్తి, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ITC, ITDA పాడేరుతో 1,600 హెక్టార్లలో కాఫీ ప్లాంటేషన్‌లను విస్తరించనుంది. ఇప్పటికే 4,010 హెక్టార్లలో స్థానిక రైతు సహకార సంఘంతో కలిసి పనిచేస్తోంది.

చింతపల్లిలో గిరిజన రైతుల నుంచి రెడ్ చెర్రీల ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం స్థిరమైన సహకార మోడల్‌ను సబ్కో అభివృద్ధి చేస్తుంది.

పసుపు సాగు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, మార్కెటింగ్ కోసం ITDAతో ఎక్విప్ ఒప్పందం కుదుర్చుకుంది.


గిరిజన మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్

గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (GCC), మెప్మా (MEPMA)లతో కలిసి డ్వాక్రా (DWCRA) మహిళల ఉత్పత్తులు, అరకు కాఫీ విక్రయాలను ప్రోత్సహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా అరకు కాఫీ కియోస్క్‌ల ఏర్పాటుతో గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఫ్రాంతీయ మార్కెటింగ్, ఈజీ మార్ట్ గ్రామీణ మార్కెట్లలో గిరిజన మహిళల ఉత్పత్తుల విక్రయాలను సులభతరం చేస్తాయి. ఎక్విప్ ITDAతో ఒప్పందం ద్వారా పసుపు సాగు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విలువ జోడింపు, మార్కెట్ కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. ISB (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) గిరిజన మహిళల సీజనల్ అటవీ ఉత్పత్తుల (Non-Timber Forest Products - NTFP) వాణిజ్య సామర్థ్యం గురించి అవగాహన కల్పిస్తుంది. వాణిజ్య సామర్థ్యం గురించి అవగాహన కల్పించడం అంటే, గిరిజన మహిళలు అటవీ ఉత్పత్తులను (ఉదా: తేనె, గుగ్గిలం, ఔషధ మొక్కలు, పండ్లు, గింజలు మొదలైనవి) సేకరించి, వాటిని వ్యాపారంగా మార్చడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, అవకాశాలను అందించడం.


పర్యాటక రంగంలో హోంస్టేల అభివృద్ధి

OYO హోమ్స్, హోమీ హట్స్ గిరిజన ప్రాంతాల్లో హోంస్టేల ఏర్పాటు ద్వారా పర్యాటకులకు స్థానిక అనుభవాలను అందించి, గిరిజన కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలను పెంచనున్నాయి. గిరిజన పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయడానికి AP టూరిజం ఫోరం ఒప్పందం చేసుకుంది. సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తుంది.

విద్య, స్థిరమైన జీవనోపాధి

చేంజ్ సొసైటీ గిరిజన విద్యార్థులకు విలువ ఆధారిత విద్యను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సహజ వ్యవసాయం, మార్కెట్ మౌలిక సదుపాయాలు, స్థిరమైన జీవనోపాధి మోడళ్లపై అదనపు ఒప్పందాలు కుదిరాయి.

ఈ ఒప్పందాలు గిరిజన సంక్షేమానికి బహుముఖ విధానాన్ని ప్రతిబింబిస్తాయి. అరకు కాఫీ వంటి ఉత్పత్తుల ద్వారా గిరిజన బ్రాండ్‌లను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడం, వ్యవసాయ విస్తరణ, గిరిజన మహిళల ఉత్పత్తుల మార్కెట్, పర్యాటక రంగంలో హోంస్టేల అభివృద్ధి ద్వారా ఆర్థిక సాధికారతను సాధించడం ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యం. స్థిరమైన వ్యవసాయం, విలువ జోడింపు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా గిరిజన ప్రాంతాల్లో సమ్మిళిత వృద్ధి, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

Read More
Next Story