
వెలిగల్లు.. నీరందక రైతులు ఘొల్లు, ఘొల్లు..
రూ.200 కోట్ల ప్రాజెక్టు.. కాలువలకు మరమ్మతులు చేస్తే ఒట్టు
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది వెలిగల్లు ప్రాజెక్టు (Veligallu Project) కింద సాగుదారుల పరిస్థితి. ఈ ప్రాజెక్ట్ పూర్తయి 16 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ నిర్దేశిత ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు. కాలువల చివరి భూములకు నీళ్లు పారడం లేదు. పైగా కాలువల్లో పిచ్చిమొక్క లు పెరిగి, మట్టి, రాళ్లు పడి పూడిపోయే దశకు చేరాయి. లైనింగ్ లేకపోవడంతో.. కాలువలకు వదిలిన నీళ్లలో ఎక్కువగా ఇంకిపోవడం.. బయటకు వెళ్లిపోతున్నాయి.
తద్వారా వెలిగల్లు కుడికాలువకు ఆయకట్టు నీళ్లు అందడం లేదు. ఎప్పుడో ఐదారేళ్లకు ఒకసారి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతున్నా.. రైతులకు ఉపయోగం ఉండడం లేదు. దీంతో కుడికాలువ ఆయకట్టు చివరి వరకు నీళ్లించేందుకు.. కాలువ మరమతుల కో సం రూ.36 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కుడికాలువ రైతుల సమస్య తీరినట్టేనంటున్నారు.
ఒక్కసారీ చివరి ఆయకట్టుకు చేరని నీళ్లు...
వెలిగల్లు ప్రాజెక్టు అన్నమయ్య జిల్లా (గతంలో కడప) గాలివీడు మండలం పాపాగ్ని నదిపై నిర్మించారు. పాత కడప జిల్లాలో ఇదో ముఖ్యమైన సాగునీటి, తాగునీటి ప్రాజెక్ట్. 24,000 ఎకరాలకు సాగునీరు, 1 లక్ష మందికి తాగునీరు కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. దీని నిల్వ సామర్థ్యం సుమారు 4.64 టీఎంసీలు.
ఎడమ కాలువ కింద 2,500 ఎకరాలు, కుడి కాలువ కింద 21,400 ఎకరాలు ఆయకట్టుగా నిర్ణయించి ఈ ప్రాజెక్టును సుమారు రూ.200 కోట్లతో నిర్మించారు. 2009 ఎన్నికలకు ముందు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కాలువల నిర్మాణానికి సంబంధించి పీఎల్‌ఆర్ కంపెనీ సుమారు రూ.9కోట్లకు టెండర్లు దక్కించుకుంది. ఈ కాలువలకు అనుబంధంగా పిల్ల కాలువలు పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తయి 16 ఏళ్లయినా ఇప్పటి వరకు చివరి ఆయకట్టుకు నీళ్లు అందింది లేదు. ఈ పదహారేళ్లలో మూడు సార్లు మాత్రమే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో ప్రాజెక్టులో నీళ్లున్నా.. రైతుల పొలాలకు అందలేదనే అసంతృప్తి వెలిగల్లు ప్రాజెక్టు కుడికాలువ ఆయకట్టుదారుల్లో ఉంది.
కుడికాలువ కింద గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో కలిపి 56 కి.మీ. మేర 15 పల్లెల్లో 21,400 ఎకరాల ఆయకట్టు ఉంది. చాలా వరకు కాలువ దెబ్బతింది. కాలువలో జమ్ము, కంపలు మొలిచాయి. పెద్దపెద్ద బండరాళ్లు, మట్టిదిబ్బలు ఉన్నాయి. కాలువకు నీళ్లు వదిలినప్పుడు పలుచోట్ల కాలువకు గండ్లు పడుతున్నాయి. దీంతో 21,400 ఎకరాలకు గానూ.. కనీసం మూడు నాలుగు వేల ఎకరాలకు కూడా వెలిగ ల్లు కుడి కాలువ ద్వారా నీళ్లు అందడం లేదు.
రూ.36 కోట్లతో ప్రతిపాదనలు
వెలిగల్లు కుడికాలువ ద్వారా.. గతంలో 30 చెరువులకు నీళ్లు నింపేవాళ్లు. అయితే ఈసారి సుమారు 60 చెరువులు నీళ్లతో నింపారు. కుడి కాలువ ద్వారా 21,400 ఎకరాలు ఆయకట్టు అని అనధికారికంగా చెప్తున్నారే కానీ.. అధికారి కంగా నిర్ణయించలేదు. అయితే ఈ కాలువ ద్వారా కేవలం నాలుగు వేల ఎకరాల్లోపే ఆయ కట్టుకు నీళ్లు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కుడికాలువ మరమ్మతులకు రూ. 36 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. ఈ నిధులతో కాలువకు లైనింగ్ చేయ డం. బెడ్‌కాంక్రీట్ వేయడం, గండ్లు పడే అవకా శం ఉన్నచోట ముందస్తుగా కాంక్రీట్ గోడలు నిర్మించడం వంటి పనులు చేపట్టనున్నారు. ఈ కాలువ మరమ్మతులే పూర్తి అయితే.. ఇప్పటి వరకు అనధికారికంగా అనుకుంటున్న 21,400 ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు.
Next Story

