అదానీ సోలార్‌ ఎనర్జీకి 200ఎకరాలు–ఏపీ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌
x

అదానీ సోలార్‌ ఎనర్జీకి 200ఎకరాలు–ఏపీ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది.


ఆదానీ సోలార్‌ ఎనర్జీకి 200 ఎకరాల భూములను కేటాయించాల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రూపొందించిన ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ అధికారిక భాష కమిషన్‌ను మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాష కమిషన్‌గా పేరు మర్చాలనే నిర్ణయానికి ఏపీ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో గురువారం కేబినెట్‌ సమావేశం జరిగింది. అనంతరం మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.

దాదాపు 33 అంశాలపై చర్చించిన మంత్రి వర్గం వాటికి ఆమోద ముద్ర వేసింది. కడప మైలవరంలో 250 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 51వ సీఆర్‌డిఏ సమావేశం చేసిన ప్రతిపాదనలను మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని పరిధి 29 గ్రామాలలో రూ. 904 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలనే నిర్ణయానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాకినాడ తోట వెంకటాచలం లిప్ట్‌ ఇరిగేషన్‌ కాలువ డెవలప్‌మెంట్‌ పనులకు ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్ల చట్ట సవరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ఆఫీసు భూమి లీజు కాలపరిమితిని పెంచుతూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

చిత్తూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 100 పడకల ఆసుపత్రిగా డెవలప్‌ చేసేందుకు అంగీకరించిన మంత్రి వర్గం 56 పోస్టులను మంజూరు చేయాలనే ప్రతిపాదనలను ఆమోదించింది. ఇటీవల తెరపైకి తీసుకొచ్చిన నాల పన్ను 4శాతంలో 70 శాతం స్థానిక సంస్థలకు, మరో 30 శాతం అథారిటీలకు ఇవ్వాలనే నిర్ణయానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలిపారు. పర్యాటక ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ భూములను కేటాయించేందుకు అవసరమైన మార్గ దర్శకాలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లునకు సీఎం చంద్రబాబు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూములు కేటాయించాలనే అంశానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మద్యం ప్రాథమిక ధరలు, వేదేశీ మద్యం బ్రాండ్‌లకు టెండర్ల కమిటీ సిఫార్సులకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో 2,778 పోస్టులను భర్తీ చేయాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఏపీ సర్క్యూట్‌ ఎకానమి, వేస్ట్‌ రీసైక్లింగ్‌ పాలసీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు.

Read More
Next Story