మద్యం ప్రియుల నెత్తిపై 2శాతం సెస్‌ పిడుగు
x

మద్యం ప్రియుల నెత్తిపై 2శాతం సెస్‌ పిడుగు

ఏపీలో మద్యం దుకాణాలు ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందుబాబులకు షాక్‌ ఇచ్చింది. 2 శాతం సెస్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.


మందు బాబులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రేపటి నుంచి మద్యం దుకాణాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సెస్‌ బాంబు పేల్చింది. మద్యం అమ్మకాలపై పన్నులు కాకుండా అదనంగా 2 శాతం సెస్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మంగళవారం ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులోకి తెస్తాం, తక్కువ ధరలకే మద్యం ప్రియులకు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికే రౌండప్‌ చార్జీల పేరుతో మద్యం ప్రియులను బాదడంతో పాటు తాజాగా డ్రగ్స్‌ నియంత్రణ సెస్‌ పేరుతో 2 శాతం అదనపు బాదుడుకు ఉపక్రమించింది. ఈ 2 శాతం సెస్‌ బాదుడును తక్షణమే అమల్లోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త మద్యం పాలసీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. అందులో భాగంగా షాపులకు దరఖాస్తులను తీసుకొని లాటరీ విధానం ద్వారా దుకాణాలను కేటాయించింది.
అక్టోబరు 16 నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల మీదుగా లిక్కర్‌ వ్యాపారం సాగనుంది. సరిగ్గా దీనికి ఒక్క రోజు ముందు మద్యంపై 2శాతం సెస్‌ విధిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని డ్రగ్స్‌ నియంత్రణ, రిహాబిలిటేషన్‌ సెంటర్ల నిర్వహణకు వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి తోడు లిక్కర్‌ కొనుగోళ్లల్లో చిల్లర సమస్యలు తలెత్తకుండా ప్రివిలేజ్‌ ఫీజు కింద ఎమ్మార్పీ మీద రూ. 10 పెంచే విధంగా ప్రభుత్వం సవరణ చేపట్టింది. ఎమ్మార్పీ ధరల్లో చిల్లర సర్థుబాటు చేస్తూ రౌండ్‌ ఫిగర్‌ ఉండేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన మద్యం పాలసీతో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఏరులై పారనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాకండా అధికార పక్షం నేతలు అందినకాడికి దోచుకోనున్నారనే చర్చ కూడా సాగుతోంది.
Read More
Next Story