
సముద్రంలో కలిసిన 1969 టీఎంసీల నీరు
అసంపూర్తి ప్రాజెక్టుల కారణంగా రాయలసీమకు సక్రమంగా నీరు అందించలేకపోతున్నాం. వరద నీటిని సముద్రం పాలు కాకుండా చూడాలి.
ఏపీలో ఈ ఖరీఫ్ సీజన్ లో 1969 టీఎంసీల నదుల నీరు సముద్రం పాలైంది. కొన్ని చెరువులు ప్రభుత్వం నింపినా రాయలసీమలో అనుకున్న స్థాయిలో చెరువులు నింపలేక పోయింది. వివిధ నదీ బేసిన్ల నుంచి పెద్ద ఎత్తున నీరు సముద్రంలోకి వెళ్లింది. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలతో ఏపీ ప్రాజెక్టులు నిండగా మిగిలిన నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా బేసిన్ల నుంచి 2025 జూన్ 1 నుంచి ఇప్పటి వరకూ 1969 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలిసింది. దవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి నీరు ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ 1483 టీఎంసీల మేర సముద్రంలోకి వెళ్లింది. ప్రకాశం బ్యారేజి నుంచి డెల్టా అవసరాల వినియోగం తర్వాత సముద్రంలోకి ఈ సీజన్లోనే 468 టీఎంసీల నీరు వెళ్లింది.
వంశధార బేసిన్లో ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటికే 18 టీఎంసీలకు పైగా సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 4.38 లక్షలు, సాగర్ నుంచి 3.38 లక్షలు, పులిచింతల నుంచి 2.72 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పంట కాలువలకు 18 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పైనుంచి వరద వస్తుండడంతో 3.42 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
ఎగువ రాష్ట్రాల నుంచి వరద వచ్చిన సమయంలో రిజర్వాయర్లు నింపుకున్నా... పెద్ద మొత్తంలో నీరు సముద్రంలోకి పోతోంది. నదుల అనుసంధానం ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. సముద్రంలో కలిసే నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాల్సి ఉందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు.
రాయలసీమ అసంపూర్తి ప్రాజెక్టులు పూర్తి చేయాలి: ఏబీవీ
రాయలసీమ ప్రాజెక్టులకు కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో అందజేయాలంటే ప్రాజెక్టుల అసంపూర్తి నిర్మణాలు పూర్తి చేయాలని ఆలోచనా పరుల వేదిక నాయకులు, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావు అన్నారు. కేవలం రిజర్వాయర్స్ లో నీటిని నింపడం ద్వారా ప్రయోజనం ఉండదని, ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరా భూమి వరకు నీటిని అందించినప్పుడే పూర్తి స్థాయిలో ప్రయోజనాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.
రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పది లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. కళ్ల ముందు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల అసంపూర్తి నిర్మాణాలు పూర్తయితే పది లక్షల మందికి స్థిరమైన ఉపాధి లభిస్తుందని, వేల కోట్ల సంపద ఉత్పత్తి అవుతుందని, ప్రభుత్వం ఈ దృష్టితో ప్రాజెక్టుల నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలని కోరారు.
ఎన్టీఆర్ ప్రభుత్వం, నాటి ప్రముఖ ఇంజనీర్ రామకృష్ణయ్య చిత్తశుద్ధితో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేశారని, ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రభుత్వాల్లో ఆ చిత్తశుద్ధి లోపించిందన్నారు.
సాగునీరు లేని కర్నూలు పశ్చిమ ప్రాంతాలు: లక్ష్మీనారాయణ
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలు సాగు, తాగు నీటి కోసం అలమటిస్తున్నాయని నీటి పారుదల రంగ విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ అన్నారు. గోదావరి నీటిని పోలవరం జలాశయం నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ఆయకట్టుకు సాగు నీరందిస్తూ, నాగార్జున్ సాగర్ ఎడమ కాలువ, కుడి కాలువ ఆయకట్టు స్థిరకరణ, వెలిగొండ ప్రాజెక్టు కింద ప్రకాశం జిల్లాలో నూతన ఆయకట్టుకు, సోమశిల, కండలేరు రిజర్వాయర్ల కింది ఆయకట్టుకు అందించాలన్నారు. తద్వారా ఆదా అయ్యే కృష్ణా నదీ జలాలను శ్రీశైలం రిజర్వాయరు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు గ్రావిటీ మీద అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
బచావత్ ట్రిబ్యునల్ ఛత్తీస్గడ్ కు కేటాయించిన 148 టియంసిల ఆధారంగా ఈ పథకాన్ని నిర్మిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీ చెబుతుంటే, ఛత్తీస్గడ్ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. గంగా - కావేరి నదుల అనుసంధాన పథకంలో భాగంగా గంగా - మహానది, మహానది - గోదావరి (పోలవరం) అనుసంధానం చేయకుండా గోదావరి - కావేరి అనుసంధాన పథకాన్ని ఇచ్చంపల్లి నుంచి చేపడితే బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరంకు నికర జాలాల లభ్యత బాగా తగ్గి, ప్రమాదం ముంచుకొస్తుందన్న ఆందోళన లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయడం ద్వారా నదుల నీరు సముద్రం పాలు కాకుండా చూడొచ్చన్నారు.