
150 రోజుల్లో 150 కేసులు... అయినా మెగా డీఎస్సీ ఏమీ కాలే!
మెగా డిఎస్సీ నియామక పత్రాల పంపిణీ
మెగా డీఎస్సీపై 150 రోజుల్లో 150 కేసులు వేసినా కానీ ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీని పూర్తి చేశామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా ఇకపై ప్రతిఏటా డిఎస్సీ నిర్వహిస్తాం, నవంబర్ లో టెట్ చేపడతాం, వచ్చేఏడాది మళ్లీ పారదర్శకంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సచివాలయం సమీప ప్రాంగణంలో మెగా డిఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 150రోజుల్లో డిఎస్సీ నిర్వహించడం ఒక చరిత్ర, ఇది నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో మాకు మూడుతరాలు డిఎస్సీ ప్రకటించే అవకాశం వచ్చిందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. విద్యారంగాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకు వ్యవస్థలో పలు కీలకమైన సంస్కరణలు తెచ్చాం. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచేందుకు 9600 స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని తెచ్చాం. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావుని క్యాబినెట్ ర్యాంకుతో సలహాదారుగా నియమించాం. కారు, ఫోన్ తోపాటు కనీసం బాటిల్ నీరు కూడా ఆయన తీసుకోలేదు. ఆయన నిబద్ధతను అభినందిస్తున్నా.
నైతిక విలువలపై తాను రాసిన నాలుగు పుస్తకాలను విద్యార్థులకు అందించాలని ఆయన కోరారు. మహిళలను గౌరవించడం నర్సరీ నుంచే నేర్పించాలి. మార్పు మన ఇంటినుంచే రావాలి. మా ఇంట్లో మా తల్లి నుంచే గౌరవిస్తున్నాం. 1,2 తరగతుల పుస్తకాల్లో ఇంటిపనుల ఫోటోలను చెరో సగంగా ఉండేలా మార్పులు చేశాం. పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించాం.. శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం. నైతిక విలువలు, లింగ సమానత్వం, రాజ్యాంగం గురించి పాఠాలు రూపొందించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ 14 సార్లు డీఎస్సీలు నిర్వహించ 2 లక్షల టీచరు పోస్టులు భర్తీ చేశాం. సెప్టెంబర్ 5న టీచర్స్ డేకి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన వారు చేతులు ఎత్తండని కోరితే...హాలులో 99 శాతం మంది చేతులు ఎత్తారు. ఇదీ తెలుగుదేశం పార్టీ ఘనత....ఇదీ చంద్రబాబు డీఎస్సీల చరిత్రని లోకేష్ అన్నారు.