ఏపీలోని 145 మండలాల్లో వడగాలులు.. హెచ్చరించిన విపత్తుల సంస్థ
ఆంధ్ర ప్రజలకు విపత్తుల సంస్థ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఆంధ్ర ప్రజలకు విపత్తుల సంస్థ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరనున్నాయంటూ విపత్తుల సంస్థ ఎంపీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. రాష్ట్రంలో వడగాలుల తీవ్రత కూడా పెరుగుతోందని, ఉష్ణోగ్రతతో పాటు ఈ వడగాలులు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్ర వడగాలులు వీయొచ్చని, దాంతో పాటుగా 145 మండలాల్లో ఒక మోస్తరు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు తమ సంస్థ అంచనా వేసినట్లు కూర్మనాథ్ వివరించారు.
ఈ మండలాల్లోనే
విజయనగరం 3, పార్వతీపురంమన్యం 3, అల్లూరి 3, ఏలూరు 2, కృష్ణా 4, ఎన్టీఆర్ 13, గుంటూరు 17, బాపట్ల14, పల్నాడు 28, ప్రకాశం 27, నెల్లూరు 18, నంద్యాల 1, అనంతపురం 5, సత్యసాయి2, వైయస్ఆర్ 4, అన్నమయ్య ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. దీంతో పాటుగా ఎల్లుండి 31 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.
గురువారం ఉష్ణోగ్రతలు ఇలా
గురువారం రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మాపూరులో 44.8°C, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 44.6°C, కృష్ణా జిల్లా కోడూరులో 44.5°C, నెల్లూరు జిల్లా మనుబోలులో 44.4°C, అల్లూరి జిల్లా కూనవరంలో 44.3°C, గుంటూరు జిల్లా తుళ్లూరులో 44.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
జాగ్రత్తలు తప్పనిసరి
ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా నీడపట్టున ఉండటానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటున్నందున వీలైనంత వరకు బయటకు రావొద్దని హెచ్చరించారు. తప్పినిపరిస్థితుల్లో వస్తే టోపీ, గొడుగు, టవల్, కాటన్ దస్తులు ధరించాలని, దాంతో పాటుగా ప్రతి అరగంటకు ద్రవపదార్థాలు ఏమైనా తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేడ్ ఉంచుకోవాలని సూచించారు. అందులోను బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.