విశాఖ ప్రాంతంలో పాతికేళ్లలో 14 భూప్రకంపనలు!
x
భ్రూ ప్రకంపనల పతీకాత్మక చిత్రం

విశాఖ ప్రాంతంలో పాతికేళ్లలో 14 భూప్రకంపనలు!

విశాఖపట్నం సమీపంలో గడచిన 25 ఏళ్లలో 14 భూ ప్రకంపనలు సంభవించాయి.

విశాఖపట్నం తీవ్ర భూకంప ప్రభావిత ప్రాంతం కానప్పటికీ తరచూ స్వల్ప ప్రకంపనలు సంభవిస్తుంటాయి. అప్పుడప్పుడూ ఆ ప్రకంపనలు జనాన్ని భయకంపితులను చేస్తుంటాయి. 2000వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు గడచిన 25 ఏళ్లలో ఈ ప్రాంతంలో 14 సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వీటిలో 4కంటే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్‌తో నమోదైనవి రెండు, 3–4 మధ్య తొమ్మిది, 2–3 మధ్య రెండు, రెండు మ్యాగ్నిట్యూడ్‌తో ఒకటి చొప్పున రికార్డయ్యాయి. 2000 ఆగస్టు 15న విశాఖకు వంద కిలోమీటర్ల దూరంలోని తునికి సమీపంలో 3.3 మ్యాగ్నిట్యూడ్‌తో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వాటిని పరిశీలిస్తే.. 2001 మార్చి 26న విశాఖ సమీపంలో 3.6, 2003 ఏప్రిల్‌ 14న విశాఖ 70 కి.మీల దూరంలో 3.4 మ్యాగ్నిట్యూడ్‌తో, 2005 జులై 21న విశాఖకు ఉత్తరంగా 83 కి.మీల దూరంలో 3.7 మ్యాగ్నిట్యూడ్‌తో, 2008 మే 29న విశాఖకు 24 కి.మీల దూరంలో అనకాపల్లి సమీపంలో 3.6 మ్యాగ్నిట్యూడ్‌తో, 2013 జనవరి 1న విశాఖకు 25 కి.మీల దూరంలో 2.9 మ్యాగ్నిట్యూడ్‌తో, 2020 మార్చి 23న విజయనగరం జిల్లా సాలూరుకు 14 కి.మీల ఆగ్నేయంగా 4.7, నవంబరు 14, 2021న విశాఖపట్నానికి సమీపంలో 1.8, మార్చి 27, 2022న విశాఖపట్నానికి ఆగ్నేయంగా 24 కి.మీల దూరంలోని బంగాళాఖాతంలో 4.1, నవంబరు 24, 2022న పార్వతీపురానికి 96 కి.మీల దూరంలో 2.7 మ్యాగ్నిట్యూడ్‌తో, 2023 మార్చి 22న కాకినాడకు 50 కి.మీల తూర్పున 3.8 మ్యాగ్నిట్యూడ్‌తో, అదే ఏడాది జులై 28న విశాఖకు సమీపంలో (మ్యాగ్నిట్యూడ్‌పై స్పష్టత లేదు), అదే సంవత్సరం సెప్టెంబర్‌ 27న సాలూరుకి 16 కి.మీల నైరుతిలో 3.4 మ్యాగ్నిట్యూడ్‌తోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల సమీపంలో సంభవించిన ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.0గా రికార్డయింది. దీని భూకంప కేంద్రం భూమికి 10 కి.మీల దిగువన ఉన్నట్టు నిర్ధారణ అయింది.


రిక్టర్‌ స్కేల్‌పై మంగళవారం నాటి భూకంప త్రీవత తెలిపే గ్రాఫ్‌

ప్రాణ, ఆస్తి నష్టాల్లేవ్‌..
విశాఖపట్నం ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్నా గరిష్టంగా రిక్టర్‌ స్కేల్‌పై 4.7 మ్యాగ్నిట్యూడ్‌కు మించలేదు. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. మ్యాగ్నిట్యూడ్‌ తీవ్రత 5కంటే తక్కువ ఉండడం, భూ ప్రకంపనల సమయం ఐదారు సెకన్లకు మించక పోవడమే ఇందుకు కారణం. మంగళవారం తెల్లవారు జామున 4.20 సమయంలో మేం నిద్రిస్తున్న మంచాన్ని ఎవరో జర్రున బలంగా లాగుతున్నట్టు శబ్దం వచ్చింది. భయంతో లేచే సరికి ఆ శబ్దం ఆగిపోయింది. కాసేపటికి అది భూ ప్రకంపనలేనని అర్థమయింది. మాలాగే మా ఏరియాలో చాలామంది భయభ్రాంతులకు గురయ్యారు’ అని విశాఖలోని సీతమ్మధారకు చెందిన గృహిణి రాజేశ్వరీ పట్నాయక్‌ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌ జోన్‌–3లో ఉన్నా..
దేశంలో భూకంప ప్రభావిత ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. జోన్‌ 4, 5లపు భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న వాటిలో చేర్చారు. జోన్‌–3 సాధారణ ప్రభావం, జోన్‌–2 స్వల్ప ప్రభావం ఉన్నవిగా పేర్కొన్నారు. వాటిలో జోన్‌–3 పరిధిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, గోవా, లక్షద్వీప్, ఉత్తరప్రదేశ్, గుజరాజత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒఢిశా, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలున్నాయి. జోన్‌–3 పరిధిలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పటికీ ప్రాంతాల వారీగా తీవ్రతను చూస్తే విశాఖపట్నం జోన్‌–2, విజయవాడ, కర్నూలు, నెల్లూరులు జోన్‌–3 ప్రభావాన్ని కలిగి ఉన్న నగరాల్లో ఉన్నాయి. దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకంటే విజయవాడ భూకంప దుర్బలత ప్రభావం ఒకింత ఎక్కువ ఉన్న జాబితాలో ఉన్నట్టు స్పష్టమవుతోంది.
Read More
Next Story