ఏపీలో 12 మంది కలెక్టర్ల బదిలీ
x

ఏపీలో 12 మంది కలెక్టర్ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో వారంలో రెండోసారి IAS అధికారుల బదిలీలు, 12 మంది కలెక్టర్ల మార్పు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ను భారీ స్థాయిలో పెద్ద ఎత్తున బదిలీలు చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SC.A) శాఖ జారీ చేసిన G.O.Rt.No.1676 ఉత్తర్వుల ప్రకారం, 12 మంది IAS అధికారులను వివిధ జిల్లాల కలెక్టర్లుగా మార్చి, తక్షణమే అమలులోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ వారంలో మూడో రోజు రెండో సారి IAS అధికారుల బదిలీలు జరగడం గమనార్హం. ఈ ఉత్తర్వులను చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ గవర్నర్ పేరిట జారీ చేశారు.

రాష్ట్రంలో జిల్లా పరిపాలనను మరింత సమర్థవంతం చేయడం, ప్రభుత్వ విధానాల అమలును వేగవంతం చేయడం ఈ బదిలీల లక్ష్యంగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, కర్నూలు, బాపట్ల, గుంటూరు, విజయనగరం, తూర్పు గోదావరి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లుగా కొత్త నియామకాలు జరిగాయి.

బదిలీలు, నియామకాలు

ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఉన్న కృతికా శుక్లా ను పల్నాడు జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా నియమించారు. అక్కడ కలెక్టర్ గా ఉన్న పి. అరుణ్ బాబు బదిలీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా ఉన్న పి. రాజా బాబు ను ప్రకాశం జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా నియమించారు.

ఐ&పిఆర్ డైరెక్టర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఎక్స్-ఆఫీసియో జాయింట్ సెక్రటరీగా ఉన్న హిమాన్షు శుక్లా ను నెల్లూరు జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా ప్రభుత్వం నియమించింది. అక్కడ కలెక్టర్ గా ఉన్న ఓ. ఆనంద్ బదిలీ అయ్యారు.

CCLA కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న ఎన్. ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. అక్కడ ఉన్న ఎ శ్యాం ప్రసాద్ బదిలీ అయ్యారు.

ఎక్సైజ్ & ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా ఉన్న నిశాంత్ కుమార్ ను అన్నమయ్య జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా ప్రభుత్వం నియమించింది. శ్రీధర్ చామకూరి ని అక్కడి నుంచి బదిలీ చేశారు.

సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న డా. ఎ సిరి ని కర్నూలు జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా ప్రభుత్వం నియమించింది. అక్కడ కలెక్టర్ గా ఉన్న పి రంజిత్ బాషా బదిలీ అయ్యారు.

అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్న డా. వి. వినోద్ కుమార్ బాపట్ల జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు అక్కడ కలెక్టర్ గా ఉన్న జె వెంకట మురళి బదిలీ అయ్యారు.

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ఉన్న తమీమ్ అన్సారియా ను గుంటూరు జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు అక్కడ కలెక్టర్ గా ఉన్న ఎస్. నాగలక్ష్మి బదిలీ అయ్యారు.

రిహాబిలిటేషన్ & రీసెటిల్మెంట్ కమిషనర్, CADA కమిషనర్‌గా ఉన్న ఎస్. రామ సుందర్ రెడ్డి విజయనగరం జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. అక్కడ కలెక్టర్ గా ఉన్న బి.ఆర్. అంబేద్కర్ బదిలీ అయ్యారు.

AP TRANSCO జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న కీర్తి చెకురి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. అక్కడి కలెక్టర్ పి. ప్రసాంతి బదిలీ అయ్యారు.

అనంతపురం జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా ఓ ఆనంద్ నియమితులయ్యారు.

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా ఎ శ్యాం ప్రసాద్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కలెక్టర్ గా ఉన్న చేతన్ టి.ఎస్. అక్కడి నుంచి బదిలీ అయ్యారు.

బదిలీ అయిన కొందరు అధికారులకు కొత్తగా పదవుల నియామక ఉత్తర్వులు విడిగా జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ బదిలీలు రాష్ట్ర పరిపాలనలో సమర్థతను పెంచడంతో పాటు, జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి దోహదపడనున్నాయి. బదిలీ అయిన కలెక్టర్ లలో కొందరికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడం చర్చకు దారి తీసింది.

Read More
Next Story