ఒక్క రాజధాని.. 12 ఏళ్ల పోరాటం!
x

ఒక్క రాజధాని.. 12 ఏళ్ల పోరాటం!

జగన్ 3 రాజధానుల కథకు ముగింపు, బాబు అమరావతికి కొత్త మలుపు


ఆంధ్రప్రదేశ్ కి అమరావతే ఇక ఏకైక రాజధానిగా ఉండనుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చడానికి వీల్లేకుండా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈమేరకు సవరణ బిల్లు పెట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్నా ఇంకా క్యాబినెట్ ఆమోదం పొందనందున ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఏపీ రాజకీయాల్లో పెద్ద మలుపు అని చెప్పవచ్చు.

2014 నుంచి కొనసాగుతున్న రాజధాని వివాదాన్ని ఈ సవరణ చట్టంతో శాశ్వతంగా ముగించవచ్చు. ఇందులో TDP–BJP, జనసేన రాజకీయ సమీకరణాలూ ఇమిడి ఉన్నాయి. జగన్ తెచ్చిన మూడు రాజధానుల మోడల్‌కు ముగింపు శాసనంగా దీన్ని భావిస్తున్నారు. అమరావతి పనులు వేగవంతం అవుతున్న దశలో వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలు, బ్యాంకులకు ఇది భరోసా కల్పిస్తుందని అంచనా.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, అమరావతికి అధికారిక రాష్ట్ర రాజధానిగా చట్టపరమైన హోదా ఇవ్వడానికి కేంద్రం ఒక సవరణ బిల్లు రూపొందించే దశలో ఉంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (AP Reorganisation Act, 2014)లో మార్పులు చేయాల్సి ఉంది.
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చే దిశగా కేంద్రం వేస్తున్న ముందడుగా దీన్ని అభివర్ణిస్తున్నారు.
నాయుడు నేతృత్వంలోని TDP- NDAలో ప్రధాన భాగస్వామి. టీడీపీ పార్లమెంటు సభ్యుల మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రపర్యటనకు వచ్చిన ప్రతిసారీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని- అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా ప్రకటించాలని, అందుకు అవసరమైన చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని అడుగుతున్నారు. ఈమేరకు మీడియాలోనూ వార్తలు వచ్చాయి.
జగన్ 3 రాజధానుల ముచ్చట...
అమరావతి రాజధానిగా ఉండాలనే అంశం చంద్రబాబు రాజకీయ అజెండాలో ప్రధానమైంది. నాయుడు రూపకల్పన చేసిన ‘డ్రీమ్ క్యాపిటల్’ ఇది. ఆ ప్లాన్ ను 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భగ్నం చేశారు.
మూడు రాజధానుల భావనను ముందుకు తెచ్చారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక/ఆర్థిక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా మార్చే ప్రతిపాదన తీసుకొచ్చారు.

ఈ మోడల్ రాష్ట్రంలో పెద్ద రాజకీయ వివాదంగా మారింది. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. మూడు రాజధానుల మోడల్‌ను రద్దు చేసి అమరావతిని ఏకైక రాజధానిగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆ డిమాండ్ తోనే తిరిగి 2024లో అధికారంలోకి వచ్చారు.
అమరావతికి చట్టపరమైన హోదా?
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వం AP పునర్వ్యవస్థీకరణ చట్టం చాప్టర్ 5(2)లో సవరణకు సిద్ధమవుతోంది. ఈ సవరణలో అమరావతిని కొత్త రాజధానిగా స్పష్టంగా పేర్కొనే అవకాశం ఉంది. చట్టపరమైన హోదా తర్వాత దాన్ని గజిట్ లో ప్రకటిస్తారు. అప్పుడు మాత్రమే అది అమల్లోకి వస్తుంది. పార్లమెంట్‌లో సవరణ బిల్లు ఆమోదం పొందగానే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
.........11 ఏళ్లుగా ఏమి జరుగుతోంది?.....
🟥2014 జూన్ 2న రాష్ట్ర విభజన,10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని
• తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని అవసరం
• TDP ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక
• సింగపూర్ మాస్టర్ ప్లాన్‌తో “డ్రీమ్ క్యాపిటల్” ప్రారంభం
🟧2015–2018, అమరావతి నిర్మాణం, పెట్టుబడుల ఆశలు
• భూ సమీకరణ: 33,000 ఎకరాలు
• తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం
• ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపన (2015)
• ప్రభుత్వ నగరంగా భారీ ప్రణాళికలు
🟨2019లో ప్రభుత్వ మార్పు: జగన్ 3 రాజధానుల ప్రతిపాదన
• YCP అధికారంలోకి వచ్చాక “3 Capitals” మోడల్
విశాఖ: Executive
అమరావతి: Legislative
కర్నూలు: Judicial
•రైతుల దీక్షలు- అమరావతి ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చ
🟩2020–2022- కోర్టులు, న్యాయపోరాటాలు & చట్టపరమైన అనిశ్చితి
• మూడు రాజధానుల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
• హైకోర్టు: “అమరావతినే రాజధాని” అని కీలక తీర్పు
• ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్,కేసు కొనసాగుతుంది
🟦2024— ఎన్నికల ప్రధాన అజెండా
• TDP–Janasena, BJP: “అమరావతి ఏకైక రాజధాని” అని హామీ
• YCP: మూడు రాజధానులపై దృఢంగా నిలబడటం
🟪2024లో అధికార మార్పు- అమరావతి రీస్టార్ట్
• TDP–Janasena–BJP ఘన విజయం
• చంద్రబాబు నాయుడు సీఎం
• అమరావతి పనుల పునరుద్ధరణ
• రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు వేగం
⬛2024–2025- అమరావతే ఏకైక రాజధానిగా ప్రకటించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యత్నాలు
• కేంద్రం: AP Reorganisation Act Section 5(2) సవరణపై కసరత్తు
• లక్ష్యం: అమరావతిని చట్టపరమైన ఏకైక రాజధానిగా ఖరారు చేయడం
• న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం, కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటుకి, ఆ తర్వాత గజిట్
• TDP: “భవిష్యత్తులో అమరావతి ఏకైక రాజధాని” అనే లక్ష్యంతో ముందుకీ
...................
చంద్రబాబు నాయుడు దీనిపై ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేశారు. ప్రధానమంత్రి మోదీ దృష్టికి కూడా తీసుకువచ్చారు. చంద్రబాబుకి ఇది అత్యంత ప్రాముఖ్యమైన బిల్లు అని చెప్పవచ్చు. ఈ బిల్లును త్వరగా ఆమోదించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్ కూడా పలువురు మంత్రులతో ఈ వ్యవహారమై మాట్లాడినట్టు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కూడా ఈ విషయమై పట్టుబడుతున్నారు.
కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ ఏమవుతుంది?
కేంద్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో “రాజధాని ఎక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే” అని చెప్పింది. కానీ ఇది శాశ్వత నిర్ణయం కాదు. ఆ సమయంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చెప్పిన అభిప్రాయం మాత్రమే. ఇప్పుడు పరిస్థితులు మారాయి, మూడు రాజధానుల వివాదం రాష్ట్రంలో పెద్ద గందరగోళం సృష్టించింది. అందుకే కేంద్రం ఇప్పుడు అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టం ద్వారా స్పష్టంగా నిర్ణయించాలనే దిశగా అడుగులు వేస్తోంది.

ఒకసారి పార్లమెంట్ చట్టం ఆమోదిస్తే, పాత అఫిడవిట్ ఆటోమేటిక్‌గా ప్రాముఖ్యత కోల్పోతుంది. అఫిడవిట్ కంటే చట్టమే ఎప్పుడూ అధికారికమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే- కేంద్రం అప్పటి మాట వేరు, ఇప్పటి నిర్ణయం వేరు. కానీ చట్టం అమల్లోకి వచ్చాక అదే ఫైనల్.
ఇప్పుడేం జరుగుతోందీ?
అమరావతిలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక వేత్తలకు భరోసా కలగాలంటే ఈ చట్ట సవరణ అవసరం. అనివార్యం. లేకుంటే ప్రభుత్వాలు మారినపుడల్లా రాజధాని మారిపోతే పెట్టుబడిదారులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు కూడా అదే మాట చెబుతున్నారు. "అమరావతిని చట్టపరమైన రాజధానిగా ప్రకటిస్తే, భవిష్యత్‌లో ఏ ముఖ్యమంత్రి వచ్చినా రాజధాని మార్పు చేసే అవకాశం ఉండదు" అనేది చంద్రబాబు వాదన.
న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా లభించింది!
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, సవరణ ప్రతిపాదనకు న్యాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇప్పుడు మిగిలింది కేబినెట్ ఆమోదం, అనంతరం పార్లమెంట్ ఆమోదం మాత్రమే. ఈ బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టకపోతే ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈ సవరణ ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మార్పు అని చెప్పవచ్చు. చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యమైన అమరావతి రాజధాని ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చినట్టవుతుంది.
Read More
Next Story