ఏపీలో పిడుగులు పడి 10 మంది మృతి
x

ఏపీలో పిడుగులు పడి 10 మంది మృతి

2,224 హెక్టార్లలో వరి, 138 హెక్టార్లలలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ను నిర్వహించారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం, సోమవారాల్లో పిడుగులు పడి, ఈదురుగాలుల వర్షాలకు 10 మంది వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు ప్రభుత్వం నిర్థారించింది. తిరుపతి జిల్లాలో ఎక్కువ మంది పిడుగులకు బలయ్యారు. నలుగురు వ్యక్తులు తిరుపతి జిల్లాలో మృత్యువాత పడ్డారు. బాపట్ల జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, ఏలూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు.

రేపటిలోగా నష్టపరిహారం చెల్లించాలిః సీఎం చంద్రబాబు
మరో వైపు ఆదివారం, సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు మంగళవారం సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటనష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా పిడుగుపాటుకు గురై చనిపోయిన బాధితుల కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ప్రాణ నష్టం గురించి అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. జిల్లాల్లో అకాల వర్షాలు, ప్రస్తుత పరిస్థితులను గురించి సీఎంకు కలెక్టర్లు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ....రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. పిడుగుల పడే సమయాల్లో ప్రజల సెల్‌ ఫోన్‌లకు సందేశం వెళ్లని సమయంలో దగ్గరగా ఉన్నట్లైతే నేరుగా వెళ్లి అప్రమత్తం చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా సచివాలయాల్లోని సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లాల్లో పరిస్థితులను బట్టి కిందిస్థాయి అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
2,224 హెక్టార్లలో వరిపంట నష్టం
అకాల వర్షాలతో రాష్ట్రంలో 2,224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాల నివేదికను సీఎంకు అందజేశారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, సత్యసాయి జిల్లాల్లో ఈ పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మండలాల్లో 1,033 హెక్టార్లలో వరిపంట దెబ్బతిందని వివరించారు. నంద్యాల జిల్లాలో 641 హెక్టార్లలో, కాకినాడ జిల్లాలో 530 హెక్టార్లలో, సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో వరిపంట దెబ్బతిందని అధికారులు వివరించారు.
138 హెక్టార్లలలో ఉద్యాన పంటలకు నష్టం
అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న హార్టికల్చర్‌ పంటల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అరటి, బొప్పాయి, మామిడి, తదితర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ఎక్కువగా అరటి, మామిడి పంటలకు నష్ట వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 138 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉద్యానవన పంటలకు నష్టం కలిగిందని అధికారులు వివరించారు.
ధాన్యం కొనలేదనే మాట రాకూడదు
రబీలో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ సీఎంకు వివరించారు. ఇప్పటికే 13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. వర్షాలకు రంగు మారిన ధాన్యం కూడా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ....రైతుల వద్దనున్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రావాల్సిన పంటకంటే అదనంగా వస్తే అవసరమైతే కేంద్రంతో మాట్లాడి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏ ఒక్క రైతు నుంచి కూడా తమవద్ద ధాన్యం కొనలేదనే మాట ఉత్పన్నం కాకూడదని అన్నారు. అధికారులు మాణవీయ కోణంతో పనిచేయాలి అని ఆదేశించారు.
విద్యుత్‌ శాఖ సిబ్బంది, అధికారులకు అభినందన
అకాల వర్షాలకు ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను తక్షణం పునరుద్ధరించడంలో కృషి చేసిన విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
Read More
Next Story