
ఏపీలో 10 భారీ పారిశ్రామిక పార్కులు
రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 10 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పారిశ్రామికవేత్తల నుంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఏపీఐఐసీ వద్ద అందుబాటులో ఉన్న భూముల్లో వాటిని ప్రతిపాదించింది. విశాఖ-చెన్నై (వీసీ), హైదరాబాద్-బెంగళూరు (హెచ్‌బీ) పారిశ్రామిక కారిడార్లకు సమీపంలో కొన్ని పార్కులను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలను వినియోగించుకునేలా అనకాపల్లి, కర్నూలు జిల్లాల్లో కొన్ని పార్కులను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది.
కాంట్రాక్టర్ల ఎంపికకు ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) ప్రకటన జారీ చేసింది. మొత్తం 4,012.46 ఎకరాలను పార్కుల కోసం ప్రతిపాదించింది. ఆసక్తి ఉన్న సంస్థలు జూన్ 6లోగా బిడ్‌లు దాఖలు చేసుకోవాలని గడువు నిర్దేశించింది.
కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పించేలా...
కాంటాక్టు సంస్థల నుంచి వచ్చే స్పందన మేరకు.. పార్కులు అభివృద్ధి చేయడం ద్వారా వచ్చే ప్రయోజనంలో, పెట్టుబడి పెట్టినవారికి ఏపీఐఐసీ ఎంత ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల పాలసీ నిబంధనలకు అనుగుణంగా డెవలపర్లకు ప్రోత్సాహకాల చెల్లింపు ఉంటుంది.
ఒప్పందంలో భాగంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా భూముల అభివృద్ధి, గోదాములు, స్కిల్, శిక్షణ కేంద్రాల వంటివి గుత్తేదారు సంస్థ కల్పించాలి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే నెట్‌వర్క్‌లను అనుసంధానించడం. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసే పార్కులకు అక్కడి నెట్‌వర్క్‌ను వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రతిపాదించింది. నగరి దగ్గర ప్రతిపాదించిన పార్కు కోసం తమిళనాడులోని తిరుత్తణి రైల్వే స్టేషన్‌తో పాటు, చెన్నై పోర్టును వినియోగించుకోవాలన్నది ఆలోచన.
ప్రతిపాదించిన 10 పార్కుల్లో.. రెండు మినహా మిగిలిన వాటికి రైలు, రోడ్డు, పోర్టులకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసింది.
బిడ్ దక్కించుకున్న గుత్తేదారు సంస్థ పార్కు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, డీపీఆర్‌ను ఏపీఐఐసీతో సంప్రదించి రూపొందించాలి. అవసరమైన నిధుల సర్దుబాటుకు ఉన్న అవకాశాలను వివరించాలి.
ప్రాజెక్టుకు మార్కెటింగ్ ప్రచారాన్ని కల్పించాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిర్వహణ కల్పించాలి.
ప్రాజెక్టును వినియోగించుకునే వారి నుంచి వసూలు చేయాల్సిన ఫీజులు, ఛార్జీలు, భూములు కేటాయించినందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని వసూలు చేసే బాధ్యత వారిపైనే ఉంటుంది.